– పేదలకు నామాలు… పెద్దలకు వరాలు
– కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వ దన్ను
-పన్నుల్లో కోతలు… రాయితీలు… ప్రోత్సాహకాలు
– మధ్య తరగతికి మొండిచెయ్యే
న్యూఢిల్లీ : అధిక లాభాలు ఆర్జించే బహుళజాతి కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేస్తున్న పన్నులను పెంచాలని జీ-20 దేశాల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించబోతున్నారు. చూడడానికి ఇది ఓ సానుకూల ప్రతిపాదన లాగా కన్పిస్తున్నప్పటికీ దీని వెనుక పరమార్థం వేరే ఉంది. వాస్తవానికి కార్పొరేట్ కంపెనీలకు వరాలు, రాయితీలు ప్రకటించి సామాన్యులపై అధిక పన్నుల భారం మోపి వారి నడ్డి విరవడమే మోడీ ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది కూడా.
బడా కార్పొరేట్ సంస్థలపై కనీసం పదిహేను శాతం పన్ను విధించాలని, అధిక లాభాలు ఆర్జించే సంస్థల నుంచి అదనంగా ఇరవై ఐదు శాతం పన్ను వసూలు చేయాలని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రతిపాదిస్తోంది. దీనికి మన దేశం మద్దతు తెలిపింది. దీనిపై జీ-20 దేశాల సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. కంపెనీలు ఏ దేశంలో అయితే వ్యాపారాలు చేస్తున్నాయో అవి చెల్లించే పన్నులలో ఆ దేశాలకు చెప్పుకోదగిన వాటా ఇవ్వాలని భారత్ కోరుతోంది.
మన దేశంలో ఏం జరుగుతోంది?
మన దేశంలో పేదల కడుపు కొట్టి పెద్దలకు దోచిపెట్టే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా సమాజంలోని సంపన్నులకే కొమ్ము కాస్తుంది. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత విశృంఖలంగా అనుసరిస్తోంది. దేశంలో శక్తివంతమైన కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల రక్షణ కోసం చేయాల్సిందంతా చేస్తూనే ఉంది. ఉదాహరణకు పన్నుల విధానాన్నే తీసుకుందాం. కార్పొరేట్ సంస్థలపై అధిక పన్నులు విధించాలని ఓ వైపు జీ-20 దేశాలకు సుద్దులు చెబుతూనే మన దేశంలో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. బడా కార్పొరేట్ కంపెనీలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని, ఉపాధి కల్పనకు చేయూత ఇస్తున్నాయని చెబుతూ వాటిపై పన్నులు తగ్గిస్తూ రాయితీలు అందిస్తోంది. అదే సమయంలో సామాన్యులపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పేరుతో భారం మోపుతోంది. దేశంలోకి విదేశీ వస్తువుల ప్రవాహాన్ని ప్రోత్సహించేందుకు దిగుమతులపై విధించే కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తోంది. దీనివల్ల దేశీయ పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలవుతున్నాయి.
సంపన్నులకే వరాలు
కార్పొరేట్ పన్ను రేట్లలో అసాధారణ కోత విధిస్తూ 2019లో ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన తర్వాత కార్పొరేట్ పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. పన్ను రేట్లు తగ్గించడంతో సరిపుచ్చకుండా వివిధ రకాల రాయితీలు కూడా ప్రకటించారు. పన్ను రాయితీలు ఇస్తే కార్పొరేట్ పెట్టుబడులు పెరుగుతాయని, ఫలితంగా ఉద్యోగాల కల్పన ఊపందుకుంటుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఉద్యోగాలలో వృద్ధి కన్పించలేదు సరికదా కోవిడ్ కారణంగా పరిస్థితి మరింత దిగజారి, ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. అదే సమయంలో కార్పొరేట్ రంగం మాత్రం మంచి ఫలితాలు సాధించడం విశేషం. 2020లో లిస్టెడ్ కంపెనీల లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపుతో లాభపడడంతో పాటు కరోనా సమయంలో వేతనాల ఖర్చు తగ్గించుకునేందుకు బడా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపడంతో వాటి లాభాలు చెక్కుచెదరక పోగా మరింత పెరిగాయి.
గత కొంతకాలంగా రాయితీలు, రిబేట్లు, బ్యాంకు రుణాల రద్దు, రుణ ఎగవేతదారులకు జరిమానాల విషయంలో కంపెనీ చట్టంలో మినహాయింపులు వంటి వివిధ రూపాలలో కార్పొరేట్ రంగానికి ఆక్షరాలా ఆరు లక్షల కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూర్చారు. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారు. ఇటీవల ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌కు విక్రయించిన వ్యవహారంలో రూ.46 వేల కోట్ల అప్పులను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే పడింది. టాటాలు మాత్రం కేవలం రూ.27,500 కోట్లు వెచ్చించి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్నారు.
