ఫాసిస్ట్‌ హిందూత్వ కథనాల్ని తిప్పికొట్టండి

Reverse the fascist Hindutva narrativeరాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్‌ (2025) 75వ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో, రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణంలో ‘మార్పు’ తెచ్చేందుకు హిందూత్వ కథనానికి దూకుడుతనంతో రచన సాగుతోంది. 2024 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైనా విజయం సాధించడానికి ఇలాంటి సన్నద్ధత అవసరం. ఈ మార్పు సాధించాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలకు ప్రభుత్వం, రాజ్యాధికారాలపై నియంత్రణ అత్యంత కీలకమైన అంశం. ”ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి” అనే ప్రచారం, వివిధ రకాల ఉపకథనాల ద్వారా సమకాలీన నాగరికతను, బహుళ సాంస్కృతిక వాదాన్ని చెరిపేయడానికి భారతీయ చరిత్రను తిరగరాయడం, మతపరంగా మైనార్టీలకు, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత, హింసాయుత విష ప్రచారాలను వ్యాప్తి చేయడం ద్వారా వారు కోరుకుంటున్న మార్పు నిజమవుతుంది. ఈ ఫాసిస్టు హిందూత్వ ప్రణాళికలో ఇలాంటి ఉప-కథనాలు అంతర్భాగంగా ఉంటాయి. ఏకరూప పౌరస్మృతి, మన దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌గా మార్చడం, ‘ఒకే దేశం-ఒకే సంస్కృతి-ఒకే భాష’కు అనుగుణంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’, లాంటి అంశాల చుట్టూ ఇటీవలి ఉప-కథనాలు కేంద్రీకృత మయ్యాయి. ఇలాంటి కథనాలు నిజమవుతాయా, లేదా అనే దాంతో నిమిత్తం లేకుండానే హిందూత్వ కథనాన్ని బలోపేతం చేసే ఆలోచనల్ని సృష్టించడంపై కేంద్రీకరణ జరుగుతుంది.
హిందూత్వ ఉప-కథనాలు
అంతకుముందు అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం ఒక ఉదాహరణ. సుప్రీంకోర్టు తీర్పులో, ఆలయ నిర్మాణ బాధ్యతల్ని ఒక ట్రస్ట్‌కు అప్పగించినప్పటికీ, ప్రధానమంత్రే హిందూ మతా చారాల ప్రకారం రాజ్యాంగాధికారుల సమక్షంలోనే, ప్రధాన పూజారిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ కార్యక్రమాన్ని భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో లైవ్‌లో ప్రసారం చేశారు. భారతదేశం అప్పటికే ఒక హిందూత్వ రాజ్యమనే విషయాన్ని తెలియజేసేవిధంగా ఆ లైవ్‌ కార్యక్రమం ప్రసారమైంది. అదేవిధంగా, నూతన పార్లమెంట్‌ భవనంపై జాతీయ చిహ్నం ప్రతిష్టాపనకు, హిందూత్వ మనస్తత్వాన్ని బలపరిచే హిందూ మతాచారాలు కూడా తోడయ్యాయి. ఇటీవల ముగిసిన జి-20 శిఖరాగ్ర సమావేశం కూడా అంతర్జాతీయ పదప్రయోగం మాటున ప్రదర్శించబడిన హిందూత్వ చిహ్నాలచే గుర్తించబడింది. ప్రపంచ సార్వత్రిక భావనను ప్రకటించేందుకు, వసుధైవ కుటుంబ భావన, అంటే సార్వత్రిక ఏకత్వ భావనను పెంపొందించడానికి, భారతదేశ జి-20 అధ్యక్షుని పదవీ కాలంలో కృషి జరుగుతుందని ప్రకటించారు. వసుధైవ కుటుంబం అంటే ఏకరూపతను విధించడం కాదు, సామాజిక బహుళత్వాలు కేవలం గుర్తింపబడకుండా ఉండటమే కాక, సమానత్వం, గౌరవం ఆధారంగా అన్ని వైరుధ్యాలను సమానంగా పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రపంచ కుటుంబాన్ని గుర్తించడం కూడా. ఈ నియమాన్ని అన్ని దేశాలు అనుసరించినప్పుడు మాత్రమే అలాంటి ప్రపంచ కుటుంబం ఉద్భవించగలదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియమమే వైరుధ్యాలన్నిటినీ పరిగణలోకి తీసుకునేలా, అందరికీ సమానత్వం అనే భావనపై ఆధారపడే రాజకీయ నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. మన భారత రాజ్యాంగం, కులం, జాతి, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాలు దేశంలోని పౌరులందరికీ అందాలని ప్రకటించింది. కానీ దేశంలో మోడీ ప్రభుత్వ పాలనలో పౌరులకు అందాల్సిన న్యాయాలన్నీ ధ్వంసం చేయబడుతున్నాయి. ఇలాంటి అన్ని ఉప-కథనాలు, బలమైన ఫాసిస్ట్‌ హిందూత్వ శక్తిలో అంతర్భాగంగా ఉంటున్నాయి. అన్నీకాక పోయినా, వీటిలో చాలా కథనాల్ని, సుదీర్ఘ కాలంపాటు ఆరెస్సెస్‌ అధినేతగా పనిచేసిన ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ 1939లో రచించిన ”విరు ఆర్‌ అవర్‌ నేషన్‌ హుడ్‌ డిఫైన్డ్‌”లో గుర్తించవచ్చు.
