రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ఆ సర్కారుకు, దాని సారధి రేవంత్‌కు, ఆయన మంత్రివర్గ సహచరులకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఏడాది కాలంలో తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించటం ద్వారా ప్రజా పాలనను తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చెబుతోంది. కొన్ని విషయాల్లో ఇది వాస్తవమే. వారంలో మూడు నాలుగు రోజులు ముఖ్యమంత్రి సచివాలయంలో కార్యకలాపాలు, సమీక్షలు నిర్వహించటం, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్షాలను కలవటం, హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ ప్రజావాణిని నిర్వహించి, అర్జీలు స్వీకరించటం, ధర్నాచౌక్‌లో ఆందోళనలకు అవకాశమివ్వటం తదితరాంశాలు ఈ కోవలోనివే. లగచర్ల భూ సేకరణ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గటం కూడా హర్షించదగ్గదే. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన్నే జీతాలు, 50 వేలకు పైబడి ఉద్యోగ నియామకాలు, రైతు రుణమాఫీకి పూనుకోవడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు ప్రభుత్వానికి సానుకూ లాంశాలు. ఈ ఏడాది కాలంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు, పలు కంపెనీలతో ఒప్పందాలు, పెట్టుబడులను ఆహ్వానించటం, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మొదలైనవి తమ ఘనతలుగా సీఎం రేవంత్ చెబుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు.
ఇక రెండో వైపు చూస్తే గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు, సర్పంచుల ధర్నాలు, ఆశాల ముట్టడులు, విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాల గర్జనలు… సర్కారును కొంతలో కొంత ఇరకాటంలో పెట్టాయని చెప్పక తప్పదు. వీటిలో కొన్ని రాజకీయ ప్రేరేపితం వల్లే సంభవించాయన్న ఆరోపణలూ ఉన్నాయి. గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ వేసింది, దాని రిపోర్టు వస్తేగానీ నిజానిజాలు నిగ్గుతేలవు.
కానీ ఆరు గ్యారెంటీల అమలుపై తగినంత శ్రద్ధ పెట్టకపోవటం, నిధుల్లేవనే సాకుతో వాటిపై కాలయాపన చేయటాన్ని రాష్ట్ర ప్రజానీకం నిశితంగా గమనిస్తోంది. ‘నిధుల్లేవనే సాకుతో ఆరు గ్యారెంటీల అమలును విస్మరించబోం, వాటిని కచ్చితంగా అమలు చేసి తీరతాం…’ అంటూ మంత్రి పొంగులేటి స్పష్టం చేసినా…’వాటిని ఎప్పటిలోగా, ఎలా అమలు చేస్తారు…’ అనే ప్రశ్న ఉదయించక మానటం లేదు. ఏడాది కాలంగా ప్రభుత్వం చెబుతున్న అప్పులు, వాటికి వడ్డీలు, వాటిపై శ్వేతపత్రాల నేపథ్యంలో… ఇన్ని అప్పులున్నప్పుడు సంక్షేమ పథకాలను ఎలా నిర్వహిస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. దీనిపై స్పష్టతనిచ్చి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కారుదే.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనను చూసి, విసిగిపోయిన తెలంగాణ ప్రజానీకం… అనేక ఆశలు, ఆకాంక్షలతో కాంగ్రెస్‌కు పట్టంగట్టింది. ఏడాది వరకూ వాటిపై ఓపిక పట్టిన వివిధ తరగతులు…మెల్లగా ఆందోళనల బాట పడుతున్న వైనాన్ని మనం విస్మరించకూడదు. డీఎస్సీ-2008 బాధితులు, పోడు రైతులు, చేనేత కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, వికలాంగులు, మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు. వీరేగాక ఇతర అనేక సెక్షన్ల ప్రజానీకం డిమాండ్ల సాధన కోసం గొంతెత్తుతున్నారు. తమది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం… వీటిపై తక్షణం దృష్టి సారించాలి. అన్నప్రాసన్నాడే శిశువు ఆవకాయ పచ్చడి తినలేదు.. కానీ తొలి జన్మదినోత్సవం జరుపుకునే నాటికి కనీసం గోరు ముద్దలైనా తినాలి కదా..? ఇప్పుడిదే ప్రశ్న తెలంగాణ జనాల మదిలో మెదులుతోంది.
ఈ వాస్తవాన్ని గమనించి, కాంగ్రెస్ సర్కారు అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులు, సమాలోచనలతో సహేతుకమైన ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం అవసరం.
‘అధికారపక్షంగా మేం విజ్ఞతతో, బాధ్యతతో, దక్షతతో వ్యవహరిస్తాం…’ అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కానీ ఆచరణలో దాన్ని అమలు చేయని కారణంగా ఆయన ఇప్పుడు ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సిన దుస్థితి. ‘రైజింగ్ తెలంగాణ’ అంటూ ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ ప్రభుత్వానికి ఆ పరిస్థితి రాకూడదని కోరుకుందాం. ఈ కోరిక నెరవేరాలంటే కాంగ్రెస్ సర్కారు పెద్దలు… తామిచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టి, వ్యక్తిగత విమర్శలు, దూషణలు, భాషణలను తగ్గించాలి. అప్పుడే ‘రైజింగ్ తెలంగాణ…’ అనే టైటిల్‌కు నిజమైన సార్థకత చేకూరుతుంది. అలా చేసినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండో ఏడాది ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.