– పెరుగుతున్న అసమానతలు
– పెద్దలకు వరాలు…పేదలపై భారాలు
– కార్పొరేట్ శక్తుల జేబులు నింపుతున్న ప్రభుత్వం
– నానాటికీ తీసికట్టుగా మారిన పేదల సబ్సిడీలు
న్యూఢిల్లీ : అమెరికా ఆర్థిక వ్యవస్థ రిగ్గింగుకు గురైందని కొన్ని సంవత్సరాల క్రితం నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్‌లిట్జ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఆదాయ అసమానతలు అధికంగా ఉన్నాయని, అత్యంత సంపన్నులైన 1శాతం ప్రజల చేతిలో లెక్కకు మించిన ఆదాయం పోగు పడిందని ఆయన తెలిపారు. మిగిలిన 99శాతం ప్రజల ఆదాయాలు మాత్రం ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. వాస్తవానికి అమెరికాలో మాత్రమే కాదు… మన దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ రిగ్గింగుకు గురవుతోంది. అవును…అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే అధికంగానే. భారత జాతీయాదాయంలో అత్యంత సంపన్నులైన 10శాతం మంది వాటా అమెరికా, చైనా దేశాలలోని అత్యంత సంపన్నులైన 10శాతం మంది వాటా కంటే ఎక్కువగానే ఉంది. కానీ దురదృష్టమేమంటే మన దేశంలోని మెజారిటీ ప్రజలు ఆర్థిక వ్యవస్థ రిగ్గింగుకు గురవుతోందన్న విషయాన్ని గుర్తించడం లేదు. నిరంకుశ శక్తుల పాలనలో ఈ కఠోర వాస్తవం మరుగున పడుతోంది. ఎందుకంటే ఈ శక్తులు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని శాసిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి.
పెరుగుతున్న ఆదాయ వ్యత్యాసాలు
గత 12 సంవత్సరాల కాలంలో అత్యంత సంపన్నులు, అట్టడుగున ఉన్న పేదల మధ్య ఆదాయ వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. 2005లో పేద ప్రజలకు సంపదలో
ఎంత వాటా (6.5శాతం) ఉన్నదో 2022లో కూడా అంతే ఉంది. అదే కాలంలో అత్యంత సంపన్నులైన 10శాతం మంది ప్రజలకు సంపదలో వాటా 59.7శాతం నుండి 64.6శాతంకి పెరిగిపోయింది. అంటే 4.9 శాతం పాయింట్లు పెరిగింది. ఇదంతా మధ్య తరగతి ప్రజల నుండి పొందినదే. 1961లో పేద ప్రజలకు జాతీయ సంపదలో 11.4శాతం వాటా ఉంది. అదే సంవత్సరం అత్యంత సంపన్నులైన 1శాతం మందికి 12.9శాతం వాటా, 0.1శాతం మందికి 3.2శాతం వాటా ఉంది. 2022 నాటికి 0.1శాతం ప్రజల సంపద తొమ్మిది రెట్లు పెరిగింది.
కట్టు కథల ప్రచారం
దేశంలో పేదరికమే అతి పెద్ద కులమని పాలకులు చెబుతున్నారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ అధికారులేమో పేదరికం కేవలం 5శాతానికి తగ్గిపోయిందని కథలు చెబు తారు. సంపదను తిరిగి పంపిణీ చేసినంత మాత్రాన ఆర్థిక అసమానతలు తొలగిపోవని, అసమానత అనేది మార్కెట్ శక్తుల సహజ ఫలితమని, అసలు ఆదాయ అసమానతలు పెద్ద సమస్యే కాదని పాలకులకు వంత పాడుతున్న మీడియా సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
పేదల కడుపు కొట్టి…పెద్దల బొజ్జ నింపి
ప్రభుత్వం చేసే పని ఏమిటి? ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం…ఆ సొమ్మును ఖర్చు చేయడం. అయితే ఈ పన్నుల వ్యవస్థ ఎప్పుడూ సంపన్నులకే ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుపేదలకు నష్టాన్ని, కష్టాన్ని మిగిలిస్తుంది. 2009-10లో మొత్తం వసూలు చేసిన పన్నుల్లో 61శాతం ప్రత్యక్ష పన్నులు, 39శాతం పరోక్ష పన్నులు. 2021-22 నాటికి ప్రత్యక్ష పన్నులు 49శాతానికి తగ్గి పరోక్ష పన్నులు 51శాతానికి పెరిగాయి. వాస్తవానికి పన్నుల భారం సంపన్నుల పైనే అధికంగా ఉండాలి. పేదలపై సాధ్యమైనంత తక్కువ పన్ను భారం మోపాలి. అయితే ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పేదలు, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపుతూ సంపన్నులకు సబ్సిడీలు అందిస్తోంది. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం పరోక్ష పన్నుల్లో మూడింట రెండు వంతుల ఆదాయం పేద ప్రజల నుండి వస్తున్నదే. ఆ ఆదాయంతోనే ప్రభుత్వం సంపన్నులకు పన్ను రాయితీలు కల్పిస్తోంది.
