నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, విలువైన ప్రాణాలను కాపాడటానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని అన్నారు. ఈ చర్యలను తీసుకోవడంలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రతి శాఖ సమిష్టిగా పని చేయాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. మానవ తప్పిదాలు, వాహనాలు, అత్యధిక వేగం వలన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. రోడ్లపై రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటి రహదారి సూచనలు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారి ఇరువైపులా నిబంధనలకు అనుగుణంగా ప్రదేశాలు ఉండేలా చూడాలన్నారు. రహదారి పక్కన చెత్తను పడేయకుండా చూడాలని, అవి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉండవని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు సంభవించకుండ పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అధిక వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ పరిమితిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ శోభారాణి , రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.