భారతదేశంలో AIలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు ప్రస్తుతం 22శాతం మాత్రమే ఉన్నారు. అయితే మహిళలు నాయకత్వం వహిస్తున్న పరిశ్రమల్లో ఈ సంఖ్య పెంచేందుకు కృషి జరుగుతోంది. ఈ వెంచర్లు ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడటమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, సాంకేతిక రంగంలో చేరికను ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి అసాధారణమైన మహిళా నాయకులే ప్రియా సింగ్, రిత్విక చౌదరి, కౌసంబి మంజిత… వారి సంచలనాత్మక ఆవిష్కరణలు పరిశ్రమలను మార్చివేస్తున్నాయి. మిలియన్ల మందికి స్ఫూర్ినిస్తున్న వారి గురించి మరిన్ని విశేషాలు…
ఛలో సహ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ప్రియా సింగ్, అన్‌స్క్రిప్ట్ వ్యవస్థాపకురాలు, సీఈఓ రిత్విక చౌదరి, మాసన్ సహ వ్యవస్థాపకురాలు, సీపీఓ కౌసంబి మంజిత. వీరు తమ కొత్త ఆవిష్కరణలతో ఏఐ పరిశ్రమలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల అపారమైన సామర్థ్యానికి వారి ప్రయాణం ఓ నిదర్శనం. తమ కెరీర్ పథాలు, వారి నిర్ణయాలను నడిపించే విలువలు, టెక్‌లో లింగ సమానత్వాన్ని పెంపొందించే వారి వ్యూహాలపై స్పష్టమైన దృక్కోణాలను అందిస్తున్నారు. తమ ఆవిష్కరణలను పెంపొందించడంలో పరిశోధనలు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల పరివర్తన సామర్థ్యాన్ని అన్వేషిస్తున్నారు.
షాపింగ్ సొల్యూషన్…
కౌసంబి… ఈమె మాసన్ విజయానికి ఓ చోదక శక్తి. ఎన్నో టీమ్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. భావోద్వేగ మేధస్సు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అటు టొరంటోతో పాటు ఇటు బెంగుళూరులోనూ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘నా చిన్న నాటి కొన్ని అనుభవాలు ఏఐపై పని చేసే ఆసక్తిని పెంచాయి. గత 18 ఏండ్లుగా, Paytm, Myntraతో డైనమిక్ ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి ప్రవేశించడానికి ముందు ఆమె IBM కామర్స్, NCR Corp వంటి 500 కంపెనీలను కలిసి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఈ కార్పొరేట్ అనుభవం, వ్యవస్థాపక స్ఫూర్తి మాసన్‌తో వ్యవస్థాపించడానికి నన్ను సిద్ధం చేసింది. ఏఐ ఆధారిత షాపింగ్ సొల్యూషన్‌లను అభివృద్ధి చేయడంపై మాసన్ దృష్టి సారిస్తుంది. సాంకేతికత కస్టమర్ డిమాండ్‌ను సమర్థవంతంగా అర్థం చేసుకుంటాం. ఏఐ వంటి కొత్త రంగంలో లింగంతో సంబంధం లేకుండా అందరికీ ప్రత్యేకమైన సవాళ్లు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ఉండాలి. స్త్రీల నైపుణ్యాలపై మొదటి నుండి కొంత చిన్నచూపు ఉంది. అయితే సాంకేతికత మహిళలకు కత్త అవకాశాలను అందిస్తోంది. దీని గురించి ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కల్పించడం, విభిన్న దృక్కోణాలను ప్రభావితం చేయడం, ఏఐ పరిష్కారాలను ఎలా సృష్టించడం అనేది ఇక్కడ క్లిష్టమైన ప్రశ్నలు. వీటి సమాధానంపై దృష్టి పెడుతున్నాను. ఏఐ వంటి రంగంలో నిరంతర అభ్యాసం అవసరం. అందుకే మేము మాసన్‌లో పని చేసే బృంద సభ్యులో అభ్యాస సంస్కృతిని ప్రోత్సహిస్తాం. వ్యక్తిగత వృద్ధిని పెంచడానికి ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలు, సంబంధిత ప్రోగ్రామ్‌లను ద్వారా వారిని శక్తివంతం చేస్తాం. పర్సనలైజ్డ్ షాపింగ్ అనుభవాలను సృష్టించడం నుండి డిజిటల్ కంటెంట్‌తో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతామో విప్లవాత్మకంగా మార్చడం వరకు అనేక రంగాలకు ఏఐ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2030 నాటికి 72 బిలియన్ల పరిశ్రమగా మారుతుందని భావిస్తున్నారు’ అంటూ ఆమె పంచుకున్నారు.
