– సీఎంఐఈ తాజా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో 20-34 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగం పెరుగుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తన తాజా నివేదికలో తెలియజేసింది. దీని ప్రకారం… గత సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 20-24 సంవత్సరాల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం 43.65% (గత సంవత్సరం జూలై-సెపెంబర్ మధ్య) నుండి 44.49%కి పెరిగింది. మరోవైపు 25-29 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో నిరుద్యోగం ఇదే కాలంలో 13.35% నుండి 14.33%కి పెరిగింది. 25-29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో నమోదైన 14.33% నిరుద్యోగం 14 త్రైమాసికాలలో అత్యధికం కావడం గమనార్హం. 30-34 సంవత్సరాల మధ్య వయస్కులలో నిరుద్యోగ రేటు కూడా 2.06% నుండి 2.49%కి పెరిగి పది త్రైమాసికాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. పట్టణ నిరుద్యోగంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగమే అధికంగా ఉన్నదని సీఎంఐఈ తెలిపింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 20-24 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి (43.79%) చేరింది. ఈ రేటు 25-29 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 13.06%, 30-34 సంవత్సరాల మధ్య వయస్కులలో 2.24%గా నమోదైంది.
దీనికి భిన్నంగా పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ రేటులో కొంత మెరుగుదల కన్పించింది. 2023-24 సంవత్సరపు రెండో త్రైమాసిక కాలంతో పోలిస్తే మూడు, నాలుగు త్రైమాసికాలలో 20-24, 30-34 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో నిరుద్యోగం తగ్గింది. 20-24 సంవత్సరాల వారిలో నిరుద్యోగ రేటు 47.61% నుండి 45.98%కి, 30-34 సంవత్సరాల వారిలో 3.04% నుండి 3.29%కి తగ్గిపోయింది. అయితే 25-29 సంవత్సరాల వారిలో మాత్రం నిరుద్యోగ రేటు 15.61% నుండి 16.54%కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగానికి సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ జాతీయ ఉపాధి హామీ చట్టం నుండి తీసుకున్న గణాంకాలు, సీఎంఐఈ గణాంకాల మధ్య సామీప్యత కన్పించింది. గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టం ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో గ్రామీణ కుటుంబాలు 1.3% ఎక్కువ పనిని డిమాండ్ చేశాయి. అయితే రెండో త్రైమాసికంలో నమోదైన 15.1% పెరుగుదలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సీఎంఐఈ సమాచారంపై కొందరు ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపింది. నెలవారీ గణాంకాలలో కన్పిస్తున్న అస్థిరతను వారు ఇందుకు కారణంగా చూపుతున్నారు. అయినప్పటికీ సీఎంఐఈ సమాచారానికి ప్రాధాన్యత ఉంది. దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్న ఏకైక సంస్థ ఇదే. నిరుద్యోగ రేటుకు సంబంధించి సీఎంఐఈ అందిస్తున్న సమాచారం నెలనెలకూ మారుతుంటుంది. అనధికారిక రంగంలో ఉన్న ఉద్యోగాలు శాశ్వతాలు కాకపోవడమే దీనికి కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్ తెలిపారు.