హాస్టల్ విద్యార్థుల బియ్యం పక్కదారి.?

నవతెలంగాణ – అచ్చంపేట 
గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్ విద్యార్థుల బియ్యం సంబంధించిన వార్డెన్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరో మూడు రోజులలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కారున్నాయి. అన్ని హాస్టల్లో విద్యార్థులు వారి వారి ఇండ్లకు వెళ్లిపోతారు. దీని ఆసరాగా చేసుకున్న హాస్టల్ వార్డెన్లు ఈ నెలకు సంబంధించిన బియ్యం కోటాను బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో 10 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టల్లు , 10 ఎస్సీ సంక్షేమ హాస్టలు, మరో 10 గిరిజన సంక్షేమ శాఖ ఆస్తులు ఉన్నాయి. వీటి పరిధిలో నిరుపేద విద్యార్థులు వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో గల బియ్యం గోదాము నుండి అన్ని హాస్టళ్లకు బియ్యం సరఫరా అవుతుంటాయి. ఆయా హాస్టల్ వార్డెన్లు బియ్యం గోదాంకు వచ్చి వేలిముద్ర వేసి బియ్యం తీసుకపోవాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 15,  16, 17 తేదీలలో కొందరు వార్డెన్లు బియ్యం గోదాంలో వేలిముద్ర వేసి వెళ్లారు. కానీ బియ్యం హాస్టల్ కు తీసుకు వెళ్లలేదని తెలిసింది. బియ్యం గోదాం ఇన్చార్జి , సిబ్బంది సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్లో వారీగా ప్రతి నెల ఎన్ని క్వింటాల బియ్యం సరఫరా అవుతున్నాయి…! ఎన్ని మిగులుతున్నాయి రికార్డు లలో నమోదు చేయాలి.  హాస్టల్ వార్డెన్లు, బియ్యం గోదాం ఇన్చార్జి సిబ్బంది కుమ్మక్కై విద్యార్థుల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  విద్యార్థుల బియ్యాన్ని  బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల బియ్యాన్ని పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.