ప్రయాణాన్ని సులభం చేస్తూ…
ప్రియా సింగ్… విజయవంతమైన వెంచర్‌లను నిర్మించడంలో గొప్ప అనుభవమున్న వ్యాపరవేత్త ఈమె. స్టార్టప్‌లు, ఇంటర్నెట్ పరిశ్రమ, అభివృద్ధి రంగంలో ఆమె నైపుణ్యం క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ కీలకంగా ఉంది. భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థలోని అంతరాలను గుర్తించి, ఆ సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా ఛలో మొబిలిటీని స్థాపించారు. ‘వివిధ సంస్థలతో నా వృత్తిని ప్రారంభించాను. భారతదేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ పోర్టల్‌య CarWaleలో పనిచేసినపుడు మన రోడ్లు, పర్యావరణంపై ప్రైవేట్ వాహనాల ప్రభావం ఎలా ఉందో చూశాను. ఛలో ప్రారంభించడానికి ఇదే నా స్ఫూర్తి. ఛలోతో ప్రజా రవాణాలోని సమస్యను పరిష్కరించడానికి, లక్షలాది మంది బస్సు ప్రయాణాన్ని మెరుగుపరచడానికి సిద్ధమయ్యాం. బస్సు లైవ్ లొకేషన్, క్రౌడ్ లెవెల్ చూపించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. బస్సులలో డిజిటల్ చెల్లింపులను కూడా అందిస్తాం. ఫలితంగా ప్రయాణికులకు మెరుగైన సేవ లభిస్తుంది. రవాణా రంగంలో ప్రధానంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువ. నేనూ ఆ సమస్యలను ఎదుర్కొన్నాను. ఓ మహిళగా నేను ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా. అయితే ఈ సమస్యల పట్ల విభిన్నమైన, సమగ్ర దృక్పథం అవసరం. అయితే నాకు స్త్రీ పురుష బేధం కంటే సాంకేతికత ప్రధాన సవాలుగా మారింది. ఎందుకంటే ప్రజా రవాణా అనేది డిజిటల్ కేంద్రీకృతమైనది కాదు. ప్రయాణి కులు పాత ప్రయాణ పద్ధతులకు అలవాటు పడివున్నారు. లైవ్ బస్ ట్రాకింగ్, డిజిటల్ టికెటింగ్‌ను పరిచయం చేసిన తర్వాత కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. తర్వాత ప్రజలు అర్థం చేసుకొని ప్రతిఘటన తగ్గింది. దాంతో మేము మరిన్ని ఆవిష్కరణలవైపు ఆలోచిస్తున్నాం. ఏఐ విప్లవాత్మక మార్పులు చేయగలదు. రైడర్‌ల కోసం రాక సమయాలు, సరైన మార్గాలు, వేగవంతమైన రవాణా ఎంపికలను అందించడం ద్వారా ప్రయాణాన్ని ఆప్టిమైజ్ చేయవచ్చు. ఏఐలో ఆవిష్కరణలు వేగంగా జరుగుతున్నాయి. మేము ప్రజా రవాణాను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. కనుక సాంకేతిక పురోగతిలో ముందంజలో ఉండటం చాలా ముఖ్యం. దీనికోసం నిపుణులు, క్లయింట్లు, పెట్టుబడిదారులతో పటిష్టమైన సంబంధాలను ఏర్పరచుకుంటున్నాం. అలాగే కాన్ఫరెన్స్‌లు, వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌లలో చురుగ్గా పాల్గొంటాం. మా జ్ఞానం, నైపుణ్యాలను మరింతగా పెంచుకోవడానికి సంబంధిత ఆన్‌లైన్ కోర్సులను అన్వేషిస్తాం’ అంటూ ఆమె పంచుకున్నారు.