హిందువులు మాత్రమే ఈ భూమికి అసలు సిసలైన నివాసులు అని స్థిరపరచినప్పుడు మాత్రమే వారి కథనాలు, వారు కోరుకునే మార్పు విజయవంతమవుతుంది. గోల్వాల్కర్‌ ఈ విషయాన్ని ఇలా నొక్కి చెప్పాడు… ”ఏ విదేశీ జాతి అయినా మనపై దురాక్రమణ చేయడానికి ముందు, హిందువులైన మనం, ఎనిమిది లేదా పది వేల సంవత్సరాలపాటు వివాదరహితమైన, కలతచెందని ఈ భూమి స్వాధీనంలో ఉన్నాం. అందువల్ల ఈ భూమి హిందుస్థాన్‌ (హిందువుల భూమి)గా పిలువబడింది.” సింధూ నదికి అవతల ఉన్న భూములను వివరించేందుకు అరబ్బులు మాత్రమే కాక గ్రీకులు, రోమన్లు కూడా అంటే భారతదేశానికి బయటినుంచి వచ్చిన ప్రజలే హిందుస్థాన్‌ అనే పేరు పెట్టారనేది వాస్తవం. గోల్వాల్కర్‌ హిందూ, ఆర్యన్‌ అనే పదాలను పర్యాయపదాలుగా ఉపయోగిస్తాడు. ఆ విధంగా ఆర్యులు ఇక్కడే భారతదేశంలోనే పుట్టారని అచారిత్రకంగా, అశాస్త్రీయంగా నొక్కి చెప్పాడు. ఆ ఆలోచనల తోనే ఆయన ఈ విధంగా నొక్కి చెప్పాడు… ”ఆర్యులు కాస్పియన్‌ సముద్రానికి దగ్గరలోని ప్రాంతం నుండి లేదా ఆర్కిటిక్‌ ప్రాంతం లేదా అలాంటి ఏదో ఒక ప్రాంతం నుండి హిందుస్థాన్‌కు వచ్చి దోపిడీ దొంగల గుంపుతో కలిసి ఈ భూమిని ఆక్రమించి, తర్వాత వారు మొదట పంజాబ్‌లో స్థిరపడి, క్రమేపీ గంగానది వెంట తూర్పువైపుకు వ్యాపించి వివిధ ప్రాంతాల్లో, అయోధ్య లాంటి చోట సామ్రాజ్యాలేర్పరచుకున్నారు. రామాయణంలోని అయోధ్య సామ్రాజ్యం, హస్తినాపురంలోని పశ్చిమ పాండవ సామ్రాజ్యం కంటే కూడా పురాతనమైనదిగా చరిత్రకారుడు భావిస్తాడు. అతడు అజ్ఞానంతో మహాభారతగాథ చాలా పాతదని మనకు బోధిస్తాడు. దురదృష్టవశాత్తు దేశంలోని వివిధ యూనివర్సిటీలు నిర్దేశించిన పాఠ్యపుస్తకాల ద్వారా ఇలాంటి తప్పుడు అభిప్రాయాలను యువకుల మెదళ్లలో కుక్కుతున్నారు. మనం అధ్యయనం చేసి అర్థం చేసుకొని, మన చరిత్రను మనమే రాసుకొని అలా వక్రీకరించబడిన చరిత్రను తీసే యాల్సిన సమయం ఆసన్నమైంది.” అందువల్ల హిందువులు ”శాంతియుత, అధికారయుత, సమృద్ధ పాలన” కింద పది వేల సంవత్సరాలకు పైగా ఈ నేలపైనే జీవించారనే విషయాన్ని స్థిరపరచడానికి, కొత్త కథనాలను సృష్టించి, పాఠ్యపుస్తకాలను సవరించి, చరిత్రను తిరగరాయడం అవసరం.
