– భారత్ 231/3
– న్యూజిలాండ్‌తో తొలిటెస్ట్
బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో సమిష్టిగా రాణించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ అర్ధసెంచరీలతో కదం తొక్కారు. దీంతో టీమిండియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 231పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే ఇంకా 125పరుగులు వెనుకబడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రెండో రోజు తమను వణికించిన న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించగా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్(70నాటౌట్), విరాట్ కోహ్లీ(70) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ(52) కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించి కివీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. సర్ఫరాజ్-విరాట్ కోహ్లి కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో రోజు తొలి సెషన్ కీలకం కానుంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(35) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. అయితే.. అజాజ్ పటేల్ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. 72 వద్ద తొలి వికెట్ పడినా కెప్టెన్ రోహిత్ శర్మ(52) జోరు తగ్గించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో హడెలెత్తించిన మ్యాట్ హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదేసి హిట్‌మ్యాన్ అర్ధ శతకం సాధించాడు. కానీ, ఆ కాసేపటికే అజాజ్ పటేల్ ఓవర్లో ఊహించని విధంగా అతడు బౌల్డ్ అయ్యాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడినా విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్‌లు ఒత్తిడికి లోనవ్వలేదు. కోహ్లీ కాస్త నిదానంగా ఆడితే.. సర్ఫరాజ్ మాత్రం కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 136 పరుగులు జోడించింది. అయితే.. మూడో రోజు గ్లెన్ ఫిలిఫ్స్ వేసిన ఆఖరి ఓవర్.. చివరి బంతికి కోహ్లీ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లు అజాజ్ పటేల్‌కు రెండు, ఫిలిప్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
9వేల పరుగుల క్లబ్‌లో కోహ్లీ
టీమిండియా రన్ మెషీన్, విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. టెస్టుల్లో 31వ అర్ధసెంచరీని 9 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. విలియం ఓర్కీ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతకు చేరువయ్యాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా క్రికెటర్‌గా రికార్డుల్లో కెక్కాడు. సచిన్ టెండూల్కర్(15,921), రాహుల్ ద్రావిడ్(13,265), సునీల్ గవాస్కర్(10,212)లు ఈ మైలురాయిని అధిగమించారు.
రవీంద్ర సెంచరీ
న్యూజిలాండ్ యువకెరటం రచిన్ రవీంద్ర(134) సెంచరీతో కదం తొక్కాడు. ఓవర్ నైట్ స్కోర్ 3వికెట్ల నష్టానికి 180పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్‌ను రవీంద్ర, మాజీ సారథి టిమ్ సౌథీ(65) మెరుపు హాఫ్ సెంచరీతో భారత బౌలర్లను ఆదుకున్నారు. అంతకుముందు ఓపెనర్ డెవాన్ కాన్వే(91) సైతం అర్ధ శతకం బాదగా.. న్యూజిలాండ్ 402 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు మూడేసి, సిరాజ్‌కు రెండు, బుమ్రా, అశ్విన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 46ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్‌బి) కుల్దీప్ 15, కాన్వే (బి)అశ్విన్ 91, యంగ్ (సి)కుల్దీప్ (బి)జడేజా 33, రవీంద్ర (సి) ధృవ్ జురెల్ (బి)కుల్దీప్ 134, మిఛెల్ (సి)జైస్వాల్ (బి)సిరాజ్ 18, బ్లండెల్ (సి)రాహుల్ (బి) బుమ్రా 5, ఫిలిప్స్ (బి)జడేజా 14, హెన్రీ (బి) జడేజా 8, సోథీ (సి)జడేజా (బి)సిరాజ్ 65, అజాజ్ పటేల్ (ఎల్‌బి)కుల్దీప్ 4, రూర్కే (నాటౌట్) 0, అదనం 15. (91.3ఓవర్లలో ఆలౌట్) 402పరుగులు.
వికెట్ల పతనం: 1/67, 2/142, 3/154, 4/193, 5/204, 6/223, 7/233, 8/370, 9/384, 10/402
బౌలింగ్: బుమ్రా 19-7-41-1, సిరాజ్ 18-2-83-2, అశ్విన్ 16-1-94-1, కుల్దీప్ 18.3-1-99-3, జడేజా 20-1-72-3.
ఇండియా రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్) బ్లండెల్ (బి) అజాజ్ పటేల్ 35, రోహిత్ శర్మ (బి) అజాజ్ పటేల్ 52, కోహ్లి (సి)బ్లండెల్ (బి)ఫిలిప్స్ 70, సర్ఫరాజ్ ఖాన్ (బ్యాటింగ్) 70, అదనం 4. (49ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 231పరుగులు.
వికెట్ల పతనం: 1/72, 2/95, 3/231
బౌలింగ్: సౌథీ 7-1-22-0, హెన్రీ 11-1-52 -0, రూర్కే 11-1-48-0, అజాజ్ పటేల్ 12-2-70-2, ఫిలిప్స్ 8-1-36-1.