విప్లవ యోధుడు, కామ్రేడ్ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జాతీయ నాయకులు,తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కార్యాలయంలో విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా నాయకులు సారా సురేష్ మాట్లాడుతూ దాదాపు విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎదుగుతూ జాతీయస్థాయికి ఎదిగినటువంటి నాయకుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్నారు. ఆయన కుటుంబం మొత్తం కూడా పేద ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న కాలంలో రాయల రవి, నాగేశ్వరరావు ఇంతకుముందే మరణించారన్నారు. కామ్రేడ్స్ అందరు కూడా పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అకాల మరణం చెందడం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి లోటును ఎవరు తీర్చలేనిదని గుర్తుచేస్తూ వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా మండల కార్యదర్శి బి.అశోక్, మోర్తాడ్, ఏరుగట్ల మండలాల కార్యదర్శి జి.కిషన్, పార్టీ నాయకులు వి.అశోక్, ఎస్. లక్ష్మక్క, రాజ గౌడు, తదితరులు పాల్గొన్నారు.