సమీక్షలు

మనో విశ్లేషణాత్మక నవల
మనోవిశ్లేషణాత్మక గ్రంథాలపై ఆసక్తి పెంచుకొని వాటిని విస్కృతంగా అధ్యయనం చేసి, మనిషికి సంభవించే మానసిక సమస్యల్లో ‘స్కిజో ఫ్రీనియా’ అనే అంశాన్ని ఎంపిక చేసుకుని, దాని ఆధారంగా విఆర్‌ రాసాని రాసిన నవలే ‘స్వప్నజీవి’.
ఇందులో కళా పిపాసి , సున్నిత మనస్కుడు అయిన హనుమంతరావు గొప్ప రంగస్థల నటుడు, గాయకుడు. అంతకుమించి జాతీయస్థాయిలో రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న చిత్రలేఖకుడు. ఆయనతో నాటకాల్లో పనిచేసే నాయిక శశికళను మొగుడు వదిలేసి విడాకులు ఇవ్వగా, అయిదేండ్లుగా చిన్న బిడ్డ భార్గవితో ఒంటరిగా ఉంటుంది. ఆమె గొప్ప కళాకారిణి. హనుమంతరావుకు వయసు ముదిరిపోతుంది పెళ్లి కాలేదు కాబట్టి, ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మిత్రులంతా ఆలోచించి వారిద్దరికీ పెళ్లి చేస్తారు. భార్గవి పట్ల పెంచుకున్న అమిత ప్రేమతో హనుమంతరావు అమెను కన్న కూతురికంటే ఎక్కువగా చూసుకుంటాడు.
పెళ్లి అయిన తర్వాత శశికళ అన్ని విషయాలను తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. హనుమంతరావు పెయింటింగ్స్‌తో వ్యాపారం చేసే భీమేశ్వరుని బెదిరించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంది . హనుమంతరావు వేసిన పెయింటింగ్‌ కు జాతీయస్థాయిలో రాష్ట్రపతి చేతులమీదుగా లక్ష రూపాయలు అందుకుంటాడు. టీటీడీ కి కావలసిన చిత్రాలు వేసివ్వడానికి కాంట్రాక్టు ఒప్పుకుంటాడు. పరిస్థితులన్నీ అనుకూలించడంతో హనుమంతరావు దశ మారిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకుంటాడు. భీమేశ్వర్‌ దగ్గర పనిలోకి చేరిన శశికళ క్రమంగా అతనితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటుంది. భర్త పట్ల ఒక చులకన భావం ఏర్పడుతుంది. తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని అర్థం చేసుకోలేక వాళ్లకు అక్రమ సంబంధాన్ని ఊహించుకొని, వాళ్లకు తెలియకుండా వేధిస్తుంటుంది.
కూతురు భార్గవి పెళ్లయి బెంగళూరుకు వెళ్ళిపోతుంది. కాలేజీ చదువులకు వచ్చిన కొడుకు, తల్లిది ఒకటే మాట. వాళ్ళిద్దరూ కలిసి హనుమంతరావును వేధిస్తుంటారు. ఇల్లు, ఆస్తులన్నీ శశిరేఖ పేరుమీద ఉండటంతో ఆమె హనుమంతరావును ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. అతను అసంతృప్తి, వేదనలతో మనశ్శాంతి కోల్పోయి డిప్రెషన్‌ కు గురవుతాడు.డిప్రెషన్‌, హెల్యుసినేషన్స్‌ తో పాటు కనబరిచిన ఇతర లక్షణాలతో హనుమంతరావు స్కిజో ఫ్రీనియా అనే మానసిక వ్యాధికి గురయ్యాడని తెలుసుకుంటాం. హనుమంతరావు గమ్యం లేని బాటసారిలా ప్రయాణించి చిత్రకూటం చేరుకుంటాడు. స్థానికులకు బిచ్చగాడిగా కనిపించే ఆ అపరిచిత చిత్రకారుడు జీవితం ఎలా ముగిసిందో తెలుసుకోవాలంటే ఈ నవలను చదవాల్సిందే.
సున్నిత మనస్కులైన కళాకారులు బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం వలన, లోకజ్ఞానం కొరవడి సులభంగా ఇతరుల వల్ల మోసపోతుంటారని హనుమంతరావు మరోమారు నిరూపిస్తాడు. హనుమంతరావును ప్రేమించిన శశికళ హఠాత్తుగా విలన్‌ గా మారడం, చివరలో తల్లీ కొడుకులు పశ్చాత్తాపం ప్రకటించడం లాంటి సంఘటనలన్నీ చకచకా జరిగిపోవడం ఆశ్చర్యం. స్కిజో ఫ్రీనియా అనే మానసిక వ్యాధిలోని వివిధ దశలు హనుమంతరావు జీవితంలో ఎలా ప్రతిఫలించాయో తెలుపుతూ నవల కొనసాగుతుంది. నవలను, నవలలోని పాత్రలను- వారి ప్రవర్తనను మానసిక శాస్త్ర వెలుగులో విశ్లేషించడం వేరు. మానసిక శాస్త్ర ఆధారంగా నవలను రాయడం వేరు. అయినప్పటికీ కొత్తగా, ప్రయోగాత్మకంగా ఈ నవలను రాయడంలో రాసాని చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
– కె.పి అశోక్‌ కుమార్‌, 9700000948