ముఠా నాయకుడిలా రేవంత్‌రెడ్డి మాటలు

– ఆరు గ్యారంటీలపై చిత్తశుద్ధి ఏదీ? : దాసోజు శ్రవణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రేవంత్‌రెడ్డి సీఎంలాగా కాకుండా ఓ ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం ఏడుపు ఆపి ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరిట కొత్తగా దరఖాస్తుల స్వీకరణ టైంపాస్‌ కోసమేనని విమర్శించారు. తెల్లరేషన్‌ కార్డులున్నవారికే సంక్షేమ పథకాలు అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.ఖజానాలో లంకె బింద ఉండదదనీ, తెలంగాణ మొత్తం లంకె బిందనే అని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టి అబాసుపాలైందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలపై ఆరోపణలు చేసేముందు తాము అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెనక్కి వేసుకున్నారని నిలదీశారు. రైతు బంధు డబ్బులివ్వడం చేత కాని రేవంత్‌ గతంలో కూడా ఇలాగే జరిగేదని చెప్పి నవ్వుల పాలయ్యారన్నారు. పాలన అంటే పరనింద, పరుషజాలం వాడటం కాదని సూచించారు.