సంపన్నులకు రాయితీలు కల్పించే ఆర్థిక విధానం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. అది ప్రభుత్వ సంకుచిత ధోరణికి తార్కాణం. బడా కార్పొరేట్ శక్తులకు రాయితీలు అందిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం ఊతమివ్వదు. ఎందుకంటే కొనుగోలు శక్తి పేదల చేతిలోనే ఉంటుంది తప్ప సంపన్నుల చేతిలో కాదు. కాబట్టి పేదలపై పెట్టే ఖర్చును పెంచి, సంపన్నులపై పన్నుల భారం మోపితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం దీనికి వ్యతిరేక దిశలో సాగుతోంది. ఫలితం…దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
సామాన్యులపై మోయలేని భారం
మోడీ ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి. పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన మొత్తంలో కోత పెట్టి తద్వారా ఆదా చేసిన సొమ్మును కార్పొరేట్ సంస్థల పాలు చేస్తున్నాయి. డబ్బును ఆదా చేసే పేరుతో ఆహార ధాన్యాల పంపిణీ, వంటగ్యాస్ సబ్సిడీ వంటి విషయాలలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకుంటోంది. ప్రభుత్వ గిడ్డంగుల నిండా ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయి ఉన్నప్పటికీ వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఇష్టపడడం లేదు. మరోవైపు పరోక్ష పన్నుల రూపంలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతోంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఖజానాను నింపుకుంటోంది. ఈ సుంకాల ద్వారా 2014-15లో ప్రభుత్వానికి రూ.99 వేల కోట్ల ఆదాయం లభించగా అది 2020-21 నాటికి రూ.3.73 లక్షల కోట్లకు… అంటే ఏడు సంవత్సరాలలో దాదాపు 277శాతం పెరిగింది. ఫలితంగా పెట్రోల్ ధరలు 79శాతం, డీజిల్ ధరలు 101శాతం పెరిగాయి. వంటగ్యాస్ ధర గత సంవత్సర కాలంలోనే రూ.300 పెరిగింది. దీనిపై సబ్సిడీని ప్రభుత్వం 2019లోనే ఆపేసింది.
కార్పొరేట్ పన్ను అంటే…
1961వ సంవత్సరపు ఆదాయపన్ను చట్టం ప్రకారం దేశీయ, విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను విధిస్తున్నారు. దేశీయ కంపెనీలు ఆర్జించే ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేస్తారు. అదే విదేశీ కంపెనీలు అయితే భారత్‌లో అవి పొందిన ఆదాయం పైన మాత్రమే పన్ను వేస్తారు. కంపెనీ సంపాదించే నికర ఆదాయాన్ని బట్టి కార్పొరేట్ పన్ను విధిస్తారు. ప్రస్తుతం దేశీయ కంపెనీలపై 30శాతం పన్ను విధిస్తున్నారు. అయితే నికర ఆదాయం కోటి నుంచి పది కోట్ల రూపాయల వరకూ ఉంటే అదనంగా 7శాతం సర్‌చార్జీ వసూలు చేస్తారు. అదే నికర ఆదాయం పది కోట్ల రూపాయలు దాటితే 12శాతం సర్‌చార్జ్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ కంపెనీలకు సంబంధించి అవి ముందుగా నిర్ణయించిన కాలపరిమితిలో పొందే ఆదాయంపై కార్పొరేట్ ఆదాయపన్ను విధిస్తారు. రాయల్టీలు, ఫీజులపై వసూలు చేసే కార్పొరేట్ పన్ను రేటు 50శాతం కాగా ఇతర ఆదాయాలపై వసూలు చేసే పన్ను 40శాతంగా ఉంటోంది. విదేశీ కంపెనీల నికర ఆదాయం కోటి నుంచి పది కోట్ల రూపాయలు ఉంటే 2శాతం, ఆ మొత్తం దాటితే 5శాతం సర్‌చార్జీ వసూలు చేస్తారు.
కార్పొరేట్ పన్నులలో కోత
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయపన్ను వసూళ్లు 117శాతం పెరిగాయి. 2014-15లో రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు 2021-22 నాటికి రూ.5.6 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఇదే కాలంలో కార్పొరేట్ సంస్థల నుంచి వసూలు చేసే పన్నులు రూ.4.3 లక్షల కోట్ల నుంచి రూ.5.5 లక్షల కోట్లకు…అంటే 28శాతం మాత్రమే పెరిగాయి. ఈ కాలంలోనే స్థూల పన్ను వసూళ్లు 78శాతం పెరిగాయి. వాస్తవానికి దేశంలో కస్టమ్స్ సుంకాల వసూళ్లు పడిపోతున్నాయి. ఈ సుంకాల ద్వారా 2014-15లో రూ.1.9 లక్షల కోట్ల ఆదాయం లభించగా అది 2021-22 నాటికి రూ.1.4 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే 28శాతం తగ్గింది. 2016-17 నాటికి కస్ట మ్స్ సుంకాల ద్వారా ఆదాయం రూ.2.3 లక్షల కోట్లకు చేరినప్పటికీ ఆ తర్వాత బాగా తగ్గిపోయింది. ఇవి కాకి లెక్కలు కావు. కేంద్ర బడ్జెట్ పత్రాల నుంచి సేకరించిన సమాచారమే. స్థూల పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్నుల వాటా 2014-15లో 34.5శాతం ఉంటే అది 2021-22 నాటికి 24.7శాతానికి పడిపోయింది. కస్టమ్స్ ఆదాయం మరింత దారుణంగా తగ్గింది. ఇదే కాలంలో ఈ ఆదాయం 15శాతం నుంచి 6శాతానికి తగ్గిపోయింది. కానీ ఆదాయపన్ను వసూళ్లు మాత్రం 20.8శాతం నుంచి 25.3శాతంకి పెరగడం గమనార్హం.