– ఘోష్, హర్మన్‌ప్రీత్ అర్థ సెంచరీలు
– యుఏఈపై భారత్ ఘన విజయం
– భారత్ 201/5, యుఏఈ 123/7
ఆసియా కప్‌లో అమ్మాయిలకు ఎదురు లేదు. గ్రూప్ దశలో పాకిస్థాన్, యుఏఈలను చిత్తు చేసిన టీమ్ ఇండియా సెమీఫైనల్ బెర్త్ లాంఛనం చేసుకుంది!. రిచా ఘోష్ (64 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (66) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగటంతో పొట్టి ఫార్మాట్‌లో భారత మహిళల జట్టు తొలిసారి 200 పరుగుల మార్క్ అందుకుంది. బౌలర్లు సమిష్టిగా మెరవటంతో ఛేదనలో యుఏఈ చేతులెత్తేసింది. 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-దంబుల్లా
ఏడుసార్లు చాంపియన్ ఏకపక్ష విజయాల జోరు కొనసాగుతుంది. ఆసియా కప్ గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు.. తాజాగా యుఏఈపై ఘన విజయం సాధించారు. బ్యాట్‌తో, బంతితో దుమ్మురేపిన టీమ్ ఇండియా 78 పరుగుల తేడాతో గెలుపొందింది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ ఉండగానే.. సెమీఫైనల్ బెర్త్ లాంఛనం చేసుకుంది. స్పిన్నర్ దీప్తి శర్మ (2/23) మాయకు రాధ యాదవ్, తనూజ కన్వార్ జోరు తోడవటంతో ఛేదనలో యుఏఈ తేలిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులే చేసింది. ఆల్‌రౌండర్ కవిశ (40 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ ఇషా ఓజా (38, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో యుఏఈ గౌరవప్రద స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ భారత అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (64 నాటౌట్, 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66, 47 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. షెఫాలీ వర్మ (37, 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిసింది. రిచా ఘోష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ తలపడనుంది.
తిప్పేశారు
యుఏఈని భారత బౌలర్లు తిప్పేశారు. స్పిన్నర్లు దీప్తి శర్మ (2/23), రాధ యాదవ్ (1/29) మూడు వికెట్ల మాయజాలం చేయగా.. పేసర్లు రేణుక సింగ్, తనూజ కన్వార్, పూజ వస్ట్రాకర్‌లు మరో మూడు వికెట్లు పడగొట్టారు. పవర్‌ప్లే నుంచే వికెట్ల వేట మొదలెట్టిన బౌలర్లు యుఏఈ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్ ఇషా ఓజా (38) టాప్ ఆర్డర్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. తీర్థ సతీశ్ (4), రినిత (7), సమైర (5) నిరాశపరిచారు. అయినా, ఓ ఎండ్‌లో నిలబడి స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. ఆల్‌రౌండర్ కవిశ (40 నాటౌట్)తో కలిసి ఇషా మంచి భాగస్వామ్యం నెలకొల్పింది. భారీ ఛేదనలో భారత బౌలర్లపై ఎదురుదాడి చేయలేని యుఏఈ.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. 78 పరుగుల తేడా భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో యుఏఈకి ఇది వరుసగా రెండో పరాజయం. వరుసగా రెండో విజయంతో భారత్ సెమీస్ బెర్త్ లాంఛనం చేసుకోగా.. యుఏఈ ఇంటిబాట పట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
రిచా రచ్చ రచ్చ
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న యుఏఈ… భారత్‌కు పవర్ ప్లేలో గట్టి షాక్ ఇచ్చింది. భారత ఓపెనర్లు గట్టి షాక్ ఇచ్చారు. ప్రమాదకర ఓపెనర్ షెఫాలీ వర్మ (37) తనదైన శైలిలో దంచికొట్టింది. కానీ మరో ఎండ్‌లో భారత్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. స్మృతీ మంధాన (13), హేమలత (2) సహా షెఫాలీ సైతం పవర్‌ప్లేలోనే డగౌట్‌కు చేరుకున్నారు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిన షెఫాలీ పవర్‌ఫుల్ ఇన్నింగ్స్ నమోదు చేసింది. షెఫాలీ జోరుతో ఆరంభంలో భారత్ దండిగా పరుగులు పిండుకుంది. ఆరు ఓవర్ల అనంతరం 56/3తో నిలిచిన టీమ్ ఇండియాను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66) ముందుకు నడిపించింది. జెమీమా రొడ్రిగస్ (14) నిరాశపరిచినా..రిచా ఘోష్ (64 నాటౌట్)తో కలిసి భారత్‌కు రికార్డు స్కోరు అందించింది. ఐదు ఫోర్లతో 41 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్‌కు గెలుపు స్కోరు ఖాయం చేయగా.. రిచా ఘోష్ విశ్వరూపంతో పొట్టి ఫార్మాట్‌లో మహిళల జట్టుకు అత్యధిక స్కోరు రికార్డును అందించింది. హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్ ధనాధన్‌తో ఆఖరు 9 బంతుల్లో భారత్ 34 పరుగులు పిండుకుంది. 19వ ఓవర్లో చివరి మూడు బంతులను హర్మన్‌ప్రీత్ కౌర్ 4, 4, 6గా మలిచింది. ఆఖరు ఓవర్ తొలి బంతికి హర్మన్‌ప్రీత్ రనౌట్‌గా నిష్క్రమించినా.. ఆ తర్వాతి ఐదు బంతులను రిచా ఘోష్ బౌండరీకి తరలించింది. దీంతో భారత్ తొలిసారి టీ20ల్లో 200 ప్లస్ పరుగుల మైలురాయి దాటింది.
స్కోరు వివరాలు :
భారత మహిళల ఇన్నింగ్స్ : షెఫాలీ వర్మ (సి) తీర్థ సతీశ్ (బి) ధర్నిధారక 37, స్మృతీ మంధాన (సి) రినితర రజిత్ (బి) కవిశ 13, హేమలత (బి) హీనా 2, హర్మన్‌ప్రీత్ కౌర్ (రనౌట్) 66, జెమీమా రొడ్రిగస్ (సి) రినిత రజిత్ (బి) కవిశ 14, రిచా ఘోష్ నాటౌట్ 64, పూజ వస్ట్రాకర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201.
వికెట్ల పతనం : 1-23, 2-52, 3-52, 4-106, 5-181.
బౌలింగ్ : షమిర ధర్నిధారక 4-0-42-1, ఖుషీ శర్మ 1-0-15-0, కవిశ 4-0-36-2, హీనా 4-0-40-1, వైష్ణవి 3-0-28-0, ఇషా 2-0-26-0, ఇందుజ నందకుమార్ 2-0-14-0.
యుఏఈ మహిళల ఇన్నింగ్స్ : ఇషా ఓజా (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) కన్వార్ 38, తీర్థ సతీశ్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) రేణుక సింగ్ 4, ధర్నిధారక (సి) కన్వార్ (బి) దీప్తి శర్మ 5, కవిశ నాటౌట్ 40, ఖుషీ శర్మ (సి) మంధాన (బి) రాధ 10, హీనా (సి) షెఫాలీ (బి) దీప్తి శర్మ 8, రితిక రజిత్ (రనౌట్) 6, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 123.
వికెట్ల పతనం : 1-11, 2-24, 3-36, 4-76, 5-95, 6-107, 7-123.
బౌలింగ్ : రేణుక సింగ్ 4-0-30-1, తనుజ కన్వార్ 4-0-14-1, పూజ వస్ట్రాకర్ 4-1-27-1, దీప్తి శర్మ 4-0-23-2, రాధ యాదవ్ 4-0-29-1.