– ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితుల సమస్యలను చేర్చాలి
– ఢిల్లీలో రాజకీయ పార్టీలకు వ్యవసాయ కార్మిక, దళిత, స్వచ్ఛంద సంఘాల విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ
‘దేశంలో 17 శాతం పైగా ఉండి, గ్రామీణ ఉత్పత్తిలో ముఖ్యభాగమైన దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి జరుగుతుంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగం కల్పించిన వారి హక్కులు కాలరాయబడుతున్నాయి. 2024లో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో దళితుల సమస్యలు చేర్చాలి’ అని ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజకీయ పార్టీలను కలుస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం నాడిక్కడ దళిత సమస్యలపై ఏర్పడ్డ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు మల్లేపల్లి లక్ష్మయ్య, బి. వెంకట్, రాజ్యసభ ఎంపి వి.శివదాసన్, నిర్మల్, విక్రమ్ సింగ్, సాయిబాలాజీ, నటుప్రసాద్ తదితరులు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి డిమాండ్ చార్టర్ అందజేశారు. ఇటీవల సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత్ కో-ఆర్డినేషన్ కమిటీ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి.వెంకట్ ఏపి, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, దళితుల సమస్యలపై హైదరాబాద్‌లో 100 సంఘాలు, వ్యక్తులు కలిసి దళిత్ సమ్మిట్ నిర్వహించామన్నారు. ఈ సమస్యలు రాజకీయ ఎజెండా కోసం కో ఆర్డినేషన్ కమిటీని రూపొందించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే డిసెంబర్ 4న ”మార్చ్ టూ పార్లమెంట్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కమిటీ పిలుపులో భాగంగా దశలు వారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతి కి అందిస్తామన్నారు. కో ఆర్డినేషన్ కమిటి ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సదస్సలు నిర్వహించి, దళితుల సమస్యలపై చర్చ చేస్తామన్నారు. ప్రతి రాష్ట్రంలో దళితుల సమస్యలు అద్యయనం చేయడానికి క్షేత్ర స్థాయిలో ఒక గ్రామాన్ని ఎంచుకోని సర్వే నిర్వహించుతామన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే పార్టీలతో భేటీ
ఢిల్లీలో అఖిల భారత నాయకులనే కాకుండా రాష్ట్ర స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తున్న డిఎంకె, ఆర్జేడి, ఎస్పీ, జెడియు, జెఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి వంటి ఇండియా ఫోరంలోని పార్టీలు, బిఎస్పి లాంటి నాయకులను కూడా కలవాలని నిర్ణయం తీసుకున్నామని వెంకట్ తెలిపారు. 12 డిమాండ్లలో భూ పంపిణీ మొదలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, రాజ్యాంగ హక్కులు పరిరక్షణ, దళితుల సమస్యలు పరిష్కారం లాంటి ప్రధానమైన డిమాండ్లను తీసుకోవడం జరిగిందన్నారు.2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించి, సామాజిక న్యాయం, సమన్యాయం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం బిజెపి యేతరశక్తులని ఈ కమిటీతో కలిసి రావాలని ఆయన తెలిపారు.