– ఆగస్టు తర్వాత హామీలు ఎలా సాధ్యం? : బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్
నవతెలంగాణ-నిజామాబాద్
వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో అరవింద్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు వంద రోజుల్లో హామీలను అమలుచేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి తెరలేపుతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని, ఆతర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతోందని, కాబట్టి ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని, అలా వస్తే సీఎం రేవంత్‌ను ఎవరు కాపాడుతారని అన్నారు. సమర్ధుడైన సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు.