పులిమీద స్వారీ

Riding a tigerస్వారీ చెయ్యడం అదరికీ రాదు. అది చెయ్యడం వచ్చినవాడు మరి మానడు. అది గుర్రపు స్వారీ అయితేనేం, ఏనుగు అంబారీ ఎక్కడమైతేనేం, సాటి మనిషి తలమీద తకధిమ్మయితేనేం! స్వారీ చెయ్యడం అలవాటయిన వాడు తరవాత్తరవాత దిగాలనుకున్నా దిగలేని పరిస్థితి వస్తుంది.
అనగనగా ఓ మనిషి. ఆకారంలో అందరు మనుషుల్లాగే వుంటాడు కానీ అందరిలోకీ ప్రత్యేకంగా వుండాలనుకుంటాడు. అందరి మీదా అధికారం చెలాయించాలనుకుంటాడు. చుట్టూ వున్న జనం తనకు బ్రహ్మరథం పట్టాలనుకుంటాడు. తనమాటే శాసనం కావాలనుకుంటాడు. భూమిని చాపలా చుట్టాలని, ఆకాశాన్ని దిండుగా పెట్టుకోవాలని కలలు కంటాడు.
అనగనగా ఆ మనిషి తను అనుకున్నది సాధించడం కోసం తన వ్యామోహం పంట పండడం కోసం, తన విజయం కోసం జనారణ్యంలో వెదుకులాట మొదలు పెట్టాడు. అతని వెతుకులాట ఫలించింది. కోరుకున్న విజయలక్ష్మి కనిపించింది. ‘నువ్వేనా నువ్వేనా నా విజయలక్ష్మివి’ అని ఆమె ముందు మోకలిల్లాడు. తనను వరించమని బతిమిలాడేడు.
నిన్నే ఎందుకు వరించాలి? నీలో ఏముందని వరించాలి? అందామె క్రీగంట చూస్తూ. నేను ఉత్తముడిని. ఉత్తమోత్తముడ్ని. సాటి మనుషుల పట్ల నాకున్న ప్రేమ కొలవరానిది. తూకం వెయ్యరానిది. ఏడ్చే వాళ్ల కన్నీళ్లు తుడుస్తాను. బాధితుల పెదవుల మీద చిరునవ్వుల పూలు పూయిస్తాను. అందరి బరువునీ నీనొక్కడ్నే మోస్తాను. నిత్య సేవకుడినై ఆబాల గోపాలానికి సేవలందిస్తాను. నీవే నా జీవితం, నేవేనా జీవిత లక్ష్యం. ప్రజాసేవే పరమార్ధం అన్నాడు మనిషి.
విజయలక్ష్మి ఆ మాటల మాయలో పడిపోయింది. ఆ మనిషిని పూర్తిగా నమ్మేసింది. మాట తప్పవు కదా అంది. నిజంగా మంచివాడవే కదా అంది. అతని అమాయకపు ముఖంలో తనకు కావల్సిన సమాధానం దొరికింది అనుకుంది. పెదవి మీద వెలుగుతున్న నక్షత్రంతో తన చేతుల్లో వున్న వరమాలను అతని మెడలో వేసింది.
అనగనగా ఒక మనిషిని విజయలక్ష్మి వరించింది. విజయగర్వంతో మనిషి ఛాతీ వెడల్పయింది. విజయం నాదే అనుకుంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. ఊహించని పరిణామానికి అతను ఉలిక్కిపడ్డాడు. విజయలక్ష్మి ఆకారం మారిపోయింది. బంగారపు రంగు మీద నల్లటి చారికలు. ముఖంలో అహంకారం, కళ్లల్లో క్రౌర్యం ప్రస్ఫుటంగా కనిపించాయి. అడుగు వెనక్కి వేసిన మనిషి అడిగాడు ‘ఎవరు నువ్వు?’ అని. నేనే నీ అధికార వ్యామోహానికి ప్రతిరూపాన్ని రా. నేను పులిని! స్వారీ చెయ్యి. నువ్వు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి. పులిమీద స్వారీ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఈ పులి నీకు దాసోహం. ఇంకా ఆలస్యం దేనికి? కమాన్‌, నేను నీ బానిసను. నిన్ను మోయడమే నా డ్యూటీ. ‘ది టైగర్‌ ఈజ్‌ ఎట్‌ యువర్‌ సర్వీస్‌’ అంది పులి.
