– మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీకి చర్యలు : కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బొగ్గు, ఖనిజాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో, ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతుందని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్‌షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా రంగాల నుంచి తగినంత ఆదాయం వచ్చేది కాదనీ, అందుకు ఒడిశా రాష్ట్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ఏటా రూ.40వేల కోట్లు మైనింగ్ ద్వారా సమకూరుతున్నాయని తెలిపారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు క్లీన్ ఎనర్జీని పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 373 మైనింగ్ బ్లాక్స్ వేలం పూర్తయినట్టు తెలిపారు.