అసలే మనిషిని మనిషి చూసి భయపడుతూ, ముక్కుకు నోటికి ముసుగేసుకుని దొంగల్లా తిరుగుతున్న మాయదారి కాలం. తుమ్మినా, దగ్గినా ఓ మానవ బాంబు పేలినట్టు వణికిపోతున్న పరిస్థితి. మూతికి మాస్క్ అడ్డం పెట్టుకున్నప్పటికినీ, మనిషికి మనిషి ఆమడ దూరం ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరమని, లోకానికే లాక్‌డౌన్ ప్రకటించిన కరోనా కాలం. తిండి దొరకక, నిత్యావసర వస్తువులు అందక, కనీసం తాగడానికి నీళ్లు కూడా అందక జనమంతా అలమటిస్తున్న దుస్థితి. అలాంటి సమయాన ఒక అమ్మాయి ఫుట్‌పాత్ మీద ఉన్నవారికి ఫుడ్ పంచుతుంది. అక్కడెక్కడో మూసేసిన షాపుల షటర్ల చాటుకు బిక్కచచ్చి పడుకున్న ముసలి వారిని కూడా లేపి మరీ ఫుడ్, వాటర్ బాటిల్స్, బిస్కట్ ప్యాకెట్స్ ఇచ్చి వస్తుంది. దిక్కులేని ముసలివారు, అనాథ పిల్లలే కాదూ అశోక్ నగర్, ఇందిరా పార్క్ ప్రాంతంలో అన్నం దొరకని యువత కూడా చేతులు చాస్తోంది. తను ఎవరి ముఖం చూడ్డంలేదు, ఆ చాచిన చేతులని తప్ప. అచ్చం తనలాగే చార్మినార్ ప్రాంతంలో ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి సికింద్రాబాద్ వెళ్తున్న సమర్ అనేవాడు ఆమెను చూసి ఆగాడు.
”మీరు చేస్తున్న పని చాలా గ్రేట్. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది” అన్నాడు తన దగ్గరికెళ్లి.
”దీనిలో గ్రేట్ ఏముంది! ప్రాణాల్నే దాచుకోలేకపోతున్న ఈ కరోనా కాలంలో డబ్బులు దాచుకుంటే ఏమొస్తుంది. నా చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో చనిపోతే, వారి చావుకు నాదే బాధ్యత అవుతుంది. మనం ఆర్ధికంగా ఉండి కూడా మన చుట్టూ ఉన్నవారి ఆకలి తీర్చకపోవడం నా దృష్టిలో నేరమే” అన్నది తను.
ఆ మాటలతో సమర్ ఆమెను అలానే చూస్తుండిపోయాడు. ఆమె సింగరేణి నల్లబంగారం వలె మెరుస్తున్న నల్లపొన్నులా, తొలకరి దున్నకంలో లేచిపడిన నల్లరేగడి మన్ను తెరిచిన కన్నులా ఉంది. తన వైనం సుతిమెత్తని జున్నులా, నయనం విశాలమైన మిన్నులా, మాటలు మానవత్వపు వెన్నులా ఉన్నాయి. అక్కడ దారి పొడవునా అన్నం పంచిపెడుతూ వెళ్తున్న తన చేతులు విరభూసిన హిమపుష్పంలా కనిపించాయి సమర్‌కి. వెంటనే తన దగ్గరికి పరుగెత్తుకెళ్ళాడు.
”హలో యువర్ గుడ్ నేమ్?” అనడిగాడు
”సమూహ” అని చెప్పి తనపని తాను చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ సమర్ ఆలోచనలను సమూహ ఒక సముద్రంలా చుట్టుముట్టింది. ఆయన మనసులో చెరగని పచ్చబొట్టులా నిలిచిపోయింది. తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడనేది అస్సలు స్ట్రైక్ అవడంలేదు. అసలు ఎవరీ సమూహ!
అలాంటి పరిస్థితుల్లో గుండెల్లో రాయిపడ్డట్టు సమర్ ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడి పెట్టేశాడు.
”అమర్ త్వరగా రెడీ అయ్యి ఊరికి వెళదాం పద” అన్నాడు.
”సరే కానీ ఎందుకు? ఏమైంది?”
”గొర్ల సంఘం నర్సింహ చనిపోయాడట. శివ ఫోన్ చేసి చెప్పాడు.”
”అయ్యో ఎలా? కరోనాతోనేనా?”
”కాదు హార్ట్ ఎటాక్”
”హార్ట్ ఎటాకా! అదేంటి? ఆయనకు హార్ట్ ఎటాక్ రావడమేంది?”
