భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌లో రోడ్‌షోలు

– 27న భువనగిరికి సీతారాం ఏచూరి రాక
– సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి ఎండి. జహంగీర్‌
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌ సీపీఐ(ఎం) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భువనగిరి జిల్లా కేంద్రంలో రోడ్‌ షో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం దాసరి పాండు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భువనగిరి నియోజవర్గం లో కొండమడుగు నరసింహ మునుగోడు నియోజకవర్గంలో దోనూరి నర్సిరెడ్డి ,నకిరేకల్‌ లో బొజ్జ చిన్న వెంకులు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారన్నారు. ఈ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ,కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించి సిపిఎం అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఉత్తమ పార్లమెంటీరీయన్‌ సీతారాం ఏచూరి ఈ నెల 27న మధ్యాహ్నం రెండు గంటలకు భువనగిరిలో రోడ్‌ షో లో పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ నెల 19న చౌటుప్పల్‌ కేంద్రంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు మాజీ ఎంపీ పెనుపల్లి మధు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు రోడ్‌ షోలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కమ్యూనిస్టులేని అసెంబ్లీ దేవుడు లేని దేవాలయం లాంటిదన్నారు. పోరాడే కమ్యూనిస్టులకే అధికారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరు మల్లేశం పాల్గొన్నారు.