పెరుగుతున్న వ్యక్తిగత రుణాలు

పెరుగుతున్న వ్యక్తిగత రుణాలు– ఆరేండ్లలో మూడు రెట్ల పెరుగుదల
న్యూఢిల్లీ : బ్యాంకులు, బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) నుండి ప్రజలు తీసుకుంటున్న వ్యక్తిగత రుణాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. గత ఆరు సంవత్సరాల్లో ఈ రుణాలు దాదాపు మూడు రెట్లు పెరిగి ఈ సంవత్సరం మార్చి 31 నాటికి 51.7 ట్రిలియన్‌ రూపాయలకు చేరాయి. బ్యాంకులు అందిస్తున్న మొత్తం రుణాల్లో ఇవి 30.3%గా ఉన్నాయి. 2017 మార్చి 31న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చిన వ్యక్తిగత రుణాలు 18.6 ట్రిలియన్‌ రూపాయలు (మొత్తం రుణాల్లో 21.5%) మాత్రమేనని రేటింగ్‌ సంస్థ కేర్‌ఎడ్జ్‌ ఓ నివేదికలో తెలిపింది. వినియోగ రుణాలుగా పిలిచే వ్యక్తిగత రుణాల్లో వృద్ధి రేటు మిగిలిన బ్యాంకింగ్‌ రంగ రుణాల (వ్యాపార రుణాలు) కంటే దాదాపు రెట్టింపు ఉంది. 2017-2023 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చిన మొత్తం రుణాల వృద్ధితో పోలిస్తే వ్యక్తిగత రుణాల వృద్ధి ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంది. వ్యక్తిగత రుణాల్లో హామీ లేని రుణాలే అధికంగా ఉంటున్నాయి. మొత్తంగా తీసుకున్న వ్యక్తిగత రుణాల్లో హామీ లేకుండా పొందినవి ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఎన్‌బీఎఫ్‌సీలు ఎలాంటి హామీలు పొందకుండా చిన్న మొత్తాల్లో రుణాలు అందించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు ఇచ్చిన వ్యక్తిగత రుణాల్లో లక్ష రూపాయల కంటే తక్కువ మొత్తం ఇచ్చిన రుణాలు 85% ఉండడం విశేషం. యాభై వేల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఇచ్చిన అప్పులు కూడా అధికంగానే ఉన్నాయి. మొత్తం రుణాల విలువతో పోలిస్తే ఇవి రెండు రెట్లు ఎక్కువ. హమీ ఇవ్వకుండా వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. కొనుగోలు శక్తి పెరగడం, ఇంటర్నెట్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ఫీచర్‌ ఫోన్లు అందుబాటులో ఉండడం, డిజిటల్‌ చెల్లింపుల పద్ధతిని అనుసరించడం వంటివి కొన్ని కారణాలు.
వినియోగదారుల వ్యవహార శైలి కూడా ఓ కారణమే. వినియోగం పెరగడంతో వ్యక్తిగత రుణాలు తీసుకోవడం కూడా ఎక్కువవుతోంది. అయితే దీనివల్ల కుటుంబ అప్పులు కూడా పెరుగుతున్నాయి. కుటుంబాలు చేస్తున్న పొదుపుపై ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 47 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పొదుపు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబ పొదుపు జీడీపీలో 5.1% మాత్రమే. వినియోగ డిమాండ్‌ను తీర్చుకోవడానికి ప్రజలు ఎక్కువగా అప్పులపై ఆధారపడడమే దీనికి కారణం. ముఖ్యంగా 2020-21 తర్వాత కుటుంబ పొదుపు బాగా పడిపోయింది. ఆదాయం తగినంత ఉన్నప్పుడు రుణాల పెరుగుదల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేర్‌ఎడ్జ్‌ తెలిపింది. అయితే ఆదాయం సరిగా లేకపోయినా అప్పులు చేస్తుంటే రుణాల చెల్లింపులో సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి హామీలు తీసుకోకుండా ఇచ్చే రుణాలకు సంబంధించి ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.