నట్టనడి సంద్రంలో రోహింగ్యాలు

Rohingyas in Nattanadi Sandra– వారిని కాపాడాలంటూ విజ్ఞప్తి
– మరింత మంది చనిపోయే ప్రమాదముందని హెచ్చరిక
ఢాకా : దాదాపు 200మంది రోహింగ్యా శరణార్ధులు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్‌ విఫలమవడంతో హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయిన వారిలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆ బోటులోని ప్రయాణికుడు ఒకరు మరణించడంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. మరింతమంది చనిపోయే ప్రమాదము ందని, ఇప్పటికే డజన్ల సంఖ్యలో ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా వుందని ఐక్యరాజ్య సమితి శరణార్ధుల హై కమిషనర్‌ (యుఎన్‌హెచ్‌సిఆర్‌) హెచ్చరించింది. బోటులో 185మంది రోహింగ్యాలు వున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలే. అండమాన్‌ నికోబార్‌ దీవులకు సమీపంలో బోటు విఫలమవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బంగ్లాదేశ్‌లో కిక్కిరిసిపోయిన శరణార్ధ శిబిరాల నుండి రోహింగ్యాలు పారిపోతున్నారు. తమ మాతృభూమి మయన్మార్‌ నుండి వచ్చేసి ఇక్కడ వారు ఆశ్రయం పొందారు.
ముస్లిం మైనారిటీలపై మిలటరీ అణచివేత చర్యలకు పాల్పడడంతో 2017లో వీరు మయన్మార్‌ నుండి పారిపోయారు. నడి సముద్రంలో చిక్కుకుపోయిన వారిని సకాలంలో కాపాడకపోతే, సమీపంలోని సురక్షితమైన ప్రాంతానికి చేర్చకపో యినట్లైతే అనేక తీర ప్రాంత దేశాలు చూస్తుండగానే వారిలో అనేకమంది చనిపోతారని యుఎన్‌హెచ్‌సిఆర్‌ హెచ్చరించింది. నిజంగా ఇది దారుణమైన పరిస్థితని వ్యాఖ్యానిం చింది. మయన్మార్‌లో తమపై జరుగుతున్న వేధింపులు భరించలేక వేలాదిమంది రోహింగ్యాలు ముప్పుతో కూడిన సముద్ర ప్రయాణాలు చేస్తూ, ఇతర ప్రాంతాలకు ప్రధానంగా మలేసియా లేదా ఇండోనేషియాలకు తరలిపోతున్నారు. గతేడాది 2వేల మందికి పైగా రోహింగ్యాలు ఇలాగే ప్రయాణించారు. ఇలా ప్రయాణించే వారిలో గతేడాది నుండి 570మందికి పైగా మరణించారు.
ఈ స్థాయిలో మానవ విపత్తులు జరగకుండా నివారించేందుకు ఈ ప్రాంతంలోని దేశాలు తక్షణమే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని యుఎన్‌ హెచ్‌సిఆర్‌ స్పష్టం చేసింది.