– ఏ హామీనీ నెరవేర్చలేదు : బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”రైతులకు రైతు బంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బోగస్, పంటలు కొనే దిక్కు లేదు. పత్తి రైతులకు మద్దతు ధర లేదు. రైతు భరోసా ఊసే లేదు. రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చారా? రుణ మాఫీకీ, దీనికి లింకు పెట్టడం ఏమిటి?” అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదనీ, సర్కారు సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 25 విదేశీ పర్యటనలు చేశారన్నారు. హడావిడిగా అభయహస్తం దరఖాస్తులు తీసుకుని, ఇప్పటికీ దానిపై ఏ ప్రకటన చేయలేదన్నారు. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారనీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయట్లేదని చెప్పారు.పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని ఎద్దేవా చేశారు.