– గ్యారెంటీలను పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదు
– ఎంపీ అభ్యర్థులను మార్చం
– మజ్లీస్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్ తాపత్రయం
– హామీల అమలులో ప్రభుత్వం విఫలం : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఓబీసీ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వడ్ల నందు, చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన, పీఎసీఎస్ చైర్మెన్ రాజునాయక్, కోటిపల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు బీజేపీలో చేరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. గ్యారెంటీలను అటకెక్కించి పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రజల దృష్టి మరల్చేందుకు, సానుభూతి పొందేందుకు తనపై కుట్రలు పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని గెలపించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందనీ, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆ పార్టీ నేతలు ఒప్పుకోవడం లేదని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నదని ఆరోపించారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు కుటుంబాల కోసం, కొడుకులను సీఎం చేయడం కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యయనమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ భగీరథుడు కాడనీ, బిడ్డతోని ఢిల్లీ వరకు మద్యం పారించిన వ్యక్తి అని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మజ్లిస్ రహస్య సంధి కుదురుస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదనీ, అలాంటి అవకాశవాద రాజకీయాలను ప్రజలు గ్రహించి తగిన బుద్ది చెప్పాలని కోరారు. రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నదనీ, దీనిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఎంఐఎం విధానాలతో విభేదాలున్నప్పటికీ తమ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగానే ఒవైసీని గెలిపిస్తామని ఫిరోజ్ ఖాన్ బాహాటంగానే ప్రకటించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డిని సమర్థించడం తమ పార్టీ వాళ్లకే నచ్చడం లేదని వీహెచ్ చెబుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు కూల్చాలననే ఉద్దేశం తమకు లేదనీ, ఐదేండ్లు సజావుగా కొనసాగాలని కోరకుంటున్నానని చెప్పారు. విపక్ష ఇండియా కూటమిలోని సగం మంది బెయిల్ మీద బయట తిరుగుతున్నారనీ, జైల్లో ఉన్న నాయకులకు కూటమి నాయకులు వంతపాడుతున్నా రని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీపై ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మోడీ ప్రభంజనం ముందు అన్నీ కొట్టుకుపోతాయన్నారు. తమ పార్టీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.