”అవును. హార్ట్ ఎటాక్ రాక ఏం అయితది? ఊళ్లో ఉన్న గొల్ల, కురుమలందరిని కూడేశాడు. ప్రభుత్వం నుంచి గొర్లు వస్తాయని చెప్పి, అందరినీ ఒప్పించాడు. గవర్నమెంట్‌కు ప్రతి కుటుంబం చేత సుమారు నలభై అయిదు వేల రూపాయలు కట్టించాడు. అంటే ఆ ఒక్క ఊరిలోనే మొత్తం కోటి రూపాయలు డీడీల ద్వారా ప్రభుత్వానికి అందేలా చేశాడు. నేను అప్పుడే చెప్పిన. అవే డబ్బులు పెట్టి ఇంటికో ల్యాప్ టాప్ ఇప్పించండి. మీ పిల్లలు అప్‌డేటెడ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఎర్నింగ్ కూడా చేస్తారని. మన మాట ఎందుకింటారు? గొర్రెల్లాగ కసాయి దొరగారి మాటే విన్నరు. ఆ గొర్లకాపర్ల సంఘమోళ్ళు కూడా వారి రాజకీయాలకోసం గొర్రెల స్కీమ్‌కి బదులుగా మా పిల్లలకు కంప్యూటర్స్, ఎడ్యుకేషన్ స్కీమ్ పెట్టమని పోరాడలేకపోయారు. ఆ భావ దారిద్య్రాన్ని అటుంచితే, గొల్లకురుమలంతా అప్పులు చేసి మరీ డీడీలు కట్టారు. కాబట్టి కనిపించిన ప్రతివారు ఆయన్ను గొర్రెలేవి? ఇంకా రాకపాయెగా? ఏమైంది అని ప్రశ్నించేవారు. డీడీలు కట్టినా తమ ఊరికి గొర్రెలు ఎందుకివ్వరని ఎంతో పోరాడి అలిసిపోయిన నర్సింహ గుండెపోటుకు గురయ్యాడు. ప్రభుత్వ తప్పిదం ఒక మంచి మనిషి చావుకు కారణమైంది. అమర్ లెట్స్ స్టార్ట్ ది బైక్. ఈ లోపు మన మిత్రులకెవరికైనా కాల్ చేసి పెట్రోల్ కోసం ఓ అయిదు వందల రూపాయలు బదులడిగి, గూగుల్ పే చేయమంట. అసలే మనం లాక్‌డౌన్ చెక్ పోస్టులను తప్పించుకుంటూ ఊరెళ్ళాలి పద” అని బైక్ పై బయలుదేరిన సమర్, అమర్ కామ్రేడ్ నర్సింహ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వెంటనే హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అయ్యారు.
సమర్ బైక్ నడుపుతున్నాడు. మార్గమధ్యలో ఎదురుగా వెళ్తున్న ఓ బైక్ వేగంగా వచ్చి డివైడర్‌కు గుద్దుకుంది. అంతే, ఆ బైక్ నడిపే వ్యక్తి రెప్పపాటులో ఎగిరివచ్చి సమర్ నడుపుతున్న బైక్ ముందు పడ్డాడు. సమర్ సడెన్ బ్రేక్ వేసి అతనిపై ఎక్కించకుండా జాగ్రతపడ్డాడు. కానీ స్కిడ్ అయి కిందపడ్డారు. అమర్ లేచి వచ్చి, సమర్ చేయి పట్టుకుని లేపబోయాడు.
”అమ్మా…” అని అరిచాడు సమర్. అమర్ అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. భుజం తీవ్రంగా నొప్పి లేస్తుందని మూల్గుతున్నాడు. కాంపౌండర్ వచ్చి డాక్టర్ వస్తున్నారని చెప్పాడు. నిండు చెరువు మధ్యలో పసుపు వర్ణమై, విరిసిన పసిడి సొగసుల తుమ్మ పూవోలె అటునుంచి వస్తుందో యువ డాక్టర్. తను వస్తుండగానే సమర్ మూల్గుడు ఆగిపోయింది. శివుని మెడలో నాగుపాము వలె వడితిరిగినట్టుండే స్టెతస్కోప్‌ను మలిచి చేతిలో పట్టుకుని దగ్గరికొచ్చి చెకప్ చేస్తుంది.
”సమూహా” అన్నాడు సమర్
”ఎస్”
”మీరు డాక్టరా”
”ఎస్. యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్?”
