– పెరిగిన ధరలతో సామాన్యులు విలవిల
మునుపెన్నడూ లేని విధంగా పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు కొనలేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సీజన్‌లో రైతులు ధాన్యం రెట్టింపుస్థాయిలో పండించినప్పటికీ బియ్యం ధరలు అమాంతం పెరగడంతో మార్కెట్‌లో సన్నబియ్యం కొనలేకపోతున్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని దళారులు అధిక ధరలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్టాలకు తరలించడంతోనే బియ్యం ధరలు ఆకాశానంటుతున్నాయి. కిలో రూ.45 నుంచి రూ.55 వరకు ఉండటంతో పూట తిండికి దూరం అవుతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-మల్హర్‌రావు
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలో ఈ సీజన్‌లో చిన్నతరహా ప్రాజెక్టులైన కాపురం చెరువు, బొగ్గులవాగు ప్రాజెక్టు, చెరువులు, కుంటలు, మానేరు పరీవాహక ప్రాంతాల్లో పైప్ లైన్లు, బోర్ బావులు తదితర వాటితో విస్తారంగా వరి సాగు చేశారు. సుమారు 6వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేశారు. దాదాపు 200 టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా. కాగా రైతుల నుంచి ఇప్పటికి 50 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా పొలాలు కోతకు ఉన్నాయి. సన్నరకం ధాన్యం పండించడం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే బియ్యం ధరలు మాత్రం పెరిగాయి. ఈ సీజన్‌లో మండలవ్యాప్తంగా 10 టన్నుల దాకా ప్రజలు సన్నరకం ధాన్యం వినియోగిస్తున్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1500 భారం పడుతోంది. మొత్తంగా మండల ప్రజలపై దాదాపు రూ. కోటి భారం పడుతున్న పరిస్థితి. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి మిల్లింగ్ అనంతరం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. దీన్ని అరికట్టడంలో పౌరసరఫరాల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఫలితంగానే ఈ ఏడాదిలో బియ్యం ధరలు పెరిగాయని, ఇతర రాష్ట్రాలకు ఎగుమతిని నిరోదిస్తే ఈ పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు.