ఆపదలో ఆదుకున్న రైస్ మర్చంట్ రిత్విక్ 

– యువతకు ఆదర్శంగా నిలిచిన ఎస్సై జి.సతీష్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
అత్యవసర పరిస్థితుల్లో ఓ మహిళకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ముస్తఫానగర్ కాలనీకి చెందిన హోల్ సేల్, రిటైల్ మర్చంట్ కె.రిత్విక్ సోమవారం తన రక్తాన్ని ఇచ్చి ఆదుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆళ్ళపల్లి మండలం నవతెలంగాణ రిపోర్టర్ మహమ్మద్ ఫయీమ్ బంధువుకు ఖమ్మంలోని శ్రీకృష్ణ ప్రైవేట్ ఆస్పత్రిలో రక్త పరీక్షలు నిర్వహించగా పేషెంట్ కు రక్తం తక్కువగా ఉందని, ఆపరేషన్ నిమిత్తం “ఓ” పాజిటివ్ బ్లడ్ కావాలని వైద్యులు తెలిపారు. దాంతో రిపోర్టర్ వాట్సాప్ మాధ్యమంగా విషయం తెలపడంతో మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండల కేంద్రంలో ఓ నిరుపేద కుటుంబ నేపథ్యంతో చిన్ననాటి నుంచి పట్టదలతో శ్రద్ధగా చదివి ఎస్సైగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన జి.సతీష్ స్పందించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని సీపీ ఆఫీస్ లో ఎస్సై(ఏఆర్)గా విధులు నిర్వహిస్తున్న జి.సతీష్.. తానే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన సుమారు 5 వేల మంది రక్త దాతలతో స్థాపించిన “వన్ లైఫ్ బ్లడ్ బ్యాంక్” ఉచిత సేవా సంస్థ తరుపున వెంటనే పంపించగా రిత్విక్ వచ్చి తన “ఓ” పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. అనంతరం రిత్విక్ మాట్లాడుతూ.. ఎంతోమంది నిరుపేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో సకాలంలో ఎస్సై సతీష్ ఉచిత బ్లడ్ బ్యాంక్ సేవా సంస్థ ద్వారా రక్తాన్ని అందించారని, మరికొందరిని వివిధ ఆసుపత్రుల్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాల్లో అనేక మంది పేదలను ఆదుకుని ఎస్సై అండగా నిలిచారని అన్నారు. ఈరోజు నేను రక్తం ఇవ్వడానికి కారణం ఎస్సై సతీష్ అని, ఆయన స్థాపించిన ఉచిత బ్లడ్ డొనేషన్ సేవా సంస్థలో నేను ఒక సభ్యడినని పరిచయం చేసుకున్నారు. ఎస్సై సతీష్ మాలాంటి ఎంతోమంది యువతకు ఆదర్శమని, ఆయన ఉదార సేవలను కొనియాడారు. తదనంతరం ఎస్సై సతీష్ చరవాణి ద్వారా ఆపరేషన్ బాధితురాలి యోగ క్షేమాలు, ఆర్థిక స్థితిగతులను అడిగితెలుసుకున్నారు. మరెవరైనా ఆరోగ్యపరంగా అత్యవసర సమయాల్లో నా ఫోన్ నెంబర్ 9866919343ను సంప్రదించాలని సూచించారు. అమూల్యమైన సేవలను అందిస్తున్న వన్ లైఫ్ బ్లడ్ బ్యాంక్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు జి.సతీష్, రిత్విక్ లను పలువురు ఉమ్మడి ఆళ్ళపల్లి, గుండాల మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేసి, వాట్సాప్ మాధ్యమంగా అభినందనలు తెలిపారు.