”నో.. మనం అశోక్ నగర్ సిగల్ దగ్గర కలుసుకున్నాం గుర్తుందా డాక్టర్?”
”ఐ నో సమర్. బట్ యువర్ షోల్డర్ మే బి ఫ్యాక్చర్డ్. బెటర్ టూ కాంటాక్ట్ యాన్ ఆర్థోపెడిక్ డాక్టర్”
”డాక్టర్ సమూహ నా పేరు మీకెలా తెలుసు?”
”మిస్టర్ సమర్! యూ డోంట్ కాల్ మీ డాక్టర్. జస్ట్ కాల్ మీ సమూహ. ఇక మీరు ఎలా తెలుసంటే అడ్మిషన్ ఫామ్ మీద మీ పేరుంది కనుక” అని బ్లీడ్ అవుతున్న గాయాలకు ట్రీట్మెంట్ చేసింది.
”థాంక్యూ డాక్టర్”
”థాంక్యూనా.. అయితే ఈ థ్యాంక్స్ కూడా కలిపి బిల్ వసూలు చేయండి” అంటూ ప్రిస్క్రిప్షన్ పైన ఎఫ్ అని రాసి దాని చుట్టూ ఓ గీత గీసి ఇచ్చి, ”ఇది రిసెప్షన్‌లో చూపించండి” అని చెప్పింది సమూహ.
ఇదంతా ఏమీ అర్థంకాని అమర్, అది పట్టుకెళ్లి రిసెప్షన్‌లో ఇచ్చాడు.
”సర్ ఇక్కడ డాక్టర్ గారు ఎఫ్ అని రాశారు కదా! ఎఫ్ అంటే ఏంటి?”
”ఎఫ్ అంటే ఫ్రీ. మీకు వైద్యం చేసినందుకు ఏమీ ఛార్జ్ చేయలేదు. ఇక మీరు వెళ్ళొచ్చు” అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అక్కడ నుంచి బయలుదేరారు.
”ఈ డాక్టర్ ఎవరు అమర్? మనం ఏమీ అడగకుండానే సహాయం చేస్తుంది”
”నాకు తెలియదు నీకే తెలియాలి సమర్” అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కి బయలుదేరారు.
”మన దగ్గర డబ్బులు లేని ఈ పరిస్థితుల్లో భుజం విరగడం చాల దారుణం. ఫ్యాక్చర్ ట్రీట్మెంట్ అంటేనే వేల రూపాయలు ఖర్చవుతాయి. ఇప్పుడు అప్పు ఎవరిస్తారు అమర్?”
”ఎవరిచ్చేదేమిటి సమర్.. నువ్వు నీ బాల్యం నుంచి, ఇరవై ఏళ్లుగా ఆ ఎన్జీఓలో డేడికేటెడ్‌గా పని చేస్తున్నావు. నీకు చేయి విరిగిందంటే ఆ సంస్థ సహాయం చేయదా? నిన్ను బాగు చేయించుకోవాల్సిన బాధ్యత వారికి లేదా?” అమర్ అడిగాడు.
పెట్రోల్ కోసమే కనాకష్టంతో అయిదు వందలు అప్పు చేసినవారికి వేల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే సమర్ ఆ సంస్థ కోఆర్డినేటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను చీఫ్ కోఆర్డినేటర్‌తో మాట్లాడి తిరిగి ఫోన్ చేశాడు.
”మిస్టర్ సమర్ నువ్వు మన సంస్థలో ఇరవై ఐదేళ్ళు పని చేసి ఉండొచ్చు. కానీ ఈ కరోనాలో నిన్ను వేరే చోటకు ట్రాన్స్‌ఫర్ చేశాం. నువ్వు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితేనే నీకు మెడికల్ ఎయిడ్ వస్తుంది. లేకపోతే ఎంత ఎమర్జెన్సీ అయినా ఇచ్చేది లేదు” అన్నాడు చీఫ్.
