రోహిట్‌ సెంచరీతోపాటు అత్యధిక సిక్సర్లు బాదిన హిట్‌మన్‌

Rohit Hitman hit the most sixes along with the century– ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు
– బుమ్రాకు నాలుగు వికెట్లు
న్యూఢిల్లీ : ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ తొలిగా బౌలింగ్‌ ఎంచుకోగా.. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 272పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో భారత్‌ 35ఓవర్లలో కేవలం 2వికెట్లు కోల్పోయి 273పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘన్‌ జట్టులో కెప్టెన్‌ షాహిదీ(80), అజ్మతుల్లా(62) అర్ధసెంచరీలు నమోదు చేయగా.. భారతజట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(132) హవా నడిచింది. ఆ తర్వాత విరాట్‌ కోహ్లి(55నాటౌట్‌) టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ హష్మదుల్లా షాహిది కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఫ్ఘన్‌ జట్టు 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో అజ్మతుల్లాతో కలిసి 4వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాహిది 88 బంతుల్లో 8ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 89 పరుగులు చేసి కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అజ్మతుల్లా 69బంతుల్లో 62పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. చివర్లో నబీ(19), రషీద్‌ ఖాన్‌(16), ముజీబ్‌(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. బుమ్రాకు నాలుగు, హార్దిక్‌కు రెండు, కుల్దీప్‌, శార్దూల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
రోహిత్‌ రికార్డుల మోత..
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీతో వన్డే ప్రపంచకప్‌లో మూడు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో సెంచరీ చేయడంతోపాటు, అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే ఓవరాల్‌కే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గానూ రోహిత్‌ నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై కేవలం 63 బంతుల్లోనే సెంచరీ కొట్టిన రోహిత్‌.. ప్రపంచకప్‌లో ఏడో శతకం కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌ టెండూల్కర్‌(6 సెంచరీలు) రికార్డును అధిగమించాడు. సచిన్‌ 44 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు చేయగా.. రోహిత్‌ శర్మ కేవలం 19 ఇన్నింగ్స్‌లోనే 7సార్లు శతకాలు బాదాడు. ఇక భారత్‌ తరఫున వన్డే ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ 63 బంతుల్లో సెంచరీ చేయగా.. అంతకుముందు కపిల్‌ దేవ్‌ 72 బంతుల్లో సెంచరీ ఫీట్‌ను తుడిచేశాడు. అలాగే మూడుఫార్మాట్‌లలో కలిపి 551 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో క్రిస్‌ గేల్‌(550సిక్సర్లు) రికార్డును తుడిచేశాడు.
కట్టడి చేసిన బుమ్రా
బ్యాటర్ల స్వర్గధామైన అరుణ్‌జైట్లీ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును కట్టడి చేయడంలో బుమ్రా సఫలీకృతుడయ్యాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు తొలి మూడు వికెట్లను 63పరుగుల్లోపే చేజార్చుకుంది. ఆ తర్వాత 4వ వికెట్‌కు కెప్టెన్‌ షాహిదీ(80), అజ్మతుల్లా(62) కలిసి 121పరుగులు జతచేశారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత బుమ్రా ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. తొలుత జడ్రాన్‌ వికెట్‌ను కూల్చిన బుమ్రా.. చివర్లో నబీ, ముజీబుర్‌, రషీద్‌లను పెవీలియన్‌కు పంపి ఆ జట్టు భారీస్కోర్‌ చేయకుండా నిరోధించాడు. పేసర్‌ బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆఫ్ఘన్‌ జోరుకు కళ్లెం వేశాడు. 4 వికెట్లు తీసిన బుమ్రాకు తోడు.. హార్దిక్‌ పాండ్యాకు రెండు, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 9 ఓవర్లలో ఒక్క వికెట్‌ తీయకపోగా.. 76పరుగులు సమర్పించుకొన్నాడు. దీంతో ఆఫ్ఘన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది.
స్కోర్‌బోర్డు..
ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)శార్దూల్‌ (బి)హార్దిక్‌ 21, జడ్రాన్‌ (సి)రాహుల్‌ (బి)బుమ్రా 22, రహమత్‌ (ఎల్‌బి)శార్దూల్‌ 16, షాహిదీ (ఎల్‌బి)కుల్దీప్‌ 80, అజ్మతుల్లా (బి)హార్దిక్‌ 62, నబీ (ఎల్‌బి)బుమ్రా 19, నజీబుల్లా (సి)కోహ్లి (బి)బుమ్రా 2, రషీద్‌ (సి)కుల్దీప్‌ (బి)బుమ్రా 16, ముజీబ్‌ (నాటౌట్‌) 10, నవీన్‌-ఉల్‌-హక్‌ (నాటౌట్‌) 9, అదనం 15. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 272పరుగులు.
వికెట్ల పతనం: 1/32, 2/53, 3/63, 4/184, 5/225, 6/229, 7/235, 8/261
బౌలింగ్‌: బుమ్రా 10-0-39-4, సిరాజ్‌ 9-0-76-0, హార్దిక్‌ 7-0-43-2, శార్దూల్‌ 6-0-31-1, కుల్దీప్‌ 10-0-40-1, జడేజా 8-0-38-0
ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి)రషీద్‌ ఖాన్‌ 131, ఇషాన్‌ కిషన్‌ (సి)జడ్రాన్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 47, విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 55, శ్రేయస్‌ (నాటౌట్‌) 25, అదనం 15. (35ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 273పరుగులు.
వికెట్ల పతనం: 1/156, 2/205
బౌలింగ్‌: ఫరూఖీ 6-0-50-0, ముజీబ్‌ 8-0-64-0, నవీన్‌-ఉల్‌-హక్‌ 5-0-31-0, అజ్మతుల్లా 4-0-34-0, మహ్మద్‌ నబీ 4-0-32-0, రషీద్‌ ఖాన్‌ 8-0-37-2.
పాయింట్ల పట్టిక
వ.స. దేశం       ఆ గె ఓ పా నె.ర.
1. న్యూజిలాండ్‌  2 2 0 4 +1.95
2. భారత్‌      2 2 0 4 +1.50
3. పాకిస్తాన్‌     2 2 0 4 +0.92
4. దక్షిణాఫ్రికా  1 1 0 2 +2.04
5. ఇంగ్లండ్‌      2 1 1 2 +0.55
6. బంగ్లాదేశ్‌    2 1 1 2 -0.65
7. ఆస్ట్రేలియా 1 0 1 0 -0.88
8. శ్రీలంక     2 0 2 0 -1.16
9. నెదర్లాండ్స్‌  2 0 2 0 -1.80
10.ఆఫ్ఘనిస్తాన్‌  2 0 2 0 -1.90
ఆ:ఆడినవి; గె:గెలుపు; ఓ:ఓటమి; పా:పాయింట్లు; నె.ర:నెట్‌రన్‌రెట్‌