సీట్ల సర్దుబాటులో సమస్యల్లేవు ఆర్జేడీ, జేడీయూ ప్రకటన

– విభేదాలు బీజేపీ సృష్టేనని ఆగ్రహం
పాట్నా: బీహార్‌లో అధికారంలో ఉన్న మహా కూటమిలోని సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి విభేదాలు, సమస్యలు లేవని ఆర్జేడీ, జేడీయూ పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. జేడీయూ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి విజరు కుమార్‌ చౌదరి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య…ముఖ్యంగా కీలక పార్టీలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు పెరిగాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై చౌదరి స్పందిస్తూ అంతా సజావుగా సాగుతోందని, అధికార కూటమి బలంగా ఉన్నదని చెప్పారు. ‘ఈ కథనాలు, ఊహాగానాలు అన్నీ మీడియా సృష్టే. ఎలాంటి సమస్యలు లేవు’ అని జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు సన్నిహితుడు అయిన చౌదరి వ్యాఖ్యానించారు. మహా కూటమిలో ఎవరికీ అసంతృప్తి లేదని కూడా ఆయన చెప్పారు. సీట్ల సర్దుబాటును సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని, లేకుంటే ఎన్నికల అవకాశాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా చౌదరి సోమవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవిల అధికార నివాసానికి వెళ్లి వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. తద్వారా మహా కూటమిలో విభేదాలు లేవని సంకేతాలు పంపారు. కూటమిపై మీడియాలో వస్తున్న వార్తల వెనుక బీజేపీ ప్రమేయం ఉన్నదని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తాయని వార్తలు వస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, వామపక్షాలకు మిగిలిన స్థానాలు వదిలిపెడతారని సమాచారం. బీహార్‌లో ఎన్డీఏని నిలువరించేందుకు ఈ రెండు పార్టీలు ఓ ఫార్ములాను కూడా రూపొందించాయి. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా ఆర్జేడీ, జేడీయూ కలిసి 16 లేదా 17, కాంగ్రెస్‌ 4-6, వామపక్షాలు 1-2 సీట్లకు పోటీ చేస్తాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టి బరిలో దిగిన జేడీయూ 17 స్థానాల్లో పోటీ చేసి 16 చోట్ల గెలిచింది. ఈ కూటమి మొత్తంమీద 39 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఒక సీటు రాగా ఆర్జేడీకి ఒక్కటి కూడా అది కూడా దక్కలేదు.