”కాదండీ.. నా భుజం విరిగి ఉన్న ఈ పరిస్థితుల్లో అదెలా సాధ్యం? నయం అయ్యాక వెళ్ళమంటే బాగుంటుంది కదా! అయినా ప్రమాదంలో ఉంటే కొంచెం మానవత్వం కూడా లేకుండా ఈ పంతాలేంటి? మీ ఈ ప్రవర్తనతో మీ మానవీయత, మీరు అరిగిపోయిన టేపురికార్డర్‌లా చెప్పే కొలీగ్ షిప్ డైలాగ్ రంగు వెలిసిపోయింది. నా భుజం విరిగిన నొప్పికంటే, మీరు నన్ను ఓ శరణార్థి కంటే హీనంగా ట్రీట్ చేసిన నొప్పే ఎక్కువ బాధ కలిగిస్తుంది. మీతో మాట్లాడేంత వరకు కేవలం నా భుజం మాత్రమే విరిగింది. కానీ ఇప్పుడు నా గుండె కూడా పగిలింది”
”లేదు సమర్. నేను చాలా చెప్పి చూశాను. వాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు. ఇక నీ దారి నువ్వు చూసుకో. నేనేమీ చేయలేను” అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ అర్ధ బ్రాహ్మణ కోఆర్డినేటర్.
”సమర్ నాదొక డౌట్! ఆ ఎన్జీఓ లో పనిచేసే అగ్రకులాల వారినైతే ఇలాగే ట్రీట్ చేసేవారా చెప్పు? నువ్వు కేవలం కింది కులం వాడివి కనుకనే నీకు యాక్సిడెంట్ అయిందన్నా, భుజం విరిగిందన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆర్ధిక వివక్ష, ఆరోగ్య వివక్షతో పాటు నాకు కులవివక్ష ప్రధానంగా కనిపిస్తుంది” అంటూ అమర్ చాలా ఆవేదనగా మాట్లాడుతున్నాడు. కానీ సమర్ తన సంస్థ ఇచ్చిన షాక్‌లోంచి ఇంకా తేరుకోలేదు.
”డాక్టర్ సమూహ లాగా ఫ్రీగా వైద్యం చేయగలిగే ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరూ తెలియదా సమర్ నీకు?”
”ఈ నొప్పితో ఏమీ గుర్తుకు రావడంలేదు అమర్”
”ఏ నొప్పి? భుజం విరిగిన నొప్పినా? నీ ఎన్.జీ.ఓ కుల కుట్రల నొప్పినా?”
”ఆ.. గుర్తొచ్చింది అమర్. ఆ ఫోన్ ఇటివ్వు. హలో డాక్టర్ అరుణ్ దిస్ ఈజ్ సమర్ ఫ్రమ్ ఎన్జీవో”
”హారు మిస్టర్ సమర్. నో నీడ్ టూ మెన్షన్. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ?” అంటూ ఆయన బెంగళూరు నుంచి ఎక్స్‌రే టెక్నీషియన్‌తో మాట్లాడి ఎక్స్‌రే ఎలా తీయాలో చెప్పాడు. వాట్సాప్‌లో ఎక్స్‌రే, రిపోర్ట్ చూసి బెల్ట్, మెడిసిన్ రాశాడు. నెల రోజుల తర్వాత సమర్‌కి నయమైంది. మొదటి దశ లాక్‌డౌన్ సడలించారు. తనని ఎన్జీవో వారు కాదన్నప్పటికీ, గతంలో సమర్ దగ్గర మిగిలిపోయిన పనులన్నిటిని పూర్తి చేయడంలో నిమగమయ్యాడు. యురేనియం నిక్షేపాలున్న నాగార్జునసాగర్ ప్రాంతంలో రేడాన్, థోరాన్ లాంటి విష వాయువులు వెలువడుతున్నాయని వచ్చిన సర్వేపై స్పందించాలని, వైద్యుల, నిపుణుల బృందాన్ని అక్కడికి పంపించాలని సమర్ ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అంతకు ముందే సమర్ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ట్రైబ్స్‌తో మాట్లాడి వచ్చాడు. ఇలాంటి పనుల్లో నిమగమై పనిచేస్తూ ఓ రాత్రి రూమ్‌కి చేరుకున్నాడు. వెళ్ళేసరికి అమర్ తలకు నూనె రాసుకుంటున్నాడు.
”ప్లీజ్ అమర్.. అదే చేయితో నా తలకు కూడా కొంచెం ఆయిల్ పెట్టావా?” అని రిక్వెస్ట్ చేశాడు సమర్.
”సరే తల ఇలా పెట్టు. హెడ్ మసాజ్ కూడా చేస్తా, దెబ్బకు నిద్రపోతావు”
”అదేంటి అమర్! ఆయిల్ స్మెల్ రావడంలేదు?”
”ఏందీ వాసనొస్తాలేదా? నాకు ఇంత బాగా పారాషూట్ ఆయిల్ స్మెల్ వస్తుంది కదా మరీ!”
”అవునా! అయితే నువ్ ఇక దూరంగ జరుగు.”
