భారత్‌కు గులాబీ స్ట్రోక్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 175– డే నైట్‌ టెస్టులో దారుణ పరాజయం
– బ్యాట్‌తో, బంతితో రోహిత్‌సేన విఫలం
– 1-1తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సమం
టీమ్‌ ఇండియాకు గులాబీ స్ట్రోక్‌ తగిలింది. ఆడిలైడ్‌ టెస్టులో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌ బాల్‌ను ఎదుర్కొవటంలో రోహిత్‌సేన పూర్తిగా విఫలమైంది. ఇటు బ్యాట్‌తో, అటు బంతితో నిరాశపరిచే ప్రదర్శనతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో దారుణ ఓటమి చవిచూసింది. ట్రావిశ్‌ హెడ్‌, లబుషేన్‌ ఆసీస్‌కు మంచి స్కోరు అందించగా.. స్టార్క్‌, కమిన్స్‌, బొలాండ్‌ త్రయం భారత బ్యాటర్ల కథ ముగించింది. 10 వికెట్ల తేడాతో ఆడిలైడ్‌ టెస్టులో గెలుపొందిన ఆసీస్‌.. 1-1తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని సమం చేసింది.
నవతెలంగాణ-ఆడిలైడ్‌
పింక్‌ బాల్‌ టెస్టులో భారత్‌ దారుణ పరాజయం చవిచూసింది. రోహిత్‌సేన నిర్దేశించిన 19 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలోనే ఊదేసింది. నాథన్‌ మెక్‌స్వీనీ (10 నాటౌట్‌), ఉస్మాన్‌ ఖవాజా (9 నాటౌట్‌) అలవోకగా లాంఛనం ముగించారు. మరో రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో మరో మూడు టెస్టులు మిగిలి ఉండగా సమీకరణం 1-1తో ఆసక్తికరంగా మారింది. అంతకుముందు, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు కుప్పకూలింది. 128/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ మొదలెట్టిన భారత్‌.. ఓ గంట పాటు ఆసీస్‌ పేసర్లను ఎదుర్కొగలిగింది. తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42, 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (5/57) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. స్కాట్‌ బొలాండ్‌ (3/51), మిచెల్‌ స్టార్క్‌ (2/60) రాణించారు. సూపర్‌ సెంచరీతో ఆసీస్‌ను ముందంజలో నిలిపిన ట్రావిశ్‌ హెడ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టు ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్‌లో జరుగనుంది.
నితీశ్‌ ఒక్కడే.. : ఓవర్‌నైట్‌ స్కోరు 128/5తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ మరో 47 పరుగులే జోడించింది. చివరి ఐదు వికెట్లను స్వల్ప విరామంలో కోల్పోయిన భారత్‌ డే నైట్‌ టెస్టులో మరోసారి నిరాశపరిచింది. రిషబ్‌ పంత్‌ (28) ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగు జోడించకుండానే అవుటయ్యాడు. మిచెల్‌ స్టార్క్‌ ఓవర్లో పంత్‌ వికెట్‌ కోల్పోయాడు. ఉదయం సెషన్లో తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ఆ తర్వాత వరుసగా ఆలౌట్‌ దిశగా సాగింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (7), హర్షిత్‌ రానా (0), మహ్మద్‌ సిరాజ్‌ (7) తేలిపోయారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా (2 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42) భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజులో ఆసీస్‌ బౌలర్లను సౌకర్యవంతంగా ఎదుర్కొన్నాడు. మంచి షాట్లతో బౌండరీలు రాబట్టాడు. నితీశ్‌కు పంత్‌ సైతం తోడై ఉంటే.. భారత్‌ ఆసీస్‌కు కనీసం మూడెంకల లక్ష్యాన్ని నిర్దేశించేది!. 36.5 ఓవర్లలో 175 పరుగులకు భారత్‌ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 180 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు నాథన్‌ మెక్‌స్వీనీ (10, 12 బంతుల్లో 2 ఫోర్లు), ఉస్మాన్‌ ఖవాజా (9 నాటౌట్‌, 8 బంతుల్లో 1 ఫోర్‌) 3.2 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. మూడో రోజు ఆటలో లంచ్‌ విరామానికి ముందు ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పెర్త్‌ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 180/10
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 337/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (సి) కేరీ (బి) బొలాండ్‌ 24, రాహుల్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 7, గిల్‌ (బి) స్టార్క్‌ 28, కోహ్లి (సి) కేరీ (బి) బొలాండ్‌ 11, పంత్‌ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 28, రోహిత్‌ (బి) కమిన్స్‌ 6, నితీశ్‌ (సి) మెక్‌స్వీనీ (బి) కమిన్స్‌ 42, అశ్విన్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 7, రానా (సి) ఖవాజ (బి) కమిన్స్‌ 0, బుమ్రా నాటౌట్‌ 7, సిరాజ్‌ (సి) హెడ్‌ (బి) బొలాండ్‌ 7, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (36.5 ఓవర్లలో ఆలౌట్‌)175.
వికెట్ల పతనం : 1-12, 2-42, 3-66, 4-86, 5-105, 6-128, 7-148, 8-153, 9-166, 10-175.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 14-1-60-2, పాట్‌ కమిన్స్‌ 14-0-57-5, స్కాట్‌ బొలాండ్‌ 8.5-0-51-3.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : మెక్‌స్వీనీ నాటౌట్‌ 10, ఖవాజా నాటౌట్‌ 9, మొత్తం : (3.2 ఓవర్లలో) 19.
బౌలింగ్‌ : బుమ్రా 1-0-2-0, సిరాజ్‌ 1.2-0-9-0, నితీశ్‌ 1-0-8-0.