ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం

– సిద్ధిపేటకు చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి
– బతుకుదెరువు కోసం వెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-అక్కన్నపేట
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్‌, సురేష్‌, వాసుగా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ములు నలుగురూ కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. ఐదురోజుల కిందట వీరి స్వగ్రామమైన చౌటపల్లిలో బంధువు ఎరుకల కనుకయ్య మృతిచెందారు. అతడి అంత్యక్రియల కోసం ఈ నలుగురూ కుటుంబ సభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబ సభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి సూరత్‌కు మంగళవారం కారులో బయల్దేరారు. అదే రోజు రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.