నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 10, 11 వ డివిజన్ ల పరిధిలోని బొందెం చెరువు, భారత రాణి నగర్ కాలనీలలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం శనివారం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే ఉదయం నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్, తాసిల్దార్ బాలరాజు, పోలీస్ అధికారుల సమక్షంలో జెసిబి లతో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను, రేకుల షెడ్లను జెసిబి లతో కూల్చారు. గత ప్రభుత్వ సమయంలో ఆనాటి అధికార పార్టీ కార్పొరేటర్లు ఇల్లీగల్గా బొందెం చెరువు శిఖం భూమిలో వెంచర్ ఏర్పాటు చేశారు. వారికి నాటి మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు అండగా ఉండి అన్ని రకాల అనుమతులు అందించారు. చెరువు శిఖం భూమిలో ఏకంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సహకరించారు. మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు సెల్ఫ్ అసెస్మెంట్ కింద కేటాయించడంతో అక్కడ అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతుండడంతో స్థానికులు కొందరు జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఒక కార్పొరేటర్, మరో కార్పొరేటర్ భర్త అందులో కీలక పాత్ర పోషించారని శిఖం భూమిలో ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కడ నిర్మాణాలు చేసి ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని డాక్టర్ భారతీరాణి నగర్ కాలనీలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పట్టాలకు బదులు కొత్త పట్టాలను తయారుచేసి క్రయ విక్రయాలు జరిపిన ప్రాంతంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అదేవిధంగా బొందెం చెరువు శిఖం భూమిలో వెలిసిన వెంచర్ లో జరుగుతున్న నిర్మాణాలను కూడా కూల్చివేశారు. ఎవరు కూడా మున్సిపల్, రెవిన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా లేదా ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తారా అని ప్రజలు భావిస్తున్నారు. ఎలా అయితే నిజామాబాద్ అర్బన్ లో చాలా వరకు భూములను కబ్జా చేశారని వాటిని కూడా ప్రభుత్వ అధికారులు ఇలా చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.