”ఏంకాదు లేగాని ఆయిల్ మంచిగ పెట్టనివ్వు ముందు” అని సమర్‌ని అదిమిపట్టి మరీ ఆయిల్ పెట్టాడు అమర్. అప్పటివరకు మాట్లాడకుండ కూర్చున్న సమర్ వెళ్ళి సబ్బు, నిమ్మకాయ వాసన చూశాడు. స్మెల్ కొంచెం కూడా రాలేదు. వెంటనే మూతికి కర్చీఫ్ కట్టుకుని బయలుదేరాడు ఒంటరిగా.
”మిస్టర్ సమర్ మీకు కరోనా రాలేదు. ఒకవేళ వచ్చినా ఏమి కాదు నేనున్నాకదా? మీ మూతికి ఆ కర్చీఫ్ తీయండి”
”మీరున్నారనే నేను కర్చీఫ్ తీయడం లేదు సమూహ. నాకు పక్కా కరోనా వచ్చిందనిపిస్తుంది”
”మేం అలా భయపడితే ఈ మెడికల్ ప్రొఫెషన్‌లో ఉండలేం కానీ కర్చీఫ్ తీసి మాట్లాడకుండా కూర్చో. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావని తీయమంటున్న. భయపడకు నాకు మాస్క్ ఉంది కదా!”
”నేను భయపడుతున్నా అనుకుని ధైర్యం కలిగించడానికి అలా చెప్తున్నావని నాకు అర్థమైతుంది డాక్టర్. కానీ నాకేమీ భయంలేదు. మీ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరూ లేరా?”
”ఈ రాత్రి టైంలో ఎవరుంటారు? అందరూ వెళ్ళిపోయారు. అయినా నేను ఇంటర్ చదివేప్పుడు ఈవినింగ్ టైంలో ల్యాబ్ టెక్నీషియన్ గానే వర్క్ చేశానులే కానీ, మీరు కొంచెం సైలెంట్‌గా ఉండండి” అని చెప్పి నాసల్ స్వాబ్ ద్వారా సెక్రియేషన్ తీసి యాంటిజెన్‌లో వేసి టెస్ట్ చేస్తుంది.
”డాక్టర్ గారు వెళ్ళి వాటర్ తాగవచ్చా?”
”తాగొచ్చు కానీ అన్నం తిన్నారా?”
”లేదు” అంటుండగానే ఆ యాంటిజెన్‌లో రెండు రెడ్ లైన్స్ వచ్చాయి.
”ఓ కంగ్రాట్స్ సమర్. యూ గాట్ కరోనా పాజిటివ్” అంటూ టెస్ట్ కోసం యూజ్ చేసిన కిట్స్, గ్లౌసెస్‌ను జాగ్రత్తగా డస్ట్‌బిన్‌లో వేసి వాటిపై స్పిరిట్ పోసింది.
”సమర్ మీ కర్చీఫ్ తీసి జేబులో పెట్టుకో మాస్క్ ఇస్తాను”
తను చేతులకు స్పిరిట్ రాసుకుని సమర్ చేతిపై కూడా స్ప్రే చేసి మాస్క్ ఇచ్చింది.
”పద తినడానికి వెళదాం”
”ఎక్కడికి డాక్టర్ వెళ్ళేది? మీరు ఏమంటున్నారో నాకు అర్ధం అవడం లేదు”
”ఇదిగో సమర్ మళ్ళీ డాక్టర్ అంటున్నావు. నన్ను డాక్టర్ అనొద్దని చెప్పానా లేదా? కాల్ మీ ఓన్లీ సమూహ. నువ్వు తినలేదన్నావు. నాకు కూడా బాగా ఆకలేస్తుంది. గెటప్, లెట్స్ మూవ్ అండ్ ఫాలో మీ. సమర్ ఎలా వచ్చావు బైక్ తెచ్చావా?”
”నో. నడుస్తూనే వచ్చాను”
”అయితే ఓకే నా స్కూటీ ఎక్కు” అని స్టార్ట్ చేసి కూర్చుంది. సమర్ బిక్క మొఖంతో చూస్తున్నాడు.
”ఊ.. డోంట్ వేస్ట్ టైం. లెట్స్ గెట్ ఆన్ సమర్” అనడంతో బైక్ ఎక్కి వెనకాల కూర్చున్నాడు.
