రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి

– లేకపోతే తీవ్ర పరిణామాలు:బీఆర్‌ఎస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కుల దురహంకారంతో గొల్లకురుమలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడారు. లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు నేరచరిత్ర ఉందా? ఓటుకు నోటు దొంగ రేవంత్‌ చెప్పాలని ప్రశ్నించారు. గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలనీ, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. యెగ్గే మల్లేశం మాట్లాడుతూ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను రేవంత్‌ రెడ్డి కులం పేరుతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేని రేవంత్‌ను వచ్చే ఎన్నికల్లో గొల్లకురుమలు ఓడిస్తారని హెచ్చరించారు. రేవంత్‌ దురహంకారానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.