కెనడా : ఎవరైనా వండి పెడితే బాగుండు … హాయిగా కూర్చొని తినొచ్చు ..! అని పనులు చేసీచేసీ ఓపిక లేని స్థితిలో చాలామంది అంటుంటారు. కానీ దైనందిన జీవితంలో ఎవరి ఇంటి వంట వారే చేసుకోకతప్పదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు వంట పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇంటి చాకిరీ చేస్తూ టైంతో పరుగెడుతూ ఉంటారు. మరి ఇంటి పనులన్నీ చేసి చక్కగా వంట చేసి వడ్డించి పెట్టే మాంచి రోబో ఉంటే .. ! అవునండీ … రోబో చెఫ్ వచ్చేసింది.
కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను రూపొందించింది. రెస్టరెంట్ నిపుణులు, ఏరోస్పేస్ ఇంజినీర్ల సంయుక్త కషితో ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను విజయవంతంగా తయారు చేసింది. కార్పొరేట్ వంట గదుల్లోను, రెస్టారెంట్ల వంట గదుల్లోను, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్ వంట గదుల్లోను ఉపయోగించడానికి అనువుగా ఈ రోబో చెఫ్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో దీని పనితీరును ప్రదర్శించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల నుంచి దీని పనితీరుకు ప్రశంసలు లభించాయి.
అన్నీ ఇట్టే …!
ఇది రోబో చెఫ్. ఎలాంటి వంటకాలనైనా చిటికెలో వండి వడ్డిస్తుంది. అంతేకాదండోరు … వంటగదిలోని ప్రతి పనిని ఇది స్వయంగా చేస్తుంది. ఇందులో నిక్షిప్తమైన 80 రకాల పదార్థాలు, దినుసులను ఉపయోగించి ఎలాంటి వంటనైనా ఇట్టే చేసేస్తుంది. ఇది వెయ్యి రకాల వంటకాలను వండి పెడుతుంది. వంటకం తయారైన తర్వాత తినేంతవరకు తాజాదనం చెడకుండా ఉండేలా వేడి పదార్థాలను వేడిగాను, చల్లని పదార్థాలను చల్లగాను నిల్వచేసి మరీ ఉంచుతుంది.