”నాకొచ్చిన రోగమేంది? డాక్టర్ నన్ను బైక్ ఎక్కమనుడేంది? దయ్యాలతో సంసారం అన్న సామెత విన్నాం. కానీ ఈవిడగారు ఏకంగా కరోనాతో కాపురం చేసేలా ఉందేంటి?” అని సమర్ అనుకుంటుండగానే హిమాయత్‌నగర్ హోటల్ ముందు బైక్ ఆగింది.
”మిస్టర్ సమర్ ఇది అంతపెద్ద ప్రమాదమైన రోగం ఏమీ కాదు. కానీ ప్రమాదకరమని భయపెట్టారు అంతే. నీవు నా పర్యవేక్షణలో ఉన్నావు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించు ప్రశాంతంగా ఉండు. తినడానికి తప్ప దేనికీ నోరు తెరవకు. కేవలం తినేటప్పుడు మాత్రమే మాస్క్ తీసి జేబులో పెట్టుకో. ఏదీ ముట్టుకోకు. నీకు ఏం కావాల్సొచ్చినా నాకు చూయించు నేను వడ్డిస్తాను” అని చెప్పి సమర్‌కి కింది నుంచి మీదివరకు ఫుల్ గా శానిటైజర్ స్ప్రే చేసింది. హ్యాండ్ వాష్ చేసుకుని ఒకే టేబుల్‌లో ఎదురెదురు కూర్చొని భోజనం చేసి, తిన్న పేపర్ ప్లేట్స్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి, కూర్చున్న చోట ప్రత్యేకంగా శానిటైజ్ చేసి హాస్పిటల్ కి వెళ్ళిపోయారు.
”ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ ఆఫీస్‌లో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశారు సమూహ. నేను అక్కడికి వెళ్తాను” అని సమర్ చెప్పడంతో, మెడిసిన్స్, ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్ ఇప్పించి సమర్‌ని అక్కడ డ్రాప్ చేసింది వెళ్ళింది సమూహ.
అసలు ఎవరీ సమూహ? అడగకుండానే ప్రాణహిత వచ్చి ఆదిలాబాద్ బీళ్లను తడిపినట్టు, చుక్క నీరు లేక దుమ్ములేస్తున్న రాయలసీమ నేలను కావేరి వచ్చి ముద్దాడినట్టు, ఫ్లోరిన్ గాయం సలుపుతున్న నల్లగొండను తన పరవళ్ళ పాటతో అల్లుకున్న కృష్ణమ్మలా వచ్చింది సమూహ. అసలు ఎవరీ సమూహ? ఇది సమర్‌ని వెంటాడుతున్న ప్రశ్న. ఎందుకు తనపై ఇంత బాధ్యత? పైగా డాక్టర్ అనవద్దు, పేరు పెట్టి పిలవమని అంటుంది. చూస్తే తను బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. కానీ ఎవరనేది స్ట్రైక్ అవడం లేదు. తననే అడిగితే ఏమనుకుంటుందోనని ఓ సందేహం. ఎన్నో సార్లు సమూహకి ఫోన్ చేయాలనుకున్నాడు కానీ ఆగిపోతున్నాడు. బయటకు వెళ్లకుండా ఒకే చోట ఉండి, అదే పనిగా పుస్తకాలు చదవడం, పాటలు వినడం, పుష్టిగా తినడమే పనిగా ఉంది ఐసోలేషన్‌లో. ప్రతి రోజు ఇదే పని రిపీట్ అవుతుండడంతో చిరాకు వస్తుంది సమర్‌కి. అసలే కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు తిరిగినవాడాయే. చల్లని గాలి వీచినప్పుడల్లా, వెన్నెల రాలి కురిసినప్పుడల్లా, చుక్కలు తూలి మెరిసినప్పుడల్లా సమూహ ఆలోచనలే. ఏమైనా కానీ ఇక తనని హు ఆర్ యూ అని అడగాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఫోన్ తీసుకుని 9440736 అని ప్రిస్కిప్షన్ మీదున్న నంబర్ కు ఫోన్ చేశాడు.
”హలో సమర్ చెప్పండి”
”ఆ.. హలో.. డాక్టర్.. సమూహ.. గారా.. మాట్లాడేది?” అన్నాడు మొహమాటంతో కూడిన తత్తరపాటుతో.
”నో సమర్. దిస్ ఈజ్ ఓన్లీ సమూహ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?”
”ఓకే.. ఓకే.. సమూహ. బట్ ఐ హావ్ వన్ డౌట్.”
”గో ఆన్?”
”ఎంత గుర్తు చేసుకున్నా నీవు ఎవరనేది అస్సలు గుర్తుకు రావడంలేదు సమూహ. అసలు ఎవరు నువ్వు?”
