రోడ్డెక్కిన రోటిబండ తండా మహిళలు

రోడ్డెక్కిన రోటిబండ తండా మహిళలు– జైల్లో నిర్బంధించిన లగచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్‌
– పోలీసులు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గిన మహిళలు
నవతెలంగాణ-కొడంగల్‌
వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటనలో నెలరోజుల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న రైతులపై కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని రోటిబండ తాండ మహిళలు లగచర్ల గేటు సమీపంలో శుక్రవారం ధర్నా చేశారు. సంగారెడ్డి జైలులో ఉన్న హీర్యానాయక్‌కు బుధవారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు, మిగతా ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హీర్యానాయక్‌కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో జైలులో ఉన్న తమ వారికి కూడా ఇలాగే ఏదైనా జరిగితే తమ కుటుంబాలకు దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో నిర్భంధించిన అందరినీ భేషరతుగా విడుదల చేయాలని రోటిబండ తాండ మహిళలు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పారు. కొద్ది రోజులు ఆగితే సమస్య సద్దుమణుగుతుందని, అందరికీ న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు తమవంతు కృషి చేస్తామని పోలీసులు సర్ధిచెప్పడంతో ధర్నా విరమించారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ.. కాయాకష్టం చేసుకుని కడుపు నింపుకునే తమపై ప్రభుత్వం కక్ష కట్టి, తమ భర్తలను, కొడుకులను జైల్లో నిర్బంధించి గూడుచెదిరిన పక్షుల వలే చేసిందని వాపోయారు. తాము ఎవరి జోలికి పోలేదని, ఎవరి నుంచి ఏం ఆశించలేదనీ, ఎవరి సహకారం తమకు అవసరం లేదన్నారు. ప్రభుత్వం తమ భూముల జోలికి రాకుండా ఎవరు భూములు ఇస్తారో వారివి తీసుకుని ప్రభుత్వం అనుకున్న విధంగా చేసుకోవాలని తెలిపారు.
మా భర్తలకు ఆరోగ్యం బాగాలేదు
లగచర్ల గ్రామానికి చెందిన తుడుం గోపాల్‌, నీలి రవిలకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినకుండా పోలీసులు తీసుకెళ్లి జైల్లో నిర్బంధించారని ఆయా కుటుంబ సభ్యులు తెలిపారు. నీలి రవికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని, ఎలా ఇబ్బంది పడుతున్నారోనని ఆయన భార్య సువర్ణ బాధ వ్యక్తం చేసింది. ఆయనకు ఒక పాప, ఒక బాబు ఉన్నారని, పిల్లలు నాన్న కోసం ఏడుస్తున్నారనీ కన్నీరు మున్నీరుగా విలపించింది. తుడుం గోపాల్‌కు పది నెలల క్రితం ఆపరేషన్‌ అయిందని, ఇంకా మందులు వాడేవాడనీ పోలీసులు నిర్ధాక్షిణ్యంగా జైల్లో ఉంచారని, ఇంటి దగ్గర పిల్లలను చూసుకోవడం, పొలం పనులు చూసుకోవడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. జైలులో నిర్బంధించిన అందరిపై కేసులు తొలగించి, జైలు నుంచి విడుదల చేయాలని లగచర్ల, రోటిబండ తాండ మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ప్రభుత్వం తమ భూముల జోలికి రావొద్దనీ విజ్ఞప్తి చేస్తున్నారు.