త్వరలోనే రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం

త్వరలోనే రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం– కర్నాటకలో కాంగ్రెస్‌ వచ్చింది కరెంటు పోయింది
– నీళ్లు కావాలా.. కన్నీళ్లు కావాలా..?
– కృష్ణా జలాలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం : కొడంగల్‌ రోడ్‌ షోలో మంత్రులు : కేటీఆర్‌, పట్నం మహేందర్‌ రెడ్డి.
– నామినేషన్‌ వేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి : పట్నం నరేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్‌/కోస్గి
ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి త్వరలోనే జైల్‌కు వెళ్లడం ఖాయమని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గతంలో ‘ఓటుకు నోటు.. ఇప్పుడు సీటు రేటు’ అంటూ రేవంత్‌పై ఘాటు విమర్శలు చేశారు. గురువారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పట్నం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని మరోసారి కొడంగల్‌ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రమోషన్‌ పక్కాగా ఇప్పిస్తామన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతోనే కరెంటు పోయిందని ఎద్దేవా చేశారు. కర్నాటక రైతులు కొడంగల్‌కు వచ్చి తాము కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామంటూ ధర్నా చేశారని గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంటును ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కాదని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రధాని మోడీ రూ.400 గ్యాస్‌ను రూ.1200 వందలకు పెంచారని గుర్తు చేశారు. రెండేండ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణ జలాలను కొడంగల్‌కు తీసుకొచ్చి.. 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణపై సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోడీ దండయాత్ర చేస్తున్నారన్నారు. ఎవరు వచ్చినా భయపడేది లేదన్నారు. రేవంత్‌రెడ్డికి ఓట్లు వేస్తే కొడంగల్‌ను ప్లాట్లు చేసి అమ్ముతారని తెలిపారు. కోటి రూపాయలతో నలుగురు సర్పంచులను కొనాలని చూసిన రేవంత్‌ రెడ్డిని డబ్బులతో పోలీసులకు వట్టించిన సర్పంచ్‌ నరసింహను అభినందించారు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో లీడర్లని కొంటున్నావు కానీ.. కొడంగల్‌ ప్రజలను మాత్రం కొనలేవని అన్నారు. తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని అన్నారు. 93 లక్షల రేషన్‌ కార్డుదారులకు రూ.5లక్షల కేసీఆర్‌ బీమా, రైతుబంధు రూ.16 వేలకు పెంపు, ఆరోగ్య శ్రీ రూ.15 లక్షలకు పెంపు, సౌభాగ్య లక్ష్మీ పథకం కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.3000, ఆసరా పింఛన్లను విడతల వారీగా రూ.5వేలకు పెంచుతామంటూ బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను వివరించారు. సభ అనంతరం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. సభలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.