విద్యావ్యవస్థ పతనంలో సంఘ్ పాత్ర

విద్యావ్యవస్థ పతనంలో సంఘ్ పాత్రవాజ్‌పేయి ప్రభుత్వంలో సంఘ్ ప్రముఖుడు మురళీ మనోహర్‌ జోషి విద్యాశాఖ మంత్రి. అశాస్త్రీయ అంశాలను బోధనాంశాలుగా విద్యాలయాల్లో అమలు చేశారు. విద్యార్థులపై ఛాందసాలను రుద్దారు. మాన వులుగా మారవలసిన మనుషులను పశు పక్ష్యాదుల స్థాయికి దిగజార్చారు. రోమ్‌ విశ్వవిద్యాలయ మతాంశాల మాజీ ఆచార్యుడు జియోవని జెంటైల్‌ ఇటలీ ఫాసిస్టు నియంత ముసోలినీ విద్యాశాఖ మంత్రి. జెంటైల్‌ సంస్కరణలతో ఈయన అమలు చేసిన విద్యా విధానంలో విద్యాలయాల్లో అగ్ర వర్ణాల వారే బోధించాలి. యూదులు, స్త్రీలు, వికలాంగులు విద్యకు అనర్హులు. ఉన్నత వర్గాలకు ప్రభు విద్యను, మధ్యములకు మత విద్యను, యూదులకు బానిస విద్యను బోధించాలి. మోడీ ‘జాతీయ విద్యా విధానం-2020’లో ఇటువంటి అంశాలతో పాటుగా విద్యను ధార్మిక సంస్థలకు అప్పగిస్తారు. సరస్వతీ మందిరాలు, దీనానాథ్‌ బాత్రా భారతీయ విద్యామండలి, ప్రజ్ఞా భారతి మొదలగు సంఫ్‌ు అనుబంధ సంస్థలే వీరి ధార్మిక సంస్థలు. విద్య, పరిశోధన, శిక్షణల భారతీయ మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి.) ఇటీవల బడుల పాఠ్యాంశాలను సంఘీకరించింది.
అన్ని వృత్తుల్లో కాషాయ సైన్య తయారీకిగాను విద్య, పోటీ పరీక్షల నిర్వాహక కాషాయాధిపతులు పోటీ పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారు. విమర్శలు వచ్చినా తమ అనుకూల అక్రమాల పోటీ పరీక్షలను సమర్థించుకుంటారు. ఆశించిన లాభం దక్కదనుకున్న పరీక్షలను కుంటి సాకులతో రద్దు చేస్తారు. నేటి నీట్‌, నెట్‌ల కుంభకోణాలకు మధ్యప్రదేశ్‌ 2013 ‘వ్యాపమ్‌’ ప్రవేశ పరీక్ష కుంభకోణం మూలం. ఇది వైద్య, ఇంజినీరింగ్‌ వృత్తి విద్యలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రవేశ పరీక్ష. నేటి కేంద్ర మంత్రి నాటి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఆయన భార్య, సోదరులు ‘వ్యాపమ్‌’ కుంభకోణంలో కూరుకుపోయారు. తమ తాత్వికులను డాక్టర్లు, ఇంజినీర్లు, శాసనాధికారులు, ఉపాధ్యాయులుగా నియమించారు. వీరి అసమర్థత వల్ల రోగులు చనిపోయారు. భవనాలు, వంతెనలు కూలాయి. లక్షల అష్టావక్రులు తయారయ్యారు.
మోడీ ప్రభుత్వం 2017లో జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ-ఎన్‌.టి.ఎ.)ను స్థాపించింది.
ఒక దేశం-ఒక పరీక్ష మోడీ లక్ష్యం. ఎన్‌.టి.ఎ, వైద్య విద్యలో ప్రవేశానికి నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)ను, విశ్వ విద్యాలయ ఉపాధ్యాయ నియామ కాలకు విశ్వవిద్యాలయాల నిధుల సంస్థ(యుజిసి)-జాతీయ అర్హత పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌-నెట్‌)ను, దేశవ్యాపిత ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రవేశానికి సంయుక్త ప్రవేశ పరీక్ష (జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌-జెఇఇ)ని, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిశోధన, ఇతర స్నాతకోత్తర విద్యలో ప్రవేశానికి నిర్వహించే కేంద్ర/ఉమ్మడి విశ్వవిద్యాల యాల ప్రవేశ పరీక్ష (సెంట్రల్‌/ కామన్‌ యూనివర్శిటి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ -సియుఇటి)ని నిర్వహిస్తుంది. ఎన్‌.టి.ఎ ఈ పరీక్షల నిర్వహణను సమాచార సాంకేతిక సంస్థలకు అప్పజెప్తుంది. అజాగ్రత్తలు, అభద్రతలు, తస్కరణలకు వీలుగా ఒకరికి బదులు మరొకరు పని చేసే విధంగా ఆ సంస్థల పని తీరు ఉంది. వాటి కంప్యూటర్లలోని సమాచారం ఆపరేటర్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా ఇతరులకు అందే అవకాశం ఉంది. ఆ సంస్థలే ప్రలోభాలకు లొంగవచ్చు. ప్రభుత్వాలే ఆ సంస్థలను ఆ పనికి పురమాయిస్తే!? ప్రమాదం ఊహకందదు. 2024 సంవత్సరానికి నిర్వహించిన నీట్‌, నెట్‌ పరీక్షల ప్రశ్నా పత్రాలు బయటకు పొక్కాయి. దీనిపై వివరణ ఇమ్మని కేంద్ర ప్రభుత్వం, ఎన్‌.టి.ఎ.లకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. విద్యార్థులతో, వారి హక్కులతో ఆడుకోవద్దని కేంద్రానికి చివాట్లు పెట్టింది. ప్రభుత్వం నెట్‌ను మరుసటి రోజే రద్దు చేసింది. నీట్‌ను రద్దు చేయలేదు. విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో అసలు దోషులు తప్పించు కుంటారు. కాని, మూలకారకులైన విద్యా సంస్థల కాషాయ కసాయిలను, వారిని నియమించిన నరమేధులను శిక్షించాలి.