ఏఐ ఆధారిత వీడియోలు
రిత్విక… ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఈమెకు కృత్రిమ మేధస్సు శక్తిని ఉపయోగించుకోవాలనే అభిరుచి అప్పుడే మొదలయింది. అక్కడ ఆమె ఏఐపై అనేక పరిశోధనలు చేశారు. అనేక పత్ర సమర్పణలు చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంటెల్ ల్యాబ్స్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరారు. అత్యంత సంక్లిష్టమైన పనులను సులభంగా చేయడంతో పాటు ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఏఐ నిజమైన శక్తిని ఆమె అర్థం చేసుకున్నారు. ఆ అనుభవంతోనే అన్‌స్క్రిప్ట్‌ని స్థాపించారు. అన్‌స్క్రిప్ట్‌లో కస్టమర్ సముపార్జన, కస్టమర్ సక్సెస్, ప్రోడక్ట్ మార్కెటింగ్, స్టాకహేోల్డర్ మేనేజ్‌మెంట్‌తో పాటు మరెన్నో అప్లికేషన్‌లతో ఏఐ సహాయంతో అధిక-నాణ్యత, అనుకూలీకరించిన వీడియోలను సునాయాసంగా రూపొందిస్తున్నారు. గ్లోబల్ దిగ్గజాలతో పాటు అనేక స్టార్టప్‌ల కోసం 18 ఏండ్లకుపైగా పని చేసిన అనుభవం ఉంది.
‘ఈరోజు సాంకేతిక నైపుణ్యంతో సంబంధం లేకుండా వృత్తిపరమైన నాణ్యతతో కూడిన వీడియోలను సమర్ధవంతంగా, తక్కువ ఖర్చుతో రూపొందించడానికి అన్‌స్క్రిప్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మహిళగా ఏఐ ఫీల్డ్‌ను నావిగేట్ చేయడం సవాళ్లతో కూడుకున్నది. కెరీర్ ప్రారంభంలో మా బృందాల్లో నేను ఏకైక మహిళను. నాయకత్వ స్థాయిలో మహిళల కొరత నన్ను నిరుత్సాహపరిచింది. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న సపోర్ట్ గ్రూపులు, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లతో టెక్‌లో మహిళల కోసం సానుకూల మార్పు జరుగుతోంది. అన్‌స్క్రిప్ట్‌లో మేము ఇదే లక్ష్యం పెట్టుకున్నాం. సాంకేతిక రంగంలో మహిళలను నియమించుకోవడంలో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ మేము మహిళలనే ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. ఇది అచంచలమైన అంకితభావం అవసరమయ్యే డైనమిక్ ఫీల్డ్. దీనికి మహిళలు కచ్చితంగా సరిపోతారని నా నమ్మకం. మా అప్‌స్కిల్లింగ్ మొదటి అడుగు నాలెడ్జ్ గ్యాప్‌ను గుర్తించడం. అవసరమైన నైపుణ్యాలను గుర్తించడం. అలాగే స్థిరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ రంగానికి చాలా భవిష్యత్ ఉంది. ప్రత్యేకించి కళ, సంగీతం, వీడియో వంటి సృజనాత్మక రంగాలలో అవసరమైన అప్లికేషన్‌లను అందజేస్తున్నాం. ఏఐ పవర్డ్ వీడియో ప్రొడక్షన్‌లో అన్‌స్క్రిప్ట్ ముందంజలో ఉంది. ఖరీదైన, ఎక్కువ సమయం తీసుకునే సవాళ్లను పరిష్కరించడం ద్వారా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది’ అని ఆమె అంటున్నారు.