కష్టసుఖాల సమాహారం
కష్టాలు తెలియని వాడికి సుఖంలో ఉన్న సుతారం ఏంటో అర్థం కాదని గొడుగు యాదగిరి రావు గారు తన ‘నాటి నడవడి – నేటి ఒరవడి’ స్వీయ కవితల ద్వారా స్పష్టం చేశారు. ”మనిషి జీవితం అద్భుతం” అంటూనే దానిలో కష్టాలు, సుడిగుండాలు, ఎదురు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బలు ఇవన్నీ జీవితాన్ని మలుచుకోవడానికి చక్కని పునాది రాళ్లు అంటారు.
”సుఖమెరిగిన వాడికి మొఖం కడగ తీరదు” అనేదో సామెత. అలాంటి వారి జీవితానికి ఉన్న పునాది ఏ పాటిదో… కానీ, జీవిత పునాది నుండి అనాదిగా వస్తున్న కుతంత్రాల కట్టుబాట్లను దాటుకుంటూ బాల్యం, విద్యార్థి దశ నుండి నేటి జీవితం వరకు… అంటే తన జీవితం 70 వసంతాల పైబడి వరకు అనుభవించిన కుతంత్రాల కట్టుబాట్లే అన్నమాట. అంటే ఇప్పుడున్న కట్టుబాట్లన్నీ కుతంత్రాలతో కూడుకున్నవే అని అర్థం. కుతంత్రాలు అంటే కొంతమంది పెత్తందారులకు అనుకూలంగా ఉంటూ ఆ కట్టుబాట్ల చాటున మెజారిటీ ప్రజలను తరతరాలుగా తైతక్కలాడిస్తున్నవే అని అర్థం.
గొడుగు యాదగిరి రావు గారు తన చదువు గురించి చెబుతూ ”స్వచ్ఛమైన బాల్యం లోని విద్యాభ్యాసం చాలా గొప్పది. కాలం తిరిగి రానిది, నాడు కష్టాలు ఎన్ని ఉన్నా జీవితానుభవానికి పరమార్థమైనది”… అంటారు. అలా బాల్యం నుంచి నేటివరకు తానునుభవించిన కష్టసుఖాలను కలగలిపి తన స్వకుటుంబం నుంచి ప్రాపంచిక సమాజం, రాజకీయం, ఆర్థికం, ప్రాకతిక భౌతికాభౌతికాలు, … ఇలా ప్రతీ అంశాన్ని 4 నుండి 50 పాదాల మధ్య 245 కవితల సమాహారమే ”నాటి నడవడి – నేటి ఒరవడి”. ప్రతీ పాదంలోని భావాన్ని గ్రహించాలి కానీ మెదడుకు మేతేసినట్టే… ఇలాంటి అనేకాంశాలు యాదగిరి గారి కలం నుంచి భావితరాలకు మరిన్ని అందించాలని ఆశిద్దాం…
– మహేష్ దుర్గే, 9700888972