‘ఆధ్యాత్మిక కథనం’ యోగక్షేమం వహామ్యహం
అరుణాచలగిరికి అంకితంగా ఈ కథా సంపుటి అంకితం చేశారు. ఆముదాల మురళీ, పునరపి పఠనం – పునరపి మననం అంటూ చక్కటి ముందు మాట రాశారు. ఇది రచయిత 14వ పుస్తకం. ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఇది రెండో పుస్తకం ‘గతం గత:’ గతంలో వెలువరించారు. జిడ్డు కృష్ణమూర్తి, రవి శంకర్, జగ్గీ వాసుదేవ్, మంతెన సత్యనారాయణరాజు గారల ప్రభావంతో ఆధ్యాత్మిక కథలు రాయడంలో అవగాహన ఏర్పడిందంటారు రచయిత. వివిధ పత్రికల్లో ఈ కథలు ప్రచురణై పాఠకాదరణ పొందాయి. డా||రేవూరు ఆనంద పద్మనాభరావు అట్టవెనుక ‘కృష్ణం’ వందే కథాగురుం అంటూ ప్రశంసించారు. భౌతిక జీవితం పట్ల ఏ అసంతృప్తి లేని వానికి ఆధ్యాత్మికతతో అవసరం ఏర్పడదు.
ఈ పుస్తకంలో దాదాపు 52 కథలున్నాయి. ఆధ్యాత్మిక చింతనా పరులను, పిల్లలను, వయోవృద్ధులను ఎంతో అలరింపజేసే ఈ కథల్లో… ‘గజస్నానం, పాలమీగడ, ప్రేమను పంచుదాం, సత్యాన్వేషణ, మాతృ రుణం, పట్టు విడుపులు, ప్రేమ విత్తనాలు, చల్లని చూపులు, శ్రేయోభిలాషులు, జీవన మకరందం, పశ్చాత్తాపం, అర్థాంగి, చూసే కళ్లు’ లాంటివి రచయిత భావావిష్కరణకు అద్ధం పట్టే కథలు. కేవలం ఇరవై లైన్లలో ‘గజస్నానం’ కథా కథనం గురువు – భక్తుడి మధ్య సంభాషణ రూపంలో సాగింది. స్నానం చేసిన ఏనుగు నదిలోంచి బైటకొచ్చి తొండంతో చెత్త, దుమ్ము వంటి మీద చల్లుకొంటుంది. అలాగే భక్తులు సత్సంగంలాంటి కార్యక్రమాల్లో పాల్గొని బైటకెళ్లి మనసులో దారినపోయే ఘటనల చెత్తనంతా మనసులో నింపుకుని చెడు ప్రవర్తనకు లోనౌతారు (పేజీ 13). చక్కటి తాత్త్వికత ఈ కథలో వుంది.
‘ప్రేమను పంచుదాం’ కథలో మూడు ఉపకథలు జోడించి ప్రేమను పంచే తీరును అద్భుతంగా కథీకరించారు. ప్రతి మనిషి వాస్తవాన్ని పక్కన పెట్టి, తన అనుభవాలను ఆధారంగా జీవితాన్ని అంచనా వేస్తాడు. మనసు క్షేత్రంలో ప్రేమ విత్తనాలు ఎలా నాటాలో, ‘అత్త – కోడళ్లు’ జీవన సరళిపై కథీకరణ ‘ప్రేమను పంచుదాం’లో వుంది. గురువులందరూ ఉపాధ్యాయులు కారు. ఉపాధ్యాయులందరూ గురువులు కారు. గురువ ులోపలి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. ఉపాధ్యాయుడు బయటి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. ఇద్దరూ అవసరమే అని చెప్పే కథ ‘గురుదేవోభవ’ (పేజీ 97). అన్ని కథలూ అలరిస్తాయి. తాత్త్వికతతో మంచి నడత నేర్పుతాయి.
– తంగిరాల చక్రవర్తి, 9393804472
పిల్లలు మెచ్చిన ‘ఆకాశంలో అల్లరి’
మనం ఎప్పుడూ అనుకునే మాటే..! మళ్లీ గుర్తుకు వచ్చింది ఈ పిల్లల కథల పుస్తకం చదివితే… ”మనకు తెలిసింది రాయడం కాదు, పిల్లలకు అవసరమైంది రాయడమే అత్యుత్తమ రచయిత పని” అని.
అచ్చంగా అదే తీరులో రాసిన ఈ 21కథల సంపుటి ‘ఆకాశంలో అల్లరి’ పిల్లల జన్మహక్కు అయిన ‘అల్లరి’ పదం చేర్చి కథ రాయడమే కాక, అదే కథను శీర్షికగా ఉంచి కథా సంపుటి ప్రచురించిన రచయిత్రి హారికకు పిల్లల మీద ఎంత బాధ్యత ఉందో అర్థం అవుతుంది.