”నేను సమూహ అని నీకు తెలుసు కదా సమర్! మళ్ళీ ఎవరు నువ్వు అంటే నేనేం చెప్పాలి?”
”డోంట్ బి ఓవర్ స్మార్ట్ సమూహ. టెల్ మీ హు ఆర్ యూ? నీ అసలు పేరు సమూహనేనా? నాకెందుకో డౌట్ వస్తుంది. నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉండడమేంటి చెప్పు?”
”ఏం చెప్పాలి సమర్? చెప్పడానికి ఏముంది అసలు? ఒకటి మాత్రం చెప్తాను. నీ ఐ క్యూ ఫిట్‌నెస్ నీ స్టూడెంట్ మూమెంట్ డేస్ లా లేదని అర్థమైంది. ఇప్పుడు కరోనా వలన ఐసోలేషన్‌లో ఖాళీగా ఉన్నావు కాబట్టి నీకు ఈ డౌట్ వచ్చింది. లేదంటే ఆ డౌట్ కూడా ఇప్పట్లో వచ్చేది కాదు”
”వామ్మో నా మీద ఇంత అబ్జర్వేషనా? ముందు నీవెవరో చెప్పు డాక్టర్ సమూహ గారూ. నువ్వు ఫిజీషియన్ వా? సైక్రియాటిస్టువా?”
”నో, ఐ వోంట్ టెల్ యూ” అంటూ నార్మల్ ఫోన్ కాల్‌ని వీడియోకాల్‌గా కన్వెర్ట్ చేసింది. సెల్ ఫోన్ స్క్రీన్ మీది నుంచి, తన చూపులు లైట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాయి. తన స్పెక్ట్స్ వలన తను మరింత బ్యూటీ అనిపిస్తుంది. నిండు వేసవిలో పూసిన చెంగల్వ పువ్వులా, ఉక్కపోతలో మెరిసిన వర్షపు నవ్వులా కనిపిస్తుంది సమూహ. తను ఎవరనేది డైరెక్ట్‌గా అడిగితే చెప్పట్లేదనుకున్నాడో ఏమో మెల్లగా మాటల్లో దించాడు.
”సమూహ! లాక్‌డౌన్‌లో అందరికి ఫుడ్ సర్వ్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అలా ఒక వ్యక్తిగా ఎంతమందికి చేయగలవు చెప్పు?”
”చెప్పక తప్పదా సమర్?”
”తప్పదు సమూహ. ప్లీజ్ టెల్ మీ”
”అదంతా ఎస్‌ఎఫ్‌ఐ ఇన్స్పిరేషన్. ఒక ఎస్‌ఎఫ్‌ఐ ఓల్డ్ స్టూడెంట్‌గా అది నా కర్తవ్యం. నేను ఒక్కదాన్నేం కాదు. నాకు తోడు పదమూడు మంది డాక్టర్స్‌ని పోగేశాను. ఫుడ్ పంచడానికే పరిమితమయ్యామని ఎందుకనుకుంటున్నావు సమర్? వలస కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు, ఇతర రాష్ట్రాలకు పంపడానికి వాహనాలు ఏర్పాటు చేశాం. దిక్కులేని వారందరికి భోజనాలు, వలస కార్మికులందరు వాళ్ళ ఇళ్లకు వెళ్ళడానికి వాహనాలు ఏర్పాటు చేయాలని మా డాక్టర్ల బృందం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒత్తిడి తెచ్చాం. మనకు ఎస్‌ఎఫ్‌ఐ, సర్వ్ మాత్రమే కాదు స్ట్రగుల్ కూడా నేర్పింది కదా సమర్”
”అవును. కానీ నువ్ ఎస్‌ఎఫ్‌ఐ లో వర్క్ చేశావా? అస్సలు గుర్తుకు రావడం లేదు సమూహ”
”అయినా నాలాంటి వారు నీకెలా గుర్తుంటారు సమర్? మీటింగ్స్‌కి వచ్చినప్పుడు మా వైపు తిరిగి చూస్తే గుర్తుండేవాళ్ళం. వి ఆర్ పార్ట్ ఆఫ్ ది నేచర్ యూ నో? బట్ యూ డింట్ టర్న్ టూ అజ్. యువర్ బిహేవియర్ వాజ్ ఎగనెస్ట్ ది నేచర్. ఎట్ దట్ టైం యామ్ నాట్ లైక్ యూ, బట్ ఐ లైక్ యూ. కాబట్టి నేను నిన్ను చాలా టైమ్స్ చూసేదాన్ని. నువ్వు ఒక్కసారైనా తిరిగి