సమీక్షలు

– తెలంగాణా సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నవతెలంగాణ అందిస్తున్న పుస్తకాల సమీక్షలు సంక్షిప్తంగా…
బేతవోలు జమీందరీ వ్యతిరేక రైతాంగ ఉద్యమం
తెలంగాణ సాయుధ పోరాటం ఆరంభం నుంచి అంతం వరకు నేను పాల్గొన్నప్పటికి దానికి పూర్వ చరిత్ర పునాది భాగంగా ఉన్నటువంటి బేతవోలు, జెర్రిపోతులగూడెం, మునగాల ఉద్యమాలు ఇవ్వన్నీ చరిత్ర భాగాలు. తెలంగాణ సాయుధ పోరాటానికి పూర్వ భూమిక వంటివి. అట్టి చారిత్రక భాగాలు అందించిన రామయ్యగారు వాస్తవంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పూర్వ భూమిక వెల్లడి చేయగలిగారు. అందుకు రామయ్యగారిని అనేక విధాల అభినందిస్తున్నాను.
– కామ్రేడ్‌ భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి, తెలంగాణ పోరాట యోధుడు,మాజీ పార్లమెంటు సభ్యులు, 12.03.2004

తెలంగాణ విలీనం వాస్తవాలు – వక్రీకరణ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సెప్టెంబరు 17 చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దీనినొక వివాదం చేసి రెచ్చగొడుతున్నాయి. ‘విలీనమా? విమోచనా? విద్రోహమా?’ అన్న చర్చ సాగుతున్నది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రాధాన్యతను యువత ముందుంచే ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 17న చరిత్రలో ఏం జరిగింది? దాని ప్రాధాన్యత ఏమిటి? ఎందుకింత వివాదాస్పదమవుతున్నది? వీటన్నింటిని లోతుగా పరిశీలిస్తుంది ఈ చిన్న పుస్తకం.

కడవెండి ప్రజల వీరోచిత చరిత్ర
ఆధునిక భారతదేశ చరిత్రలో ఒకానొక మహత్తరమైన గొప్ప తిరుగుబాటు అయినటువంటి ‘వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’పై మరొక పరిశోధన పుస్తకాన్ని తెస్తున్నందుకు మేము నిజంగా ఎంతో సంతోషిస్తున్నాము. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా|| రమేశ్‌ పన్నీరు తన ఎం.ఫిల్‌ పరిశోధనాంశంగా ఈ అంశాన్ని ఎంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దీని కోసం అతడు చేసిన కృషి పూర్తిగా సార్ధకమైంది. క్రమపద్ధతి ప్రకారం సేకరించబడిన దత్తాంశము, వస్తు సామాగ్రి, విషయ సేకరణ, ఇంటర్వ్యూలు మొదలైనవి అతని శ్రమకు, జాగ్రత్తతో కూడిన ప్రయత్నాలకు యోగ్యతా చిహ్నాలుగా నిలిచినవి. అవి ఈ గ్రంథంగా మీ ముందున్నవి.
– తెలకపల్లి రవి

విలీనం, విమోచన, విద్రోహం
విలీనాన్ని ‘విమోచన-విముక్తి’ పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం చేస్తున్నది. ముస్లింల నుండి హిందువులకు విముక్తి కలిగినట్లు అర్థం వచ్చే రీతిలో వారి ప్రచారం కొనసాగుతున్నది. వాస్తవానికి క్రూర పరిపాలన పోయి భారతదేశం విలీనం కావడం అన్ని మతాల, కులాల కోర్కె మేరకే జరిగింది.
– సారంపల్లి మల్లారెడ్డి

కొమరం భీం
డాక్టర్‌ విఎన్‌వికె శాస్త్రి రచించిన ‘కొమురం భీం-ముందు, తర్వాత, ఇప్పుడు’ అనే పుస్తకం ఎంతో సందర్భోచితమైనది, అత్యంత ప్రయోజనకరమైనది. ఆదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎనిమిది దశాబ్దాలుగా జరిగిన పరిణామాలను సవివరంగా తెలియచేస్తుంది. ఆదివాసుల ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు ఇది అద్దం పడుతుంది.
– ఎంవిపిసి శాస్త్రి, ఐఏఎస్‌(రిటైర్డ్‌), 18.12.2015

ఎంత గోడు, ఎంత గోస?
ప్రతి ఊరు ఒక జలియన్‌ వాలా బాగ్‌, సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చరిత్రకు ప్రపంచం ప్రేరణ పొందాల్సిన పోరాటానికి ఆనవాళ్లు లేకుండాచేసి, పాతాళంలో పూడ్చి శాశ్వత సమాధి కడితే.. సమాధిని బద్దలుకొట్టిన కలం, విశ్వం విస్తుపోయే వాస్తవాలను వెలికితీసే అస్త్రం ఈ పుస్తకం. చరిత్రకు వక్రభాష్యాలు చెప్పుకు తిరిగే పిరికిపందలకు, ఈ తరం రజాకార్లకు ఖచ్చితంగా చెంప చరిచి చదివించాల్సిన పుస్తకం ”త్యాగాల వాకిళ్లు”. అమ్మ రుణం తీర్చుకునేందుకు రచయితగా పల్లె పల్లెన ఎంత శోధించారో భాస్కర్‌ గారి శ్రమకు శిరస్సు వంచి అభినందిస్తున్నా.
– ఉదయభాను, ప్రముఖ యాంకర్‌, నటి

వీర తెలంగాణ మాది
దేశ ప్రజలందరికీ గర్వకారణమైన వీర తెలంగాణ సాయుధ పోరాట అరవయ్యవ వార్షికోత్సవాలను విస్తృతంగానూ, విప్లవ చైతన స్పోరకంగానూ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రపంచ విప్లవాల చరిత్రలో చోటు సంపాదించి నిరంతర ఉత్తేజంగా నిలిచిన ఆ పోరాటాన్ని గురించి, అందులో పాల్గొన్న యోధుల అనుభవాల గురించి తెలుసుకోవలసిందీ, భావితరాలకు అందించవలసిందీ చాలా వుంది. ఇందులో భాగంగా ‘వీర తెలంగాణ మాది’ పుస్తకంలో నాటి యోధులు 120 మంది అనుభవాలున్నాయి.
– బి.వి.రాఘవులు

తెలంగాణ సాయుధ పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో గ్రంథాలు వచ్చాయి. చరిత్రకారులు రకరకాల భాష్యాలు చెప్పారు. కానీ డాక్టర్‌ కె.రమేశ్‌ పరిశోధనను గమనించినప్పుడు అతను ఇక్కడి నుంచి వచ్చినవాడు కాబట్టి అతని అధ్యయనం, పరిశోధన సాధికారికంగా, శాస్త్రీయంగా కొనసాగింది. అందుకే ఈ గ్రంథం మట్టి మనుషుల పరిమళాన్ని గుబాళింపజేస్తుంది. కావున అతని రచన భవిష్యత్తరాలకు ఒక కరదీపిక అవుతుంది.
– డాక్టర్‌ చుక్కా రాములు, 20.01.2018