రైట్ టు రీకాల్ ను శాసనమండలిలో ప్రవేశపెడతా: తీన్మార్ మల్లన్న

నవతెలంగాణ – తుర్కపల్లి
రైట్ టు రి కాల్ ను శాసనమండలిలో ప్రవేశపెడతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( అలియాస్ చింతపండు నవీన్ కుమార్) అన్నారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ఆత్మీయ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైట్ టు రీ కాల్ వలన ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఐదు సంవత్సరాలలో పాటు కొనసాగకుండా ప్రజలకు ఎలాంటి సేవ చేయని నాయకులను వెంటనే రైట్ టు రీ కాల్ చేసి ప్రజా ప్రతినిధుల అధికారము నుండి తొలగించే పద్ధతిని రైట్ టు రీకాల్ అని అంటారని అన్నారు. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎన్నికల్లో నిలబడే ముందు ప్రజాసేవ చేసే గుణం, లక్షణాలు ఉన్న వారే రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. ఎలాంటి సేవ చేయని రాజకీయ నాయకులకు బదులు అధికారులు  వ్యవస్థను తీసుకొని వచ్చి అధికారులే పాలన చేసే విధంగా రాబోవు కాలంలో కృషి చేస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్న తర్వాత ఐదేళ్లు పాలన చేయకుండా ఉండే నాయకులకు తగిన విధంగా గుణపాఠం జరుగుతుందని అన్నారు.
ఇలాంటి పద్ధతులు విదేశాల్లో విజయవంతం అవుతున్నట్లు రాబోవు కాలంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ వ్యవస్థ విజయవంతం అవుతుందని అన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యానికి పెద్దపీట వేసి ప్రజలను అన్ని విధాలుగా ముందుకు తీసుకొచ్చే అభివృద్ధి చేస్తానని అన్నారు. తను చదువుకున్న తన సొంత గ్రామమైన మాదాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలకు తన నిధులనుండి 50 లక్షల రూపాయలను వెచ్చించి మోడల్ హైస్కూల్ గా తయారు చేస్తున్నట్లు తెలిపారు. అందుకుగాను తన వంతుగా తన తండ్రి  పేరు మీద ఐదు లక్షల రూపాయలను ఈరోజు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క నాయకుడు, ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు తన గ్రామాల్లో చదువుకున్న పాఠశాలలకు తన వంతు చేయూతను అందించి ప్రభుత్వ  పాఠశాల విద్యను మెరుగయ్యే విధంగా చూడాలని అన్నారు. కన్నతల్లిని ఉన్న ఊరును ఏనాడు మర్చిపోవద్దని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలుగా ఐదేళ్ల కాలంలో విరమణ ఉంటుంది, కానీ జీవితంలో గ్రామాలను సేవచేసే వానికి విరమణ ఉండదని అన్నారు. అనంతరం ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, జెడ్పి వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్ ,వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యాంసుందర్,ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, తహసిల్దార్ దేశ నాయక్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకులు ఇన్నారెడ్డి, ఎంపీటీసీలు బో రెడ్డి వనజ హనుమంత రెడ్డి, పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్, మోహన్ బాబు నాయక్ ,కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి ,ప్రతిభ రాజేష్ నాయక్, బోళ్ల కనకమహాలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.