చూస్తేనా! అసలు వీడు మనిషా, ఆర్గనైజేషన్ మేడ్ రోబోనా అని నాకు ఒక్కోసారి డౌట్ కూడా వచ్చేది తెలుసా! ఇప్పుడంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ అప్పుడు, ఆ టీనేజ్‌లో ఇంత సీన్ లేదు కదా? పైగా మనం ఆర్గనైజేషన్ పీపుల్స్ అయితిమి. కానీ నీ పిచ్చి డిసిప్లిన్‌ని చూసి, దూరం నుంచైనా సరే ఒరేరు రోబో మ్యాన్ అని పిలిచి పరుగెత్తాలనిపించేది. ఆ ఊహల్లో తిరుగాడుతూ ఇంటర్ పూర్తి చేసిన నాకు మెడిసిన్‌లో ‘బి’ కేటగిరి సీటు వచ్చింది. అప్పటికే నేను ల్యాబ్‌లో పార్ట్ టైం పనిచేసేదాన్ని. మేం అసలే పేదవాళ్ళం కనుక ఫీజు కట్టడానికి సరిపడా డబ్బు లేదు. నేను ఇక మెడిసిన్ మీద ఆశ వదులుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న మన ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ నాకోసం ఆ రోజుల్లో లక్షా యాభై వేల రూపాయలు పోగేసి ఇచ్చింది నేనెలా మరువగలను కామ్రేడ్ సమర్? ఆ డబ్బులు మూటగట్టి నీవిచ్చిన ఆ వైట్ కర్చీఫ్‌ను జాతీయ జెండాకంటే భద్రంగా దాచుకున్నాను తెలుసా!”
”అంటే నువ్వు స..స..సవుడమ్మవా?”
”హ.. హ.. హ.. కాదు సదువులమ్మను. సరిగా చదువుకున్నాను కనుక ఇప్పుడు సమూహను.”
”రియల్లీ ఐ సెల్యూట్ కామ్రేడ్ సమూహ. ఎంతో కష్టపడి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నావు. గ్రేట్. ఐయామ్ ప్రౌడాఫ్ యూ”
”థాంక్యూ సమర్. కానీ క్యూబా డాక్టర్లు ఆఫ్రికా గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళి వైద్యం చేసినట్టు, నల్లమల చెంచులకు, ఆదిలాబాద్ అడవుల్లోని గోండులకు, భద్రాచలం అడవుల్లోని కోయలకు, ఆదివాసీలకు ఇంకెంతో వైద్య సహాయం చేయాల్సి ఉన్నది. దానికి నీ హెల్ప్ కూడా కావాలి”
”నా హెల్ప్ తప్పకుండా ఉంటుంది. కానీ మొత్తానికి నన్ను ఇన్ని రోజులు ఆడుకున్నావన్నమాట?”
”హలో నిన్ను ఆడుకోవడం కాదు. మీదపడి రక్కాలి. నీ మీద నాకు ఎంత కసి, కోపం ఉందో తెలుసా! నిజంగానైతే నిన్ను గిరగిర తిప్పాలి, గోడకేసి అదమాలి, నీ చెవిలో రోబో మ్యా..న్.. అని గట్టిగా అరవాలి” అని ఏవేవో మాట్లాడుతుంది సమూహ. ఆ మాటల్లోని వాస్తవికత తన కళ్ళ నుంచి కన్నీళ్లలా రాలుతున్నాయి.
”హలో సమూహ.. ఈ కన్నీళ్లకు కారణమేంటి?”
”కారణమా..! ఒక రోబో మ్యాన్. అయినా అంతా అయిపోయాక కారణం అడిగితే ఏం లాభం? ముందు ఆ రోబో మ్యాన్ అనే వాడిని ప్రతిరోజూ ఒక గంటసేపైనా కొన్ని పూలను – తేనెటీగలను, పచ్చని తోటలను – సీతాకోక చిలుకలను చూడమని చెప్పు. నీటికి – మేఘానికి, ఉరుముకి – మెరుపుకి, వర్షానికి – నేలకి, నిశికి – శశికి గల కార్యకారణ సంబంధం ఏంటో కాసేపైనా ఆలోచించమను…” అని కన్నీళ్ళు తూడ్చుకుంటూ ఓ నిట్టూర్పుతో బారు చెప్పి కాల్ కట్ చేసింది.
– ఎం. విప్లవకుమార్, 9515225658