వృత్తిరీత్యా దంత వైద్యురాలైన డా||చెరుకుపల్లి హారిక తాను బాల్యంలో పొందిన బాలసాహిత్య అనుభూతి సాయంగా ప్రస్తుతం తన ప్రవృత్తిగా బాల సాహితీ సేద్యం చేస్తూ వర్ధమాన కథారచయిత్రిగా అనేక కథలు రాసి, అందులో మేలైన కథలను తన తొలి కథా సంపుటిగాచేసి ఈ ‘ఆకాశంలో అల్లరి’ అందించారు. ఈ కథలన్నీ ఆమె ఊహించి రాసిన కల్పిత కథలు కావు, తన ఇద్దరు ముద్దుల కూతుళ్లకు చెప్పి వాళ్ళ మెప్పు పొందాకనే రాసిన పిల్లలు మెచ్చిన కథలు ఇవి.
తన జీవితా అనుభవాలు, అనుభూతులు పిల్లలతో తన సంబంధ బాంధవ్యాలు అన్నీ కలగలిపి నేటితరం ఆధునిక బాలలకు అవసరమైన కథలు రాశారు. కొన్ని కథలు కల్పితాలైనా పిల్లలకు ఆనందం కలిగించి చివరిలో ఆధునిక సందేశంతో పిల్లలను ఆలోచింపచేస్తాయి. పర భాషలో వైద్య విద్య చదివినా అమ్మ భాష మీద మమకారం వదలని ఉత్తమ భాషా ప్రేమికురాలు హారిక. తన కథలలో చక్కని తెలుగు పదాలు అచ్చంగా పిలలభాషా పదాలు వాడి కథలకు మరింత వన్నె తెచ్చారు.
‘గోళీ రాక్షసుడు’ కథ మొదలు ‘చిన్నదేగా’ కథ వరకు సాగిన ఈ బుల్లి కథల ప్రయాణంలో కనిపించే కథలన్నీ వేటికవే ప్రత్యేకంగా పసందుగా సాగుతాయి. కార్యం సాధించే గుణం పట్టుదల ఉండాలే తప్ప దానికి ఆకారం కానీ ఆటంకాలు కానీ అడ్డు రావని నిరూపించిన అందమైన కథ ‘గోళీరాక్షసుడు’. వింత ఆకారంతో విరక్తి కలిగించేలా ఉన్నా, తనదైన లక్ష్యసాధనతో జమీందారు ఆలోచనలో మార్పు తెచ్చి అతని వద్ద బానిసలుగా ఉన్న పిల్లలను విడిపించడంలో గోళీ రాక్షసుడు చేసిన కృషి వివరంగా చదివితే మరిన్ని ఆసక్తి దాయక విషయాలు అర్థం అవుతాయి.
స్నేహగుణం లోని గొప్పతనం వివరిస్తూ మధ్యలో వచ్చే చిన్ని చిన్ని మనస్పర్ధలు గొడవలను మన స్నేహపు మనోపలకపై నుంచి ఎలా చెరిపివేయాలో వివరిస్తూ… మనుషులకు మాత్రమే గల గొప్ప స్నేహగుణం విలువ చాటి చెప్పిన ‘ఆకాశంలో అల్లరి’ కథ తో పాటు, అనవసర విషయాల గురించి అదే పనిగా ప్రచారం చేస్తూ కాలయాపన చేసే చెడు గుణం కలవారికి చెంపపెట్టు లాంటిదేగాక, అలాంటి బుద్ధి నుంచి పిల్లలను ముందే దూరం చేయాలని చాటిన చక్కని కథ ‘రాజు గారి రోగం వైద్యుడి వైద్యం’. ఇది ఆసాంతం ఆసక్తికర మలుపులతో చిత్ర విచిత్రంగా సాగుతూ పిల్లలకు సరదా పుట్టిస్తుంది.
ప్రతి కథ ఓ ఆణిముత్యంలా ఉండి ఆకాశంలో అల్లరి చేసాయి. దారి లేని ఇల్లులా విషయ సూచిక లేకపోవడం, పేరాల నిడివి పెద్దగా ఉండటం, వంటి చిన్ని చిన్ని లోపాలు సైతం కథా వస్తువుల్లోని పుష్టితో కనిపించకుండా పోయినయి. ఇవి రచయిత్రి సవరించుకోవాల్సిన అంశాలుగా గమనించాలి.
ఆధునిక బాలసాహిత్యానికి అందిన మరో మంచి కథల పుస్తకం ఈ ‘ఆకాశంలో అల్లరి’. విధిగా దాచు’కొని’ చదవాల్సి ఉంది.
డా|| అమ్మిన శ్రీనివాసరాజు,77298 83223