ప్రజాస్వామ్యానికి తల్లి
వేల సంవత్సరాలుగా భారతీయులు శాంతియుతంగా, సమృద్ధిగా జీవించారనే విషయాన్ని స్థిర పరచడానికి, భారతీయ సమాజం సమానత్వ స్ఫూర్తిపైన ఆధారపడిందని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్‌, బీజేపీలు గుర్తించాయి. 2021 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో జనరల్‌ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడుతూ… మోడీ, భారతదేశాన్ని ”ప్రజాస్వామ్యానికి తల్లి”గా ఉదహరించాడు. ”విశాల ప్రాతిపదికన సంప్రదింపుల సంస్థల చేత ఉపయోగించబడుతున్న రాజకీయాధికారం గురించి” వేదాలు మాట్లాడతాయని మోడీ ఎలాంటి చారిత్రక ప్రమాణం లేని రుజువు గురించి నొక్కి చెప్పాడు. మనుస్మృతి యొక్క సామాజిక క్రమంలోని దౌర్జన్యకరమైన అసమానతలు, దోపిడీని, నిమ్న కులాలు, ముఖ్యంగా చాతుర్వర్ణాల వర్గీకరణకు అవతల ఉన్నవారి (అంటే దళితులు, మహిళలు) అణచివేత, దోపిడీలు తోడుగా ఉండే చాతుర్వర్ణ వ్యవస్థలను స్థిరపరిచే అంశాలపై ఆధారపడి భారతదేశ చరిత్రను తిరగ రాసేందుకు మొత్తం ఫాసిస్ట్‌ హిందూత్వ పర్యావరణ వ్యవస్థ పనిచేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజా స్వామ్యం అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాక, అది సమానత్వ స్ఫూర్తిని కూడా ఖాయపరుస్తుందని మోడీ నిర్వచిస్తాడు. ఎంత విశ్వాస ఘాతుకం! రాజ్యాంగదినోత్సవం, నవంబర్‌ 19, 2022నాడు భారతదేశం ”ప్రజాస్వామ్య తల్లి”గా ఉత్సవాన్ని జరుపుకునేందుకు ప్రాచీన భారతదేశంలో, ఖాప్‌ పంచాయతీలలో ”ఆదర్శ రాజులను” వారి ”ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని” తెలియజేయడానికి ప్రణాళికలు రూపొందించాలని కోరుతూ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు యూజీసీ ఛైర్మన్‌ రాసిన లేఖలకు అనుగుణంగా యూజీసీ యంత్రాంగం దానిని అనుసరించింది.
మోసం ద్వారా చరిత్ర తయారీ
వాస్తవ చరిత్రను వక్రీకరించడానికి, హిందూత్వ పర్యావరణ వ్యవస్థ సాంకేతిక సాధనాలను (కంప్యూటర్‌ ఉపయోగించి ఫొటోలు మార్చడం లాంటివి) ఉపయోగిస్తూ చరిత్రను తయారు చేస్తుంది. ఇది బహుళవ్యాప్తిలో ఉంది. కెనడాకు చెందిన అల్లన్‌ మోరీన్స్‌ ఒక రిటైర్డ్‌ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త (ఆంథ్రోపాలజిస్ట్‌), స్కాలర్‌. ఆయన ”పిలిగ్రిమేజెస్‌ ఆఫ్‌ ద హిందూ ట్రెడీషన్‌ – ఏ కేస్‌ స్టడీ ఇన్‌ వెస్ట్‌ బెంగాల్‌” అనే అంశంపైన పరిశోధన చేసి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీలో థీసిస్‌ సమర్పించి డాక్టరేట్‌ సాధించాడు. ఆయన అసలు థీసిస్‌ను మార్చిన విధానం హిందూత్వ చరిత్ర వక్రీకరణకొక స్పష్టమైన ఉదాహరణ. 700 సంవత్సరాల క్రితం ముస్లిం పాలకులు పశ్చిమ బెంగాల్‌లోని హుబ్లీ జిల్లాలో త్రివేణిలో కుంభమేళాను నిలిపేసినట్లు, అల్లన్‌ మోరీన్స్‌ పత్రాలలోని విషయాలను తారుమారు చేసి చూపారు. అలాంటి వక్రీకరణపై ఆధారపడి కుంభమేళాలు ప్రారంభమయ్యాయి. ”700 సంవత్సరాల తరువాత ఈ ఆచార పునరుద్ధరణ జరిగింది, ఇది ఎంతో ప్రత్యేకం” అని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మోడీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కానీ ”కుంభమేళా” అనేది త్రివేణీలో లేనేలేదనేది చారిత్రక సత్యం. కాబట్టి కుంభమేళా ”పునరుద్ధరణ” అనేది తప్పుడు పరిశోధనపై జరిగింది” అని అల్లన్‌ మోరీన్స్‌ అంటున్నారు.