పెట్టుబడి వ్యయం పెంచుతూ… సబ్సిడీలను తగ్గిస్తూ…
కేంద్రం మూడు ప్రధాన పదులపై ఖర్చులు చేస్తుంది. అవి పెట్టుబడి వ్యయం, సబ్సిడీలు, రక్షణ-దేశ భద్రతపై చేసే వ్యయం. సాధారణంగా పెట్టుబడి వ్యయం కంటే సబ్సిడీలపై పెట్టే ఖర్చు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. 2016-17 నుండి (కోవిడ్-19 సంవత్సరంలో తప్ప) పెట్టుబడి వ్యయం పెరుగుతూనే ఉంది. సబ్సిడీలపై ఖర్చు తగ్గిపోతోంది. ఈ చర్యల ద్వారా వనరులను సమానంగా పంపిణీ చేయాలన్న సూత్రాన్ని ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. పెట్టుబడి వ్యయం అనేది కార్పొరేట్ ప్రయోజనాలకే ఉపకరిస్తుంది. ఈ పద్దు కింద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పెట్టే పెట్టుబడులు అంతిమంగా కార్పొరేట్ శక్తులకు లాభాల పంట పండిస్తాయి. ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతాయి. 2008-09 నుండి 2013-14 వరకూ ప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీలపై 15.7శాతం ఖర్చు చేసింది. అదే కాలంలో పెట్టుబడి వ్యయంపై 11.7శాతం ఖర్చు చేసింది. అయితే 2014-15 నుండి 2022-23 వరకూ సబ్సిడీలపై సగటు ఖర్చు 12.8శాతంకి తగ్గగా పెట్టుబడి వ్యయం 13.9శాతంకి పెరిగింది. ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రతి రోజూ విధానాలను మార్చేస్తోంది. అసమానతలపై పోరాడాల్సిన ప్రభుత్వం తిరోగమన పన్ను విధానాల ద్వారా సంపన్నుల కొమ్ము కాస్తోంది.భారత్ వంటి పెట్టుబడిదారీ సమాజంలో డబ్బు ఎక్కడ ఉంటుందో అధికారం అక్కడికే చేరుతుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియ కూడా అపహాస్యం పాలవుతోంది. వేలంలో ఎక్కువ మొత్తంలో పాట పాడిన వ్యక్తి ఎలాగైతే బిడ్డింగును దక్కించుకుంటాడో ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసిన వారే విజేతలుగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరుగుతోందో అర్థిక వ్యవస్థలోనూ అలాగే జరుగుతోంది.
పేదలు, మధ్య తరగతి ప్రజలను కొల్లగొడుతూ…
వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక అనేక చేదు నిజాలను బయటపెట్టింది. అట్టడుగున ఉన్న 50శాతం మంది పేదలు, ఓ మాదిరి స్థాయిలో ఉన్న 40శాతం మంది మధ్య తరగతి ప్రజల ఆదాయాలను ఈ 10శాతం మంది సంపన్నులే కొల్లగొట్టి జేబులో వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో 40శాతం మంది మధ్య తరగతి ప్రజల చేతుల్లో ఉన్న సంపద 10శాతం మంది సంపన్నుల జేబుల్లో చేరుతోంది. ఉదాహరణకు 2007లో మధ్య తరగతి ప్రజలు మొత్తం ఆదాయంలో 34.6శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే 2022 నాటికి అది 27.3శాతంకి పడిపోయింది. అదే సమయంలో అత్యంత సంపన్నులైన 10శాతం మంది ప్రజల వాటా 48.1శాతం నుండి 57.శాతానికి పెరిగిపోయింది. మొత్తం ఆదాయంలో పేదల వాటా కూడా 17.5శాతం నుండి 15శాతంకి తగ్గింది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే అత్యంత సంపన్నులైన 10శాతం మంది ప్రజలు మధ్య తరగతి ప్రజల నుండి 7.2 శాతం పాయింట్లను, పేదల నుండి 2.5 శాతం పాయింట్లను కొల్లగొట్టారు.