మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండల పంచాయతీ అధికారి, ఏఎస్ఓ, ఈజీఎస్ ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆయన ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల విషయమై గుర్తించిన పనుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నిర్వహించనున్న సీఎం కప్ ఏర్పాట్లను పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. సీఎం కప్ పోటీల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని క్రీడలు విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు.ఈనెల 6లోగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు సర్వేను పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను, సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి అలసత్వానికి ఆస్కారం ఉండొద్దని, ఎప్పటికప్పుడు మురికి కాలువల శుభ్రం చేయించాలన్నారు. వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో క్లోరినేషన్ చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టి కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదానంద్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, తదితరులు పాల్గొన్నారు.