రోహిత్‌ శతకబాదగా..

Rohit's century– రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం
– 2-0తో వన్డే సిరీస్‌ టీమ్‌ ఇండియా వశం
– రాణించిన శుభ్‌మన్‌, శ్రేయస్‌, అక్షర్‌ పటేల్‌
హిట్‌మ్యాన్‌ సూపర్‌ సెంచరీ. కటక్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం. కొంతకాలంగా పరుగుల వేటలో తంటాలు పడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (119) ఎట్టకేలకు జూలు విదిల్చాడు. కటక్‌లో కసితో కొట్టిన రోహిత్‌ శర్మ 305 పరుగుల ఛేదనను ఆడుతూ పాడుతూ ముగించేలా చేశాడు. గిల్‌ (60), శ్రేయస్‌ (44), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌) సైతం మెరవటంతో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌ ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో వన్డే అహ్మదాబాద్‌లో బుధవారం జరుగనుంది.
నవతెలంగాణ-కటక్‌
రోహిత్‌ శర్మ (119, 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచికొట్టాడు. 30 బంతుల్లోనే అర్థ సెంచరీ, 76 బంతుల్లోనే హిట్‌మ్యాన్‌ శతకం సాధించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (60, 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (44, 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌, 43 బంతుల్లో 4 ఫోర్లు) రాణించటంతో 305 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 44.3 ఓవర్లలోనే ముగించింది. మరో 33 బంతులు ఉండగానే 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (69, 72 బంతుల్లో 6 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (65, 56 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరువగా.. జోశ్‌ బట్లర్‌ (34), లియాం లివింగ్‌స్టోన్‌ (41), హ్యారీ బ్రూక్‌ (31) రాణించారు. భారత బౌలర్లలో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో సూపర్‌ సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
హిట్‌మ్యాన్‌ షో
రోహిత్‌ శర్మ (119), శుభ్‌మన్‌ గిల్‌ (60) దంచికొట్టగా ఛేదనలో తొలి నుంచీ భారత్‌ దూకుడు చూపించింది. రోహిత్‌ శర్మ ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. రెండో ఓవర్లోనే భారీ సిక్సర్‌తో దండయాత్ర మొదలుపెట్టాడు. రోహిత్‌ మెరుపులతో పవర్‌ప్లేలో భారత్‌ 77 పరుగులు చేసింది. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 30 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన రోహిత్‌ శర్మ.. సెంచరీని సైతం 76 బంతుల్లోనే బాదాడు. శుభ్‌మన్‌ గిల్‌ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్లు మెరువగా తొలి వికెట్‌కు భారత్‌ 136 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (5) విఫలమైనా.. శ్రేయస్‌ అయ్యర్‌ (44), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌) రాణించారు. 30 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన రోహిత్‌ శర్మ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ రనౌట్‌ తర్వాత కెఎల్‌ రాహుల్‌ (10), హార్దిక్‌ పాండ్య (10) నిష్క్రమించినా.. రవీంద్ర జడేజా (11 నాటౌట్‌) తోడుగా అక్షర్‌ లాంఛనం ముగించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రషీద్‌ మినహా ఎవరూ ప్రభావంతంగా బంతులేయలేదు.
రాణించిన రూట్‌
టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు సాల్ట్‌ (26), డకెట్‌ (65) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించి శుభారంభం అందించారు. జో రూట్‌ (69), జోశ్‌ బట్లర్‌ (34), హ్యారీ బ్రూక్‌ (31) మెరవటంతో ఇంగ్లాండ్‌ 330-340 పరుగులు చేసేలా కనిపించింది. బట్లర్‌ నిష్క్రమణతో ఆఖర్లో లివింగ్‌స్టోన్‌ (41) సైతం వేగంగా ఆడలేకపోయాడు. 49.5 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 304 పరుగులకు కుప్పకూలింది. జడేజా మూడు వికెట్లతో మాయ చేశాడు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ : ఫిల్‌ సాల్ట్‌ (సి) జడేజా (బి) వరుణ్‌ 26, బెన్‌ డకెట్‌ (సి) హార్దిక్‌ (బి) జడేజా 65, జో రూట్‌ (సి) కోహ్లి (బి) జడేజా 69, హ్యారీ బ్రూక్‌ (సి) గిల్‌ (బి) రానా 31, జోశ్‌ బట్లర్‌ (సి) గిల (బి) హార్దిక్‌ 34, లియాం లివింగ్‌స్టోన్‌ (రనౌట్‌) 41, జెమీ ఓవర్టన్‌ (సి) గిల్‌ (బి) జడేజా 6, గస్‌ అటిక్సన్‌ (సి) కోహ్లి (బి) షమి 3, ఆదిల్‌ రషీద్‌ (రనౌట్‌) 14, మార్క్‌వుడ్‌ (రనౌట్‌) 0, సకిబ్‌ మహమూద్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 15,
మొత్తం : (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 304.