మోడీ ప్రభుత్వం విద్య, పరిశోధన రంగాలకు నిధులను తగ్గించింది. విద్యాసేవలను ప్రయి వేటీకరించింది. ప్రభుత్వ కళా శాలల్లో 55,648 సీట్లు, ప్రయివేటు కళాశాలల్లో 50,685 సీట్లు మొత్తం 1,06,333 సీట్ల కోసం 2024 నీట్‌కు 24 లక్షలకు పైగా హాజరయ్యారు. ఎంపిక చేసిన కొన్ని నగరాల కళాశాలల్లో 83 బోధనాంశాల అధ్యాపక పదవుల కోసం 9 లక్షల మంది 2024 నెట్‌ రాశారు. వైద్య విద్య సీట్లు, ఉపాధ్యాయ పోస్టులు చాలా తక్కువ. ఈ కొరత కూడా అవినీతికి కారణం. ఒక్క ప్రశ్నా పత్రం రూ.30-రూ.32 లక్షలు పలికింది.కేంద్రం, రాష్ట్రాల్లో బీజేపీ పాలించే డబుల్‌ ఇంజిన్‌కు అవకాశం ఇమ్మని, అద్భుతాలు సృష్టిస్తానని మోడీ మోత మోగిస్తుంటారు.
డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాల్లోనే అవినీతి, అక్రమాలు ఎక్కువ జరిగాయి. పోటీ పరీక్షల అవకతవకలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల రాష్ట్రాలలోనే జరిగాయి. వాటిలో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బీహార్‌లలో మరీ ఎక్కువ. ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవలి పోలీసు నియామకాల్లో కూడా కుంభకోణం జరిగింది. ఇవీ మోడీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల అద్భుతాలు.
యుజిసి నెట్‌ 2024 పరీక్షలో వైదికవాద పౌరాణిక అంశాలపై ప్రశ్నలున్నాయి. పునర్నిర్మిం చిన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఎప్పుడు జరిగింది? (ప్రాణ ప్రతిష్ట రామ మంది రానికి కాదు, బాలరామునికి అన్న జ్ఞానం ప్రశ్నా పత్ర రచయితకు లేదు). హిందూతత్వ ప్రస్థాన త్రయిలోని అంశాలేవి? తలలు తెగిన తర్వాత కూడా కురు క్షేత్ర యుద్ధాన్ని చూడ్డానికి బతికిఉన్న మహాభారత యుద్ధయోధులెవరు? రామచరిత మానస్‌లో ఏ కాండలో హనుమాన్‌ దర్శనమి స్తాడు? బహుళ జవాబుల ఎంపిక ప్రశ్నల్లో ఇవి కొన్ని. ఉపాధ్యాయుల వైదికీకరణ వీటి ఉద్దేశం. వీటికి తోడు పోటీ పరీక్షల్లో అవినీతి (ప్రశ్నాపత్రాల అమ్మకం) విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. అవినీతితో పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కర్ణ ద్రోణాదులను చంపిన వీరుల్లా గర్వంతో పొంగి పోతారు. భారత కాషాయీకరణలో, నిరంకుశ పాలనలో శకుని, శల్య పాత్రలు పోషిస్తారు.
‘నీట్‌’ అవినీతి కారణంగా నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మోడీ అవినీతిని అంతం చేస్తానన్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో పరీక్షపై చర్చలు జరిపారు. కాని ఈ పోటీ పరీక్షల గందరగోళంపై నోరు విప్పలేదు. పార్లమెంటు లోపల, బయట కాషాయ విద్యా విధానాలను వివరించి, ఎదిరించి, నిరోధించాలి. కాషాయాన్ని అధిగమించే తాత్వికతను అలవర్చుకోడమేగాక..ఎన్నికల్లో భావజాల పాదార్థిక ప్రలోభాలకు, ప్రయోజనాలకు లొంగకుండా ఓట్లు వేసి సామాన్య ప్రజా పక్షపాత పాలకులను ఎన్నుకోవాలి.
సెల్‌ : 9490204545
సంగిరెడ్డి హనుమంతరెడ్డి