టాప్‌-5లో రోహిత్‌కు చోటు

Rohit's place in top-5– ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. ఐసిసి బుధవారం వెల్లడించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ 751 రేటింగ్‌ పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకాడు. దీంతో సెప్టెంబర్‌ 2021 తర్వాత తొలిసారి రోహిత్‌ టాప్‌-5లోకి చేరుకున్నాడు. విరాట్‌ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌ కూడా తమ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. జైస్వాల్‌ 740పాయింట్లతో 6వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 737పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. తాజా ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు మెరుగైన ర్యాంకులకు చేరారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక జట్టు చివరి టెస్ట్‌లో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, శ్రీలంకతో జరిగిన మూడో, చివరి టెస్ట్‌లో రెండుసార్లు విఫలం కావడంతో రేటింగ్‌ తగ్గింది. రూట్‌ 922 పాయింట్ల నుంచి 899 పాయింట్లకు పడిపోయినా అగ్రస్థానంలోనే ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌(859), డారిల్‌ మిచేల్‌(768) పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా) 757పాయింట్లతో 4వ స్థానంలో నిలువగా.. ఐదో స్థానంలో రోహిత్‌ ఉన్నాడు. టాప్‌ 10లో పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(720) తొమ్మిదో స్థానంలో నిలిచాడు.