నూతన పార్లమెంట్‌ భవనం – రాజదండం
అదేవిధంగా, మధ్యయుగాల్లో రాజులు, చక్రవర్తులు ఉపయోగించిన ”పాలించే దైవిక హక్కు”ను మోడీకి కల్పించడానికి మొత్తం చరిత్ర వక్రీకరించబడి, ఉపయోగించబడిన నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాజదండం సాంప్రదాయాన్ని పాటించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూ ఆచారాలు, రాజ్యా భిషేకం (రాజు పట్టాభిషేకం)పై దృష్టిని కేంద్రీకరించడం ఆసక్తికరమైన విషయం. ఈ మొత్తం కార్యక్రమం, బ్రిటిష్‌ వారి నుండి అధికారాన్ని బదిలీచేసే ఒక కొత్త కథనాన్ని తయారుచేసే ప్రయత్నంగా గుర్తించబడింది. వాస్తవాల్ని కట్టుకథలతో తయారు చేసిన ఈ కొత్త కథనాన్ని ఫ్యూడల్‌ రాజులకిచ్చిన రాజదండం చుట్టూతిప్పారు. రాజదండం, చోళసామ్రాజ్యంలో అనుసరించిన ఆచారం. సీ.రాజగోపాలాచారి, తమిళనాడులోని మఠాధిపతులతో సంప్రదింపులు జరిపి సాధించిన అధికార బదిలీకి చిహ్నంగా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ రాజదండాన్ని నెహ్రూ చేతికిచ్చాడనేది తయారు చేయబడిన కథనం. దీనిని రుజువు చేసే ఎలాంటి ఆధారాలూ లేవు. ఆ సమయంలో నెహ్రూ స్వీకరించిన అనేక బహుమతుల వలెనే రాజదండాన్ని కూడా మ్యూజియంలో ఉంచారు. నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవాన్ని హైందవీకరణ చేయడానికే బీజేపీ రాజదండం సాంప్రదాయాన్ని ఉపయోగించుకుంది. నూతన పార్లమెంట్‌భవనం హిందూత్వ రాజ్యస్థాపనకు చిహ్నం అనే విషయాన్ని తెలియజేసేందుకు తమిళనాడు నుండి రాజదండం పట్టుకొనివచ్చిన పూజారులు, మఠాధిపతుల ప్రదర్శనకు మోడీ నాయకత్వం వహించాడు. ప్రజలను పాలించడానికి పట్టాభిషక్తుడైన రాజు స్వీకరించిన, ‘పాలించే దైవిక హక్కు’ను, పవిత్రం చేయాలని రాజదండాన్ని అందించిన ప్రధాన పూజారి అనుకుంటాడు. లింగ, జాతి, కులంతో నిమిత్తం లేకుండా పౌరులంతా సమానంగా ఉండే రాజ్యానికి, పౌరులకు మధ్య ఉండే సంబంధమే ప్రజాస్వామిక గణరాజ్యానికి (డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌) ముఖ్యం. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం రాజ్యాన్ని పాలిస్తుంది. ప్రజాస్వామిక రాజ్య-పౌరుల సంబంధాన్ని ధ్వంసంచేసి దాని స్థానంలో ఫ్యూడల్‌ రాజ్య-ప్రజల నిరంకుశత్వ పద్ధతిలోనే మొత్తం భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌కు మద్ధతిచ్చి, భారతదేశ భావనను బలోపేతం చేయండి ప్రజల మనస్తత్వాన్ని అదుపుచేసే ఇలాంటి కథనాల్ని ఎదుర్కొని, ఓడించినప్పుడే భారత గణతంత్ర రాజ్య లక్షణాన్ని రక్షించగలం. దానితోపాటు, పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి లాంటి కష్టాలతో బాధ పడుతున్న అశేష ప్రజల మెరుగైన జీవితాల కోసం, భారత్‌ అనే భారతదేశం కోసం ప్రజాపోరాటాలను ఉధృతం చేయాలి.భారతదేశ లక్షణాన్ని, తీవ్ర అసహన, ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యంగా మార్చే ప్రయత్నాల్ని ఓడించాలి. ప్రభు త్వాన్ని, రాజ్యాధికారాన్ని ఆరెస్సెస్‌, బీజేపీలు అదుపుచేయకుండా అడ్డుకోవడమే దీనికి ముందస్తు షరతు.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451

సీతారాం ఏచూరి