మనిషి పులి మీద స్వారీ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ మనిషి ఇదివరకటి మనిషి కానే కాదు. అహంకారం తలమీద సెటిలయిపోయింది. అధికారం కాలనాగు విషంలా నరాల్లో ప్రవహించసాగింది. కళ్లకు మనుషులంతా చీమల్లా కనిపించసాగారు. తను పులిమీద స్వారీ చేస్తున్నవాడు. తనకు అందరూ గులాములే. తన మాటకు తిరుగులేదు. తను ఏమైనా చెయ్యగలడు. తనను ఎవరూ ప్రశ్నించలేరు. అడ్డుకోలేరు. తనకు తెలీకుండానే అక్రమాలకు ఆనకట్ట తెంచేశాడు. నీతిని ఉప్పుపాతర వేశాడు. దుర్మార్గాలకి సెల్యూట్‌ కొట్టాడు. ప్రజాసేవే జీవితం లక్ష్యం అన్న మాట పూర్తిగా మరిచిపోయాడు. ఏడ్చేవాళ్లు కంటికి కనిపించలేదు. సాటి మనుషుల మీద ప్రేమ ఎడారిలో ఎండమావి అయింది. బాధితుల పట్ల చిరాకు పుట్టింది. సంపద గుట్టలుగా పోగయింది. మేడలు, మిద్దెలు లెక్కకు రానన్ని పోగైనవి.
ఆనందపు అంచుల్ని, విషాదపు లోతుల్ని చూసే కాలం క్షణం కూడా ఆగదు కదా! మనిషి తల్లో సుతిమెత్తని ప్రదేశంలో వుండే పురుగు ఎప్పుడు ఎటు పరుగెడ్తుందో ఎవరు చెప్పగలరు? ఆలోచనల సాగరం ఎప్పుడు భయం సునామీగా మారుతుందో ఎవరూ చెప్పలేరు.
పులి మీద స్వారీ చేస్తున్న మనిషి కాసేపు కిందికి దిగుదాం అనుకున్నాడు. నిరంతరం పులిమీద స్వారీ చేసి అలిసిపోయాననుకున్నాడు. ఆ మాటే పులితో అన్నాడు.
పులి అందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. ఒక్కసారి పులిని స్వారీ చేయడం మొదలు పెట్టినవాడు కిందికి దిగడానికి వీల్లేదన్నది పులి. నువ్వు నా మీది నుంచి దిగిన మరుక్షణం కష్టాల సుడిగుండంలో గిర్రున తిరుగుతావు. నువ్వు చేసిన అక్రమాలన్నీ నిన్ను కోర్టు మెట్లెక్కిస్తయి. నీ చేత జైలు ఊచలు లెక్కపెట్టిస్తయి. నీ ఆగడాల వల్ల అవస్థలు పడ్డ ప్రజలు ‘ఛీ’ కొడుతరు. నీకు సలాములు చేసినవాళ్లే ‘తూ’ అంటరు. ఎంత అధికార దుర్వినియోగం చేశావో గుర్తు చేసి, ప్రజలు నీ బతుకు దుర్భరం చేస్తారు. పులిమీద ఎక్కడమే కాని దిగడం నీ వల్ల కాదు. కాదని దిగి చూడు… ఇన్నాళ్లు నువ్వు ఎక్కి తిరిగిన నీ పులినే, నిన్ను పంజాతో చీల్చి చెండాడేస్తాను అంది పులి.
పులి మీద స్వారీ చేస్తున్న మనిషి, దిగి పోతే ఏం జరుగుతుందో ఊహించుకుని వణికిపోయాడు. ఏం చేసైనా సరే పులి మీద స్వారీ ‘కంటిన్యూ’ చెయ్యాలనుకున్నాడు.
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అనేకమంది మనుషులు ఒకసారి ఎక్కితే దిగలేని పులి మీద స్వారీ చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆశల పేకమేడలు కట్టుకుంటున్నారు. తమను తాము పూర్తిగా కోల్పోయే ‘డేంజర్‌ జోన్‌’ లోకి అడుగు పెట్టడానికి టిక్కెట్లు’ ఇప్పించే ‘కాళ్లు’ పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212