వికెట్ల పతనం : 1-81, 2-102, 3-168, 4-219, 5-248, 6-258, 7-272, 8-297, 9-304, 10-304.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 7.5-0-66-1, హర్షిత్‌ రానా 9-0-62-1, హార్దిక్‌ పాండ్య 7-0-53-1, వరుణ్‌ చక్రవర్తి 10-0-54-1, రవీంద్ర జడేజా 10-1-35-3, అక్షర్‌ పటేల్‌ 6-0-32-0.
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) రషీద్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 119, శుభ్‌మన్‌ గిల్‌ (బి) ఓవర్టన్‌ 60, విరాట్‌ కోహ్లి (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 5, శ్రేయస్‌ అయ్యర్‌ (రనౌట్‌) 44, అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 41, కెఎల్‌ రాహుల్‌ (సి) సాల్ట్‌ (బి) ఓవర్టన్‌ 10, హార్దిక్‌ పాండ్య (సి) ఓవర్టన్‌ (బి) అటిక్సన్‌ 10, రవీంద్ర జడేజా నాటౌట్‌ 11, ఎక్స్‌ట్రాలు : 8,
మొత్తం : (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308.
వికెట్ల పతనం : 1-136, 2-150, 3-220, 4-258, 5-275, 6-286.
బౌలింగ్‌ : సకిబ్‌ మహమూద్‌ 6-0-36-0, గస్‌ అటిక్సన్‌ 7-0-65-1, మార్క్‌వుడ్‌ 8-0-57-0, ఆదిల్‌ రషీద్‌ 10-0-78-1, జెమీ ఓవర్టన్‌ 5-0-27-2, లియాం లివింగ్‌స్టోన్‌ 7-0-29-1, జో రూట్‌ 1.3-0-15-0.
ఫ్లడ్‌లైట్ల సమస్య
67 ఏండ్ల చరిత్ర కలిగిన కటక్‌ బారాబతి స్టేడియం 1982 నుంచి అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇస్తోండగా.. 2003 నుంచి డే నైట్‌ మ్యాచులకు వేదికగా నిలుస్తోంది. విజయవంతంగా భారత మ్యాచులకు ఆతిథ్యం అందించిన బారాబతి స్టేడియంకు ఆదివారం వన్డేతో ఓ మరక పడింది. భారత ఇన్నింగ్స్‌ సాగుతున్న సమయంలో స్టేడియంలోని ఆరు ఫ్లడ్‌లైట్ల టవర్లలో ఒకటి పనిచేయలేదు. పది నిమిషాల పాటు ఫ్లడ్‌లైట్ల కోసం ఎదురుచూసిన ఆటగాళ్లు.. ఆ తర్వాత మైదానం వీడారు. సుమారు 30 నిమిషాల తర్వాత ఫ్లడ్‌లైట్లను తిరిగి వెలిగించటంతో మ్యాచ్‌ పున ప్రారంభమైంది.ఒకరు తెలిపారు.
సిక్సర్ల వీరుడు
హిట్‌మ్యాన్‌ రోహిత్‌ వర్మ.. బారాబతి స్టేడియంలో బాణాసంచా పేల్చాడు. మెరుపు సెంచరీతో కదం తొక్కిన రోహిత్‌ శర్మ సిక్సర్ల పరంగా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో హిట్‌మ్యాన్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్‌పై ఆదివారం ఏడు సిక్సర్లు సంధించిన రోహిత్‌ శర్మ.. విండీస్‌ వీరుడు క్రిస్‌ గేల్‌ (331)ను దాటేశాడు. 336 సిక్సర్లతో.. షాహిద్‌ అఫ్రిది (351) తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్‌ శర్మకు కటక్‌ సెంచరీ రెండో వేగవంతమైనది. 2023 అఫ్గాన్‌పై 63 బంతుల్లోనే సెంచరీ బాదిన రోహిత్‌.. ఇంగ్లాండ్‌పై 76 బంతుల్లో శతకం పూరించాడు.