రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌ది డూప్‌ఫైట్‌

రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌ది డూప్‌ఫైట్‌– సర్వేలన్నీ మాకే అనుకూలం : డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌ల మధ్య డూప్‌ఫైట్‌ నడుస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీల తీరును గమనిస్తున్నారనీ, తెలంగాణలో సైలెంట్‌ ఓటింగ్‌తో బీజేపీకి అధిక ఎంపీ స్థానాలు రాబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కమ్యూనిస్టులు ఏకం అయ్యారన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ సాకుతో శ్రీరామనవమిని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కోణంలో చూసిందని విమర్శించారు. సర్వేలన్నీ తమ పార్టీ వైపే ఉన్నాయనీ, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ సాధ్యం కాబోతున్నదని చెప్పారు.
12 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉందన్నారు. కూటమిలో పార్టీలు కూడా కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదనీ, పంజాబ్‌, కేరళ, వెస్ట్‌ బెంగాల్‌, తమిళనాడులో ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదని చెప్పారు. దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్‌కు 40 సీట్లు రావని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల మధ్య ఆధిపత్యపోరుతో సీఎం రేవంత్‌రెడ్డి అభద్రతాభావంలోకి కూరుకుపోయారన్నారు. బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒప్పందం వల్లనే కవితను అరెస్టు చేయడం లేదని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారనీ, ఇప్పుడేమో ఆమె బెయిల్‌ కోసం బీజేపీ-బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కిషన్‌రెడ్డి ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేస్తారనీ, ఆ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.