రోహిత్‌ శర్మ దూరం

రోహిత్‌ శర్మ దూరం– పెర్త్‌ టెస్టుకు హిట్‌మ్యాన్‌ గైర్హాజరు
పెర్త్‌ (ఆస్ట్రేలియా) : బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టుకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం అయ్యాడు!. పితృత్వ సెలవులో ఉన్న రోహిత్‌ శర్మ నవంబర్‌ 22న ఆరంభం కానున్న పెర్త్‌ టెస్టుకు అందుబాటులో ఉంటాడనే అంచనాలు ఉన్నాయి. కానీ, రోహిత్‌ శర్మ కుటుంబంతో ఉండేందుకు మొగ్గుచూపటంతో హిట్‌మ్యాన్‌ లేకుండానే భారత్‌ పెర్త్‌ టెస్టుకు సిద్ధం కానుంది. రోహిత్‌ శర్మ, రితిక దంపతులు శుక్రవారం రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌, ఆస్ట్రేలియా రెండో టెస్టు డిసెంబర్‌ 6 నుంచి ఆడిలైడ్‌లో ఆరంభం కానుంది. కానీ, నవంబర్‌ 30 నుంచి భారత్‌ మూడు రోజుల డే నైట్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. పింక్‌బాల్‌ వార్మప్‌ మ్యాచ్‌ సమయానికి రోహిత్‌ శర్మ జట్టుతో చేరనున్నాడని సమాచారం.
పెర్త్‌ టెస్టుకు భారత్‌ టాప్‌ ఆర్డర్‌ సమస్యలు ఎదుర్కొంటుంది. రోహిత్‌ శర్మ పితృత్వ సెలవులో ఉండగా.. శుభ్‌మన్‌ గిల్‌ ఎడమ చేతి బొటనవేలి గాయానికి గురయ్యాడు. దీంతో గిల్‌ సైతం తొలి టెస్టుకు అందుబాటులో లేడు. రోహిత్‌ స్థానంలో గిల్‌ ఓపెనర్‌గా వస్తాడనే అంచనాలు కనిపించాయి. ఇప్పుడు రోహిత్‌, గిల్‌ దూరం కానుండటంతో.. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కెఎల్‌ రాహుల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ ఇద్దరూ తుది జట్టులో నిలిచే అవకాశం లేకపోలేదు.