వారసత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న రైస్ మిల్లర్స్ నేత..

Rice millers leader who is trying to occupy heritage land..– ప్రశ్నించినందుకు తనపై దాడికి పాల్పడిన దయానంద్ గుప్తా పై చర్యలు తీసుకోవాలి

– విలేఖర్ల సమావేశంలో బాధితురాలు తులసి ఆరోపణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వారసత్వంగా వస్తున్న తమ భూమిని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా ప్రశ్నించిన తమపై దౌర్జన్యంగా దాడి చేసి గాయపరిచిన రైస్ మిల్లర్స్ నేత దయానంద్ గుప్తా పై చర్య తీసుకోవాలని బాధితురాలు గోపు తులసి ఆరోపించారు. ఈ మేరకు గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు వంశపారంపర్యమైన అత్తమామల ఆస్తి భూమి సర్వే నెం3191/అ అందులో 32 గుంటల వ్యవసాయ భూమికి తాము సంపూర్ణ హక్కు దారులం అన్నారు. ఎంతో కాలం నుండి తమ భూమిని తామే సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని కానీ న్యూ హౌసింగ్ బోర్డ్ గౌతమ్ నగర్ కు చెందిన ఎం దయానంద్ గుప్తా అనే వ్యక్తి తమ యొక్క వ్యవసాయ భూమిని అక్రమంగా ఆక్రమించుకొనుటకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కబ్జా చేస్తున్న విషయం తెలుసుకొని తాము అక్కడికి వెళ్లి అతన్ని ప్రశ్నించగా, అతని అనుచరులతో తమ పైన దౌర్జన్యంగా దాడి చేసి గాయపరిచారని, వారు చేసిన దాడి వల్ల తనకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సంబంధిత మూడవటౌన్ పోలీస్ స్టేషన్కు వెళితే తమ ఫిర్యాదును స్వీకరించకుండా దయానంద్ గుప్తా తన అధికారాన్ని ఉపయోగించారని ఆమె విమర్శించారు. దీంతో త్రీ టౌన్ పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం అనడంతో చివరకు ఎస్సై స్పందించి గురువారం తమ ఫిర్యాదును స్వీకరించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తమపై దౌర్జన్యంగా దాడి చేసిన దయానంద్ గుప్తా అతని అనుచరుల పై చర్య తీసుకోనీ తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో విజేత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, అనిత సుజాత పూజ తదితరులు పాల్గొన్నారు.