యుపిఎ హయాంలో వామపక్షాల కృషితో సాధించుకున్న చట్టాల్లో సమాచార హక్కు చట్టం-2005 ఒకటి. ఈ చట్టం. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ఒక్క దరఖాస్తుతో కావలసిన సమాచారం పొందే హక్కును కల్పించింది. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఒకపక్క చట్టాన్ని చట్టుబండలు చేస్తుండగా మరోపక్క ప్రజా సమాచార అధికారులకు మొట్టికాయ వేసి సమాచారం ఇప్పించాల్సిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయం సిబ్బంది లేక ఇరవై నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో సామాన్యుడికి సమాచారం అందడం గగనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక దరఖాస్తులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటమే దీనికి నిదర్శనం.
సమాచార హక్కు చట్టం పార్లమెంట్‌లో 12 ఆక్టోబర్ 2005న ఆమోదించబడింది. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం 15(1) ప్రకారం సమాచార కమిషన్ 2017 సెప్టెంబర్ 13న ఏర్పడింది. ప్రధాన కమిషనర్‌గా రాజాసాధారం, కమిషనర్‌గా బుద్ధ మురళిని అప్పటి ప్రభుత్వం నియమించింది. 2020 ఆగస్టులో రాజసాధారం పదవి విరమణ పొందడంతో ప్రధాన కమిషనర్‌గా మురళిని నియమించింది. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో ఐదుగురు కమిషనర్లుగా నియమించబడ్డారు. 2023 ఫిబ్రవరి 24 నాటికి అందరూ పదవి విరమణ పొందడంతో సమాచార కమిషన్ ఖాళీ అయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం 2023 జులైలో నోటిఫికేషన్ జారీచేయగా దాదాపుగా 350 దరఖాస్తులొచ్చాయి. ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమాచార కమిషనర్ల నియామకం గురించి పట్టించుకోలేదు. దీంతో సమాచార కమిషన్లు అప్పిల్స్, ఫిర్యాదులు కొండల్లా పెరిగిపోతున్నాయి.
సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 కింద దరఖాస్తు చేస్తే సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో సింహభాగం ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి అప్పీల్ చేసినా స్పందన ఉండటం లేదు. అలాగే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్4(1)బి అన్నది చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉంటాయి. ప్రతి ప్రభుత్వ కార్యాల యంలోని అధికారుల వివరాలు, వారి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కార్యాలయానికి వస్తున్న నిధులు వాటి ఖర్చు వివరాలు వీటిని అన్నిటి సంబంధిత ప్రభుత్వ యంత్రాంగమే ప్రజలకు స్వచ్ఛందంగా ఈ అంశాల ద్వారా తెలియజేయాలి. రాష్ట్రంలో దాఖలవుతున్న సహ దర ఖాస్తుల్లో 60 శాతం ఈ సెక్షన్ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ జిల్లా మండల స్థాయిలలో ప్రజా సమాచార అధికారులు 4(1) బిని సరిగా అమలు చేయడం లేదు. ప్రతి ఏడాది 17 అంశాలను అఫ్‌డేట్ చేయడం లేదు.
కొన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టర్ భవన సముదాయంలోని వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు వారి కార్యాలయం ముందు కనీసం స.హ.బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. స.హ. చట్టంపై జిల్లాస్థాయిలో మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఉత్తర్వు నంబర్ 1185 ప్రకారం జిల్లా స్థాయిలో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలుపరచడం కోసం అధికారులు సహోద్యమకారులతో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా కమిటీలు ఇంతవరకు ఏర్పడలేదు. సమాచార కమిషనర్ల నియామకం జరిగి అప్పిళ్లు, ఫిర్యాదులు విచారణకు వచ్చినప్పుడే ప్రజా సమాచార అధికారులు సకాలంలో సమాచారం అందించగలుగుతారు. అలాగే జిల్లా స్థాయిలో సమాచార హక్కుచట్టంపై అధికారులు ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సామాన్యులకు సమాచారం ఇప్పించే ఏర్పాటు చేసినప్పుడే సమాచార హక్కుచట్టం మనుగడ సాధ్యం.
– అంకం నరేష్