‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుషఉ్బ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈచిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మై ఫ్రెండ్ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటుడు శివాజీ, సక్సెస్‌ఫుల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్‌లు ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఇటీవల నేను ఈ సినిమా చూశాను. నేటి యూత్‌కు నచ్చే ట్రెండీ సినిమా ఇది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో వున్న నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. దర్శకుడు విక్రమ్ రెడ్డి చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిభ గల దర్శకుడు దొరికాడు. నాకు నచ్చిన ఈ సినిమా ప్రేక్షకులందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే, ఈ బ్యానర్‌లో నేను చేసిన మేం వయసుకు వచ్చాం రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా ట్రెండీ టైటిల్ ఇది. కంటెంట్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను అన్నారు.