– శిక్షణనిచ్చి కమ్యూనిటీ పారామెడికల్‌గా ప్రభుత్వ గుర్తింపునివ్వాలి: ప్రభుత్వానికి ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆర్‌ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలని తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక నాయకులు మాట్లాడారు. కొద్ది రోజులుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అకారణంగా దాడులు చేస్తూ గ్రామీణ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 1273 ద్వారా ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ పారామెడికల్‌గా గుర్తింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. రెండు విడతలుగా దాదాపు 12 వేల మందికి శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కార్ తమ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ గుర్తింపు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని రమేష్, ఐక్య వేదిక నాయకులు చొప్పరి శంకర్ ముదిరాజ్, బాలబ్రహ్మచారి, డాక్టర్ వెంకట్‌రెడ్డి, భాస్కర్, రవిశంకర్, ఎండీ. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.