ఎంపీ సురేష్ రెడ్డి చొరవతో రోడ్ల గుంతలకు మరమ్మతులు 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
గత ఆరు నెలలుగా పెర్కిట్ నుండి కమ్మర్ పల్లి వరకు జాతీయ రహదారి 63పై గతంలో కురిసిన భారీ వర్షాల మూలంగా ఏర్పడ్డ గుంతలకు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి చొరవతో ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టారు. రెండు రోజుల క్రితం చేపూర్ గ్రామానికి చెందిన ఆదిల్, కొందరు యువకులు పెర్కిట్ నుండి వాహనంలో వెళ్తుండగా కారు గుంతల్లో పడడంతో కారు టైర్ బ్లాస్ట్ అయ్యింది. అదృష్టవశత్తు  కారు ప్రమాదం తప్పింది.  అదే దారి వెంట వెళ్తున్న రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డికి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో వెంటనే ఆయన మంచిర్యాల రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో  మాట్లాడారు. గురువారం కమ్మర్ పల్లి  నుండి పెర్కిట్ వరకు ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు.ఆర్ అండ్ బి  అధికారులు జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు  కృషి చేసిన ఎంపీ సురేష్ రెడ్డికి యువకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.