– అవినీతి అరోపణలపై మంత్రి వేముల ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్
అమరవీరు జ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలు మతిలేని మరగుజ్జు మాటలుగా రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొట్టిపారేశారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచిత మనస్తత్వంతో రేవంత్‌ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా మనసు పెట్టి అమరుల స్థూపాన్ని నిర్మించిందనీ గుర్తు చేశారు. ఒటు రాజకీయాల కోసం కాదని వ్యాఖ్యానించారు. ఒకసారి రేవంత్‌రెడ్డి ఆరు అంతస్థుల అమరజ్యోతిపి సందర్శించి అక్కడ ఏర్పాట్లు చూస్తే నిర్మాణం గొప్పతనం అర్థమవుతుందని సూచించారు. తెలంగాణ అమర వీరుల త్యాగాల గురించి మాట్లాడే నైతికహక్కు కాంగ్రెస్‌కు లేదని తేల్చి చెప్పారు. అసలు అమరుల బలిదానాలు జరిగిందే కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం, గందరగోళ ప్రకటనల వల్ల అని గర్తుచేశారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని..కామన్ మినిమం ప్రోగ్రాం(సీఎంపీ)లో పెట్టి మాట తప్పారని చెప్పారు. 2009 డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసి వెనక్కు తీసుకున్నారు. అందుకే బలిదానాలు జరిగాయని చెప్పారు. కేసిఆర్, కెటిఆర్‌ను వ్యక్తిగతంగా తిడితే వార్తల్లో ఉంటాననే ఆరాటంతో రేవంత్ పసలేని ఆరోపణలు చేస్తున్నాడనీ, బ్లాక్ మెయిలర్‌తో నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని మంత్రి వేముల ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ఉద్యమకారులపైకి పిట్టలదొరలా తుపాకీతో వెళ్లిన నీవా అమరవీరుల గురించి మాట్లాడేది ? నీవు అమరవీరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయి. అమరుల త్యాగాల గురించి అసలు రేవంత్‌రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నడంటూ నిలదీశారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.